ఔరా.. రుతురాజ్‌

ఒక్క ఓవర్లో ఆరు సిక్సర్లు బాదడం చూశాం.  2007 టీ20 ప్రపంచకప్‌లో యవరాజ్‌సింగ్‌ రికార్డుకు ముందు.. తర్వాతా ఈ ఘనతను అందుకున్నవాళ్లు లేకపోలేదు.

Published : 29 Nov 2022 02:31 IST

ఒకే ఓవర్లో 7 సిక్సర్లతో రికార్డు
అహ్మదాబాద్‌

క్క ఓవర్లో ఆరు సిక్సర్లు బాదడం చూశాం.  2007 టీ20 ప్రపంచకప్‌లో యవరాజ్‌సింగ్‌ రికార్డుకు ముందు.. తర్వాతా ఈ ఘనతను అందుకున్నవాళ్లు లేకపోలేదు. కానీనీ ఒకే ఓవర్లో ఏడు సిక్సర్లు ఎప్పుడైనా విన్నామా! ఓవర్లో ఆరు బంతులే ఉన్నప్పుడు మరి ఏడో సిక్సర్‌ ఎక్కడ్నుంచి వస్తుందన్న అనుమానం రాకమానదు! అయితే బౌలర్‌ రాత బాగాలేనప్పుడు ఏదైనా సాధ్యమే! సోమవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ-బి మైదానంలో అదే జరిగింది. మహారాష్ట్ర కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ ఈ అరుదైన ఘనత సాధించాడు. లిస్ట్‌-ఎ క్రికెట్లో ఒకే ఓవర్లో ఏడు సిక్సర్లతో ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. ఉత్తర్‌ప్రదేశ్‌తో విజయ్‌ హజారె ట్రోఫీ వన్డే క్రికెట్‌ టోర్నీ క్వార్టర్‌ఫైనల్లో ఈ రికార్డు నమోదైంది. ఉత్తర్‌ప్రదేశ్‌ ఎడమచేతి వాటం స్పిన్నర్‌ శివ సింగ్‌ వేసిన 49వ ఓవర్లో గైక్వాడ్‌ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మిడ్‌ వికెట్‌, లాంగాన్‌, మిడ్‌ వికెట్‌, లాంగాఫ్‌ మీదుగా వరుసగా తొలి 4 బంతుల్ని సిక్సర్లుగా మలిచాడు.

అయిదో బంతి లాంగాఫ్‌లో సైట్‌ స్క్రీన్‌ ముద్దాడింది. అయితే అది నోబాల్‌ కావడంతో ఫ్రీ హిట్‌ లభించింది. ఫ్రీ హిట్‌ కూడా మిడ్‌ వికెట్లో స్టాండ్స్‌కు చేరుకుంది. చివరి బంతిని రౌండ్‌ ద వికెట్‌ వేసినా ఫలితం అదే. మిడ్‌ వికెట్లో సిక్సర్‌. అంతే.. ఏడు బంతుల్లో 7 సిక్సర్లతో సరికొత్త ప్రపంచ రికార్డు ఆవిష్కృతమైంది. ఒకే ఓవర్లో మొత్తం 43 పరుగులు వచ్చాయి. 2018లో హామిల్టన్‌లో జరిగిన ఫోర్డ్‌ ట్రోఫీ లిస్ట్‌-ఎ క్రికెట్లో బ్రెట్‌ హాంప్టన్‌, జో కార్టర్‌ (నార్తర్న్‌ డిస్ట్రిక్ట్స్‌)లు ఒక్క ఓవర్లో రాబట్టిన 43 పరుగుల రికార్డును గైక్వాడ్‌ సమం చేశాడు. మొత్తంగా క్రికెట్‌ చరిత్రలో ఒక ఓవర్లో అత్యధిక సిక్సర్ల రికార్డు లీ జెర్మన్‌ (న్యూజిలాండ్‌) పేరిట ఉంది. వెల్లింగ్టన్‌లో జరిగిన షెల్‌ ట్రోఫీ (4 రోజుల ఆట) మ్యాచ్‌లో జెర్మన్‌ ఏకంగా 8 సిక్సర్లు బాదాడు. ఈ మ్యాచ్‌లో గైక్వాడ్‌ (220 నాటౌట్‌; 159 బంతుల్లో 10×4, 16×6) అజేయ డబుల్‌ సెంచరీ సాధించగా.. మహారాష్ట్ర 50 ఓవర్లలో 5 వికెట్లకు 330 పరుగులు రాబట్టింది. బదులుగా ఉత్తర్‌ప్రదేశ్‌ 47.4 ఓవర్లలో 272 పరుగులకు ఆలౌటవడంతో మహారాష్ట్ర సెమీస్‌ చేరింది.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు