సలీం మాలిక్‌ నన్ను పనోడిలా చూశాడు: అక్రమ్‌

కెరీర్‌ తొలినాళ్లలో సీనియర్‌ సహచర ఆటగాడు సలీం మాలిక్‌ తనను పనోడిలా చూశాడని పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌ వసీం అక్రమ్‌ అన్నాడు.

Published : 29 Nov 2022 02:22 IST

కరాచి: కెరీర్‌ తొలినాళ్లలో సీనియర్‌ సహచర ఆటగాడు సలీం మాలిక్‌ తనను పనోడిలా చూశాడని పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌ వసీం అక్రమ్‌ అన్నాడు. మసాజ్‌ చేయించుకునేవాడని.. బట్టలు, బూట్లు ఉతికించాడని 1984లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన అక్రమ్‌ ఆరోపించాడు. తన జీవిత చరిత్ర ‘సుల్తాన్‌: ఎ మెమోయిర్‌’లో అక్రమ్‌ ఈ విషయాలు పేర్కొన్నాడు. ‘‘నా జూనియర్‌ స్థాయిని మాలిక్‌ ఉపయోగించుకున్నాడు. అతను సంకుచిత స్వభావం కలిగిన వ్యక్తి. స్వార్థపరుడు. నన్ను పనోడిలా చూశాడు. మసాజ్‌ చేయమని డిమాండ్‌ చేసేవాడు. బట్టలు, బూట్లు ఉతకమని ఆదేశించేవాడు. జూనియర్‌ సహచరులు రమీజ్‌, తాహిర్‌, మోసిన్‌, షోయబ్‌ మహ్మద్‌ నైట్‌ క్లబ్‌లకు పిలిచినప్పుడు ఈ పని వల్ల నాకు కోపం వచ్చేది’’ అని అక్రమ్‌ వివరించాడు. 1992-1995 మధ్యలో మాలిక్‌ సారథ్యంలో అక్రమ్‌ ఆడాడు. వాళ్లిద్దరి మధ్య అస్సలు పొసిగేది కాదని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే అక్రమ్‌ ఆరోపణల్ని మాలిక్‌ ఖండించాడు. పుస్తకాన్ని ప్రమోట్‌ చేసుకోడానికి ఇవన్నీ రాశాడని అతను విమర్శించాడు. ‘‘అక్రమ్‌కు ఫోన్‌ చేసినా సమాధానం ఇవ్వట్లేదు. అలా రాయడానికి కారణమేంటో అడుగుతా. నాకు సంకుచిత స్వభావం ఉంటే అతనికి బౌలింగ్‌ చేసే అవకాశం ఇచ్చేవాడిని కాదు’’ అని మాలిక్‌ పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని