నాకౌట్‌కు ఇంగ్లాండ్‌, అమెరికా

ఈ మాజీ ఛాంపియన్‌ మరోసారి ప్రపంచకప్‌ నాకౌట్లో అడుగుపెట్టింది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన గ్రూప్‌-బి పోరులో 3-0 తేడాతో వేల్స్‌ను చిత్తుచేసింది.

Updated : 01 Dec 2022 04:47 IST

నిష్క్రమించిన ఇరాన్‌, వేల్స్‌

ఇంగ్లాండ్‌ 3.. వేల్స్‌ 0

ఫిఫా ప్రపంచకప్‌లో గ్రూప్‌-బి కథ తేలిపోయింది. టైటిల్‌ ఫేవరెట్లలో ఒకటైన ఇంగ్లాండ్‌ అంచనాలను నిలబెట్టుకుంటూ నాకౌట్‌ చేరింది. ఎలాంటి నాటకీయతకు తావులేకుండా.. ఉత్కంఠను దరి చేరనీయకుండా.. వేల్స్‌పై గెలిచి.. ఘనంగా అగ్రస్థానంతో ముందంజ వేసింది. మరోవైపు ఇరాన్‌ నుంచి పోటీ ఎదుర్కొని నిలబడ్డ అమెరికా.. గ్రూప్‌లో రెండో స్థానంతో ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. టోర్నీ నుంచి ఇరాన్‌, వేల్స్‌ నిష్క్రమించాయి.

 

అల్‌ రయాన్‌ రఫ్పాడించిన రష్‌ఫోర్డ్‌

ఇంగ్లాండ్‌ అదరగొట్టింది. ఈ మాజీ ఛాంపియన్‌ మరోసారి ప్రపంచకప్‌ నాకౌట్లో అడుగుపెట్టింది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన గ్రూప్‌-బి పోరులో 3-0 తేడాతో వేల్స్‌ను చిత్తుచేసింది. రెండు గోల్స్‌తో మార్కస్‌ రష్‌ఫోర్డ్‌ (50వ, 68వ నిమిషాల్లో) సత్తాచాటాడు. ఫిల్‌ ఫోడెన్‌ (51వ) ఓ గోల్‌ కొట్టాడు. 2020 యూరో ఫైనల్లో ఇటలీతో పెనాల్టీ షూటౌట్లో గోల్‌ చేయడంలో విఫలమై జాతి వివక్ష దూషణలకు గురైన రష్‌ఫోర్డ్‌.. ఇప్పుడు ఆ దేశానికి హీరోగా నిలిచాడు. పదో నిమిషంలోనే గోల్‌ చేసేందుకు రష్‌ఫోర్డ్‌కు మంచి అవకాశం వచ్చింది. కానీ ప్రత్యర్థి గోల్‌కీపర్‌ను అతను దాటలేకపోయాడు. 38వ నిమిషంలో ఫోడెన్‌ కిక్‌ గోల్‌పోస్టు పైనుంచి వెళ్లిపోయింది. విరామం తర్వాత ఇంగ్లాండ్‌ దాడులు ఉద్ధృతం చేసింది.ఈ క్రమంలోనే లభించిన ఫ్రీకిక్‌ సాయంతో పెనాల్టీ ప్రదేశం బయట నుంచి బంతిని నేరుగా గోల్‌పోస్టులోకి పంపించి రష్‌ఫోర్డ్‌ జట్టు ఖాతా తెరిచాడు. ఆ వెంటనే కెప్టెన్‌ హ్యారీ కేన్‌ నుంచి బంతి అందుకున్న ఫోడెన్‌ ఎలాంటి పొరపాటు చేయకుండా గోల్‌ రాబట్టాడు. గోల్‌ పోస్టు ముందు ఉన్న ఖాళీని ఉపయోగించుకుని కేన్‌ ఎడమ వైపు బంతిని పాస్‌ చేశాడు. అక్కడికి దూసుకొచ్చిన ఫోడెన్‌ దీన్ని లోపలికి పంపించాడు. ప్రత్యర్థిని అందుకునేందుకు వేల్స్‌ కూడా గట్టిగానే ప్రయత్నించింది. కానీ గోల్‌పోస్టు ముందు అడ్డుగోడలా నిలబడ్డ పిక్‌ఫోర్డ్‌ ముందు ఆ జట్టు ఆటలు సాగలేదు. అంతలోనే ఇద్దరు డిఫెండర్లను, గోల్‌కీపర్‌ను తప్పిస్తూ రష్‌ఫోర్డ్‌ చక్కటి గోల్‌ రాబట్టాడు. బంతి గోల్‌కీపర్‌ కాళ్ల మధ్య నుంచి లోపలికి వెళ్లింది. ఆ తర్వాత ఆధిక్యాన్ని ఇంగ్లాండ్‌ నిలబెట్టుకుంది. మూడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు, ఓ డ్రాతో గ్రూప్‌లో అగ్రస్థానంలో ఇంగ్లాండ్‌ నిలిచింది. 64 ఏళ్ల తర్వాత తిరిగి ప్రపంచకప్‌లో ఆడిన వేల్స్‌ ఓ డ్రా, రెండు ఓటములతో ఆఖరి స్థానంతో నిష్క్రమించింది. ప్రిక్వార్టర్స్‌లో సెనెగల్‌తో ఇంగ్లాండ్‌ తలపడుతుంది. 

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు