సంక్షిప్త వార్తలు

ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌) తొమ్మిదో సీజన్‌లో తెలుగు టైటాన్స్‌ పరాజయాల పరంపర కొనసాగుతోంది. సొంతగడ్డపైనా ఆ జట్టు రాత మారడం లేదు.

Published : 29 Nov 2022 02:21 IST

టైటాన్స్‌కు మరో ఓటమి

ఈనాడు, హైదరాబాద్‌: ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌) తొమ్మిదో సీజన్‌లో తెలుగు టైటాన్స్‌ పరాజయాల పరంపర కొనసాగుతోంది. సొంతగడ్డపైనా ఆ జట్టు రాత మారడం లేదు. సోమవారం గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్‌ 28-48 తేడాతో జైపుర్‌ పింక్‌ పాంథర్స్‌ చేతిలో ఓడింది. మ్యాచ్‌ ఆరంభం నుంచే టైటాన్స్‌ వెనకబడింది. ఏ దశలోనూ ప్రత్యర్థికి పోటీనిచ్చేలా కనిపించలేదు. ఒక సారి ఆలౌటైన జట్టు తొలి అర్ధభాగం ముగిసే సరికి 12-20తో నిలిచింది. విరామం తర్వాత కూడా టైటాన్స్‌ పుంజుకోలేకపోయింది. రైడింగ్‌, ట్యాక్లింగ్‌లో విఫలమైంది. అర్జున్‌ (18) జైపుర్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు. మరో మ్యాచ్‌లో యూపీ యోధాస్‌ 33-32తో బెంగాల్‌ వారియర్స్‌పై గెలిచింది. యూపీ తరపున పర్దీప్‌ నర్వాల్‌ (14), బెంగాల్‌ జట్టులో మణిందర్‌ సింగ్‌ (10) రాణించారు.


ఊర్వశికి డబ్ల్యూబీసీ టైటిల్‌

దిల్లీ: భారత బాక్సర్‌ ఊర్వశి సింగ్‌.. డబ్ల్యూబీసీ అంతర్జాతీయ సూపర్‌ బాంటమ్‌వెయిట్‌ టైటిల్‌ కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఫానన్‌ థచనోక్‌ (థాయ్‌లాండ్‌)పై ఊర్వశి సంపూర్ణ ఆధిపత్యంతో విజయం సాధించింది.


గ్రూప్‌-ఎ నుంచి  ఏ జట్లో?

దోహా: ఫిఫా ప్రపంచకప్‌ గ్రూప్‌ దశ హోరాహోరీగా సాగుతోంది. అనూహ్య ఫలితాలు.. అద్భుతమైన విన్యాసాలతో టోర్నీ ఆకట్టుకుంటోంది. ఇప్పుడిక గ్రూప్‌- ఎ నుంచి నాకౌట్‌ చేరే జట్లేవో తేలే సమయం వచ్చేసింది. ఇప్పటికే ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటములతో ఆతిథ్య ఖతార్‌ నిష్క్రమణ ఖాయమైంది. ఇక రెండు స్థానాల కోసం మూడు జట్లు పోటీపడుతున్నాయి. గ్రూప్‌లో తమ చివరి మ్యాచ్‌ల్లో మంగళవారం ఖతార్‌తో నెదర్లాండ్స్‌, ఈక్వెడార్‌తో సెనెగల్‌ తలపడుతున్నాయి. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓ గెలుపు, డ్రాతో చెరో నాలుగు పాయింట్లతో నెదర్లాండ్స్‌, ఈక్వెడార్‌ వరుసగా ప్రథమ, ద్వితీయ స్థానాల్లో ఉన్నాయి. ఒక్కో విజయం, ఓటమితో 3 పాయింట్లు సాధించిన సెనెగల్‌ మూడో స్థానంలో ఉంది. నెదర్లాండ్స్‌ నాకౌట్‌ చేరడం నల్లేరు మీద నడకే. ఖతార్‌తో మ్యాచ్‌ను డ్రా చేసుకున్నా చాలు. బలహీన ఆతిథ్య దేశం చేతిలో నెదర్లాండ్స్‌ ఓడే అవకాశాలు లేనట్లే. ఒకవేళ ఓడినా ఆ జట్టుకు ముందంజ వేసే అవకాశం ఉంటుంది. అప్పుడు ఈక్వెడార్‌ గెలవాలి. నెదర్లాండ్స్‌ ఒకవేళ మూడు లేదా అంతకంటే ఎక్కువ గోల్స్‌ తేడాతో ఓడి.. ఈక్వెడార్‌, సెనెగల్‌ మ్యాచ్‌ డ్రా అయితే తప్ప డచ్‌ జట్టు గ్రూప్‌ దాటడం ఖాయమే. మరోవైపు ఈక్వెడార్‌, సెనెగల్‌ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నాకౌట్‌లో అడుగుపెడుతుంది. ఈక్వెడార్‌ డ్రా చేసుకున్నా సరిపోతుంది. ఒకవేళ ఓటమి ఎదురైనా అవకాశం ఉంటుంది కానీ అప్పుడు నెదర్లాండ్స్‌ ఓడాలి.


ధోని కాళ్లు కదిపితే.. అదుర్స్‌

దిల్లీ: టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని తాజాగా తనలోని డ్యాన్సర్‌ను అభిమానులకు పరిచయం చేశాడు. దుబాయ్‌లో జరిగిన ఓ పుట్టిన రోజు వేడుకల్లో హుషారుగా కాళ్లు కదిపాడు. హార్దిక్‌, కృనాల్‌ పాండ్య, ఇషాన్‌ కిషన్‌ తదితరులతో కలిసి పాటలకు అనుగుణంగా స్టెప్పులు వేశాడు. ప్రముఖ ర్యాపర్‌ బాద్‌షా కూడా పాల్గొన్న ఈ విందులో సందడంతా ధోనీదే. బాద్‌షాతో కలిసి ధోని కూడా ఓ పాటకు పెదవులు కలిపాడు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. మహి డ్యాన్స్‌ అదిరిందంటూ అభిమానులు తెగ ఖుషీ అయిపోతున్నారు. ధోని భార్య సాక్షి కూడా ఈ వేడుకల్లో పాల్గొంది.


ఉష, నారంగ్‌.. అనుకున్నట్లే

దిల్లీ: దిగ్గజ స్ప్రింటర్‌ పీటీ ఉష చరిత్ర సృష్టించింది. భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) తొలి మహిళా అధ్యక్షురాలిగా ఆమె నిలిచింది. ఐఓఏ అధ్యక్ష పదవికి ఆమె ఒక్కరే నామినేషన్‌ వేయడంతో విజయం ముందే ఖాయమైంది. మరోవైపు ఐఓఏ ఉపాధ్యక్షుడిగా ఒలింపిక్‌ కాంస్య విజేత గగన్‌ నారంగ్‌ కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. అతనికి పోటీగా ఎవరూ కూడా నామినేషన్‌ దాఖలు చేయని సంగతి తెలిసిందే. ఐఓఏ ఉపాధ్యక్ష పదవి చేపట్టనున్న ఈ షూటింగ్‌ దిగ్గజాన్ని భారత జాతీయ రైఫిల్‌ సంఘం అభినందించింది.


అఫ్గాన్‌కు 2023 వన్డే ప్రపంచకప్‌ బెర్తు

దుబాయ్‌: భారత్‌ వేదికగా వచ్చే ఏడాది జరిగే వన్డే ప్రపంచకప్‌కు అఫ్గానిస్థాన్‌ అర్హత సాధించింది. శ్రీలంకతో రెండో వన్డే వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోవడంతో అయిదు పాయింట్లు ఖాతాలో వేసుకున్న అఫ్గాన్‌.. ప్రపంచకప్‌ సూపర్‌ లీగ్‌ టేబుల్‌లో 115 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచింది. సూపర్‌ లీగ్‌ దశ ఆఖరికి టాప్‌-8లో నిలిచిన జట్లు నేరుగా ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తాయి. అఫ్గాన్‌తో పోలిస్తే లంక పరిస్థితి భిన్నంగా ఉంది. ప్రస్తుతం ఆ జట్టు 67 పాయింట్లతో పదో స్థానంలో ఉంది. లంక మరో నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్న నేపథ్యంలో వీలైనన్ని ఎక్కువ పాయింట్లు సాధించి టాప్‌-8లో నిలవాల్సి ఉంటుంది. మూడో వన్డేలో అఫ్గాన్‌ను ఓడిస్తే లంక ఖాతాలో విలువైన 10 పాయింట్లు చేరతాయి. మరోవైపు దక్షిణాఫ్రికా తన తర్వాతి అయిదు వన్డేల్లో నాలుగు గెలిస్తేనే నేరుగా ప్రపంచకప్‌కు అర్హత సాధించే స్థితిలో ఉంది.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు