ఇక్కడ విజయం.. అక్కడ విధ్వంసం

ఫిఫా ప్రపంచకప్‌లో అగ్రశ్రేణి బెల్జియంపై మొరాకో సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆదివారం ఆ జట్టు 2-0తో ప్రపంచ రెండో ర్యాంకర్‌ను ఓడించింది.

Published : 29 Nov 2022 02:23 IST

బ్రసెల్స్‌: ఫిఫా ప్రపంచకప్‌లో అగ్రశ్రేణి బెల్జియంపై మొరాకో సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆదివారం ఆ జట్టు 2-0తో ప్రపంచ రెండో ర్యాంకర్‌ను ఓడించింది. ఈ గెలుపుతో ఇక్కడ మొరాకో జట్టు సంబరాల్లో మునిగిపోగా.. బెల్జియం, నెదర్లాండ్స్‌లోని కొన్ని నగరాల్లో మాత్రం అల్లర్లు చెలరేగాయి. కొంత మంది బెల్జియం రాజధాని బ్రసెల్స్‌లో విధ్వంసం సృష్టించారు. పదుల సంఖ్యలో అభిమానులు రహదారిపైకి చేరి కార్లకు, విద్యుత్‌ స్కూటర్లకు నిప్పు పెట్టారు. కార్లపైకి ఇటుకలు విసిరారు. ఈ ఘటనలో ఓ వ్యక్తి ముఖానికి గాయలయ్యాయి. అక్కడికి చేరుకున్న పోలీసులు నీటి ఫిరంగులు, బాష్పవాయువు ప్రయోగించి పరిస్థితిని చక్కదిద్దారు. దాదాపు 12 మంది ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఆంట్వర్ప్‌ నగరంలో అల్లర్లకు కారణమైన వాళ్లలో 8 మందిని అరెస్టు చేశారు. సిటీ సెంటర్‌ నుంచి దూరంగా ఉండాలని ప్రజలను బ్రసెల్స్‌ మేయర్‌ ఫిలిప్‌ క్లోస్‌ కోరాడు. పోలీసుల ఆదేశాలతో అక్కడ రైళ్ల రాకపోకలకూ అంతరాయం కలిగింది. ‘‘వాళ్లు అభిమానులు కాదు.. అల్లరిమూకలు. సంబరాలు చేసుకోవడానికి మొరాకో అభిమానులు అక్కడికి వచ్చారు’’ అని ఫిలిప్‌ చెప్పాడు. కొంతమంది వ్యక్తులు పరిస్థితిని దుర్వినియోగం చేయడం బాధగా ఉందని మంత్రి అనెలీస్‌ వెర్లిండన్‌ చెప్పింది. మరోవైపు నెదర్లాండ్స్‌లోని ఓడరేవు నగరమైన రాటర్‌డ్యామ్‌లో చెలరేగిన అల్లర్లలో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. 500 మంది సాకర్‌ అభిమానుల గుంపును చెల్లాచెదురు చేసే క్రమంలో పోలీసులపై వీళ్లు బాణాసంచా, గాజు ముక్కలతో దాడి చేశారు. రాజధాని ఆమ్‌స్టర్‌డామ్‌, ది హేగ్‌లోనూ అశాంతి నెలకొంది. బెల్జియం, నెదర్లాండ్స్‌ దేశాల్లోని నగరాల్లో నివాసముంటున్న మొరాకో మూలాలున్న ప్రజలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకునే నేపథ్యంలోనే ఈ అల్లర్లు చెలరేగాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని