బ్రూనో ‘డబుల్‌’

పోర్చుగల్‌ పోరాటం ఇక గ్రూప్‌లో అగ్రస్థానం కోసమే. గ్రూప్‌ దశలో ఇంకో మ్యాచ్‌ ఉండగానే ఆ జట్టు నాకౌట్‌కు అర్హత పొందింది. బ్రూనో ఫెర్నాండెజ్‌ ‘డబుల్‌’తో మెరవడంతో గ్రూప్‌-హెచ్‌ పోరులో పోర్చుగల్‌ 2-0తో ఉరుగ్వేను ఓడించింది.

Updated : 30 Nov 2022 04:12 IST

నాకౌట్లో పోర్చుగల్‌
పోర్చుగల్‌ 2, ఉరుగ్వే 0

లుసైల్‌ (ఖతార్‌): పోర్చుగల్‌ పోరాటం ఇక గ్రూప్‌లో అగ్రస్థానం కోసమే. గ్రూప్‌ దశలో ఇంకో మ్యాచ్‌ ఉండగానే ఆ జట్టు నాకౌట్‌కు అర్హత పొందింది. బ్రూనో ఫెర్నాండెజ్‌ ‘డబుల్‌’తో మెరవడంతో గ్రూప్‌-హెచ్‌ పోరులో పోర్చుగల్‌ 2-0తో ఉరుగ్వేను ఓడించింది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో నెగ్గిన రొనాల్డో సేన 6 పాయింట్లతో గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిచి ప్రిక్వార్టర్స్‌ చేరగా.. ఓ ఓటమి, ఓ డ్రాతో ఉరుగ్వే (1) నాకౌట్‌ అవకాశాలను మరింత జటిలం చేసుకుంది. ఈ మ్యాచ్‌ ఆరంభం నుంచి బంతిని నియంత్రణలో ఉంచుకున్న పోర్చుగల్‌ వరుస దాడులతో ఉరుగ్వే రక్షణ శ్రేణికి పరీక్ష పెట్టింది. మూడో నిమిషంలోనే ఓ గోల్‌ అవకాశం త్రుటిలో చేజార్చుకున్న పోర్చుగల్‌ ఆపై ఎటాకింగ్‌ పదును పెంచింది. ఉరుగ్వే కూడా కొన్ని ప్రయత్నాలు చేసినా ప్రత్యర్థి జట్టు డిఫెన్స్‌ను ఛేదించలేకపోయింది. తొలి అర్ధభాగంలో రెండు జట్ల ప్రయత్నాలు ఫలించలేదు. విరామం తర్వాత పోర్చుగల్‌ ఆటగాళ్లు ఇంకా వేగంగా కదిలారు. వారి శ్రమకు ఫలితాన్ని ఇస్తూ బ్రూనో (54వ ని) గోల్‌ చేసి పోర్చుగల్‌ను ఆధిక్యంలో నిలిపాడు. కార్నర్‌ నుంచి అతడు కొట్టిన షాట్‌ నేరుగా నెట్‌లో పడింది. ఆ తర్వాత ఇంజూరీ సమయంలో బ్రూనో (93వ ని) మరో గోల్‌ చేసి ఆధిక్యాన్ని రెట్టింపు చేశాడు. గోల్‌ ప్రాంతంలో ఉరుగ్వే ఆటగాడి చేతికి బంతి తగలడంతో రిఫరీ పోర్చుగల్‌కు పెనాల్టీ ఇచ్చాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేస్తూ బ్రూనో ప్రశాంతంగా బంతిని నెట్‌లోకి కొట్టేశాడు. ఈ మ్యాచ్‌లో ఆడిన పోర్చుగల్‌ ఆటగాడు పెపె (39 ఏళ్లు) ప్రపంచకప్‌ మ్యాచ్‌లో బరిలో దిగిన పెద్ద వయస్కుల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. రోజర్‌ మిల్లా (42 ఏళ్లు, కామెరూన్‌) అతడికన్నా ముందున్నాడు.

ఆ గోల్‌ ఎవరిది..?: మ్యాచ్‌ 54వ నిమిషంలో పోర్చుగల్‌ ఖాతా తెరిచింది. అయితే గోల్‌ చేసింది ఎవరు అన్న విషయంలో కాస్త గందరగోళం నెలకొంది. కార్నర్‌ నుంచి బ్రూనో కొట్టిన షాట్‌ గాల్లో తేలుతూ ఉరుగ్వే గోల్‌పోస్టు సమీపానికి వచ్చింది. అక్కడే పొంచి ఉన్న రొనాల్డో ఎగిరి ఆ బంతిని తలతో తాకిస్తూ గోల్‌లోకి పంపినట్లు అనిపించింది. రిప్లే చూసిన తర్వాత  రొనాల్డో తలకు బంతి తగల్లేదని రిఫరీ తేల్చాడు. బంతి నేరుగా నెట్‌లో పడిందని మధ్యలో ఎవరికీ తాకలేదని తేలడంతో ఆ గోల్‌ బ్రూనో ఖాతాలోకే వెళ్లింది. బంతికి, రొనాల్డోకు వెంటుక్రవాసి తేడానే ఉండడంతో చాలాసేపు అయోమయం నెలకొంది. రొనాల్డో హావభావాలు చూస్తే తానే బంతిని హెడ్డర్‌తో గోల్‌లోకి పంపినట్లుగా కనిపించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని