సంక్షిప్త వార్తలు (3)

బంగ్లాదేశ్‌-ఎతో తొలి అనధికార టెస్టులో భారత్‌-ఎ మొదటి రోజే శాసించే స్థితికి చేరుకుంది. స్పిన్‌-పేస్‌ ద్వయం సౌరభ్‌ కుమార్‌ (4/23), నవ్‌దీప్‌ సైని (3/21) విజృంభించడంతో ఆతిథ్య జట్టును 112 పరుగులకే కుప్పకూల్చిన భారత జట్టు..

Published : 30 Nov 2022 02:41 IST

విజృంభించిన సైని, సౌరభ్‌
బంగ్లా-ఎ 112 ఆలౌట్‌
భారత్‌-ఎతో తొలి అనధికార టెస్టు

కాక్స్‌ బజార్‌ (బంగ్లాదేశ్‌): బంగ్లాదేశ్‌-ఎతో తొలి అనధికార టెస్టులో భారత్‌-ఎ మొదటి రోజే శాసించే స్థితికి చేరుకుంది. స్పిన్‌-పేస్‌ ద్వయం సౌరభ్‌ కుమార్‌ (4/23), నవ్‌దీప్‌ సైని (3/21) విజృంభించడంతో ఆతిథ్య జట్టును 112 పరుగులకే కుప్పకూల్చిన భారత జట్టు.. మంగళవారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టపోకుండా 120 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్‌ (61), కెప్టెన్‌ అభిమన్యు ఈశ్వరన్‌ (53) క్రీజులో ఉన్నారు. అంతకుముందు ఉదయం టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా.. భారత బౌలర్ల ధాటికి నిలవలేకపోయింది. 26 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన ఆ జట్టును మొసాదెక్‌ హుస్సేన్‌ (63) ఆదుకున్నాడు. అర్ధసెంచరీతో స్కోరును వంద పరుగులు దాటించాడు. భారత బౌలర్లలో సౌరభ్‌, నవ్‌దీప్‌తో పాటు ముకేశ్‌ కుమార్‌ (2/25) రాణించాడు.


మెరిసిన ప్రతీక్‌

పుణెరిపై గుజరాత్‌ పైచేయి

ఈనాడు, హైదరాబాద్‌: ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌-9లో గుజరాత్‌ జెయింట్స్‌ వరుస ఓటముల తర్వాత ఓ విజయాన్ని అందుకుంది. మంగళవారం గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన పోరులో గుజరాత్‌ 51-39తో పుణెరి పల్టాన్‌ను ఓడించింది. కానీ తొలి అర్ధభాగంలో పుణెరిదే జోరు. ఆరంభంలోనే గుజరాత్‌ను ఆలౌట్‌ చేసిన ఆ జట్టు 15-8తో ఆధిక్యంలో నిలిచింది. ఈ స్థితిలో పుంజుకున్న గుజరాత్‌ విరామ సమయానికి 21-22తో ప్రత్యర్థిని సమీపించింది. ద్వితీయార్థంలో జెయింట్స్‌ విజృంభించింది. వరుస పాయింట్లు ఖాతాలో వేసుకున్న ఆ జట్టు విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రతీక్‌ దహియా (19) గుజరాత్‌ విజయంలో కీలకపాత్ర పోషించాడు. వరుసగా 5 విజయాల తర్వాత పుణెరికి ఇదే తొలి ఓటమి. మరో మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్‌ 35-33తో యు ముంబాను ఓడించింది. ఆశిష్‌, జై, రింకు ఆరేసి పాయింట్లతో జట్టును విజయపథంలో నడిపించారు.


టాప్‌-20లో గాయత్రి జోడీ

దిల్లీ: పుల్లెల గాయత్రి-ట్రిసా జాలీ బీడబ్ల్యూఎఫ్‌ ర్యాంకింగ్స్‌లో టాప్‌-20లోకి దూసుకొచ్చారు. మంగళవారం ప్రకటించిన జాబితాలో మహిళల డబుల్స్‌లో గాయత్రి ద్వయం 2 స్థానాలు మెరుగుపరుచుకుని 19వ ర్యాంకులో నిలిచింది. కామన్వెల్త్‌ క్రీడల్లో కాంస్యం గెలిచిన గాయత్రి-ట్రిసా జోడీ 17 టోర్నమెంట్లలో 46,020 పాయింట్లు సాధించింది. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌శెట్టి 7, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ఇషాన్‌ భట్నాగర్‌-తనీషా క్రాస్టో 24వ ర్యాంకుల్లో నిలిచారు. కామన్వెల్త్‌ క్రీడల తర్వాత మళ్లీ బరిలో దిగని పి.వి.సింధు మహిళల సింగిల్స్‌లో ఆరో స్థానాన్ని నిలబెట్టుకోగా.. పురుషుల సింగిల్స్‌లో రెండు ర్యాంకులు మెరుగుపరుచుకున్న లక్ష్యసేన్‌ ఆరో స్థానంలో ఉన్నాడు. కిదాంబి శ్రీకాంత్‌ 11, హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ 12వ స్థానాల్లో నిలిచారు.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు