సమమా.. సమర్పణమా?

వర్ష ప్రభావిత సిరీస్‌లో టీమ్‌ఇండియా ఆఖరి పోరాటానికి సిద్ధమైంది. బుధవారం చివరిదైన మూడో వన్డేలో ఆతిథ్య న్యూజిలాండ్‌ను ఢీకొంటుంది.

Updated : 30 Nov 2022 06:49 IST

న్యూజిలాండ్‌తో భారత్‌ చివరి వన్డే నేడు
ఉ।। 7 గంటల నుంచి

క్రైస్ట్‌చర్చ్‌: వర్ష ప్రభావిత సిరీస్‌లో టీమ్‌ఇండియా ఆఖరి పోరాటానికి సిద్ధమైంది. బుధవారం చివరిదైన మూడో వన్డేలో ఆతిథ్య న్యూజిలాండ్‌ను ఢీకొంటుంది. సిరీస్‌లో 0-1తో వెనుకబడ్డ భారత్‌.. ఫామ్‌లో ఉన్న కివీస్‌ను ఎలా నిలువరిస్తుందన్నది ఆసక్తికరం. తొలి వన్డేలో కివీస్‌ నెగ్గగా.. వాన వల్ల రెండో వన్డే రద్దయిన సంగతి తెలిసిందే. ఈ చివరి వన్డే అయినా సవ్యంగా సాగుతుందా అన్నది అనుమానంగా మారింది.

ఒత్తిడి భారత్‌పైనే..: చివరి మ్యాచ్‌లో టీమ్‌ఇండియాపైనే ఒత్తిడి ఉంటుందనడంలో సందేహం లేదు. ధావన్‌ నేతృత్వంలోని భారత్‌.. తొలి వన్డేలో 306 పరుగుల స్కోరును కూడా కాపాడుకోలేకపోయిన సంగతి తెలిసిందే. సిరీస్‌ సమం చేయాలంటే భారత్‌ బౌలింగ్‌ బాగా మెరుగుపడాల్సివుంది. తొలి మ్యాచ్‌లో అయిదుగురు బౌలర్లు మాత్రమే ఉండడంతో జట్టు ఇబ్బంది పడింది. ఆరో బౌలింగ్‌ ప్రత్యామ్నాయం కోసం గత మ్యాచ్‌లో భారత్‌.. సంజు శాంసన్‌ స్థానంలో దీపక్‌ హుడాను తుది జట్టులోకి తీసుకుంది. కానీ అతడికి బౌలింగ్‌ చేసే అవకాశం రాలేదు. 12.5 ఓవర్ల తర్వాత వాన వల్ల ఆట రద్దయిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో హుడా స్థానంలో తిరిగి సంజును తీసుకోవడం గురించి టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఆలోచిస్తోంది. ఇద్దరిలో ఎవరు ఆడినా అందరి దృష్టి వారిపై ఉంటుందనడంలో సందేహం లేదు. ఇక ఓపెనర్‌ ధావన్‌ వేగంగా ఆడాల్సివుంది. ఓపెనర్లు పవర్‌ప్లేలో ధాటిగా పరుగులు రాబట్టడం అవసరం. రెండో వన్డేలో చెలరేగి ఆడిన సూర్యకుమార్‌ యాదవ్‌ జట్టుకు గొప్ప బలం. అయితే రిషబ్‌ పంత్‌ ఫామ్‌ను అందుకోవాల్సివుంది. స్వింగ్‌ బౌలింగ్‌కు అనుకూలించే పరిస్థితులు భారత బ్యాటర్లను పరీక్షించనున్నాయి. ఇక కలిసొచ్చిన మైదానంలో కివీస్‌ రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగనుంది. అనుకూలించే పిచ్‌పై ఫాస్ట్‌బౌలర్లు  హెన్రీ, టిమ్‌ సౌథీ, ఫెర్గూసన్‌లను ఎదుర్కోవడం భారత బ్యాటర్లకు సవాలే. కివీస్‌ బ్యాటింగ్‌లోనూ బాగానే కనిపిస్తోంది.


పిచ్‌

బుధవారం మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. జల్లులు పడే అవకాశముంది. మ్యాచ్‌ పూర్తిగా సాగుతుందా లేదా ఓవర్లను తగ్గించాల్సివస్తుందా అన్నది చూడాలి. పిచ్‌ పేస్‌ బౌలర్లకు అనుకూలించనుంది. టాస్‌ గెలిచిన జట్టు బౌలింగ్‌ ఎంచుకునే అవకాశముంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని