20 ఏళ్ల తర్వాత

సెనెగల్‌ అదరగొట్టింది. రెండో విజయంతో గ్రూప్‌-ఎ నుంచి నాకౌట్‌కు దూసుకెళ్లింది. బుధవారం ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో ఆ జట్టు 2-1తో ఈక్వెడార్‌పై విజయం సాధించింది.

Updated : 30 Nov 2022 04:13 IST

సెనెగల్‌ 2, ఈక్వెడార్‌ 1

అల్‌ రయాన్‌: సెనెగల్‌ అదరగొట్టింది. రెండో విజయంతో గ్రూప్‌-ఎ నుంచి నాకౌట్‌కు దూసుకెళ్లింది. బుధవారం ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో ఆ జట్టు 2-1తో ఈక్వెడార్‌పై విజయం సాధించింది. ఇస్మైలా సార్‌ (44వ), కౌలిబలి (70వ) సెనెగల్‌కు గోల్స్‌ అందించారు. ఈక్వెడార్‌ తరఫున నమోదైన ఏకైక గోల్‌ను కైౖసెడో (67వ) సాధించాడు. 2002 తర్వాత నాకౌట్‌ దశకు చేరడం సెనెగల్‌కు ఇదే తొలిసారి. మ్యాచ్‌లో బంతి ఎక్కువగా ఈక్వెడార్‌ నియంత్రణలోనే ఉన్నా.. మొదటి నుంచి దూకుడు ప్రదర్శించింది మాత్రం సెనెగలే. ఆ జట్టు గోల్‌ కోసం ప్రయత్నిస్తూనే ఉంది. 12వ నిమిషంలో ఈక్వెడార్‌ను ఒత్తిడికి గురి చేస్తూ బాక్స్‌లోకి వెళ్లిన ఎండియే నెట్లో ఓ కార్నర్‌కు కొట్టడానికి ప్రయత్నించాడు. అది దూరంగా వెళ్లింది. తొలి అర్ధభాగం ఆఖర్లో ఆ జట్టుకు సెనెగల్‌ షాకిచ్చింది. పెనాల్టీని గోల్‌గా మలిచిన సార్‌ సెనెగల్‌ను ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. ఈక్వెడార్‌ బాక్స్‌లోకి దూసుకెళ్లిన సార్‌ను హిన్‌కాపీ పడేయడంతో రిఫరీ సెనెగల్‌కు పెనాల్టీ ఇచ్చాడు. ఈక్వెడార్‌ గోల్‌కీపర్‌ను సార్‌ అలవోకగా బోల్తా కొట్టించాడు. 0-1తో వెనుకబడ్డ ఈక్వెడార్‌ ద్వితీయార్ధాన్ని దూకుడుగా మొదలెట్టింది. 58వ నిమిషంలో గోల్‌ చేసేందుకు ఈక్వెడార్‌కు మంచి అవకాశం లభించింది. ఎడమ నుంచి ఎస్తుపినన్‌ పెనాల్టీ స్పాట్‌ దగ్గరికి గొప్ప క్రాస్‌ ఇచ్చాడు. కానీ ఎస్ట్రడా తలతో గోల్‌ కొట్టడానికి ప్రయత్నించినా.. సఫలం కాలేకపోయాడు. ఈక్వెడార్‌ ప్రయత్నాలు ఎట్టకేలకు 67వ నిమిషంలో ఫలించాయి. కైసెడో గోల్‌తో ఆ జట్టు స్కోరు సమం చేసింది. కానీ ఈక్వెడార్‌ సంతోషం ఎంతో సేపు నిలవలేదు. మూడు నిమిషాల తర్వాత కౌలిబలి గోల్‌తో సెనెగల్‌ తిరిగి ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఓ ఫ్రీకిక్‌ను ఇద్రిసా బాక్స్‌లోకి కొట్టగా.. అది ఈక్వెడార్‌ ఆటగాణ్ని తాకుతూ నేరుగా కౌలిబలి దగ్గరకు వెళ్లింది. తన చుట్టూ అడ్డుకునే వాళ్లెవరూ లేకపోవడంతో అతడు గోల్‌ కొట్టేశాడు. తర్వాత కూడా సెనెగల్‌ దూకుడుగా ఆడింది. ఈక్వెడార్‌ స్కోరు సమం చేయడానికి ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని