మళ్లీ వర్షం.. సిరీస్‌ కివీస్‌ వశం

అదృష్టం కలిసొచ్చి న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ను చేజిక్కించుకున్న టీమ్‌ఇండియా.. వన్డే సిరీస్‌ను మాత్రం ప్రత్యర్థికి అప్పగించక తప్పలేదు.

Published : 01 Dec 2022 04:26 IST

చివరి వన్డే రద్దు

క్రైస్ట్‌చర్చ్‌: అదృష్టం కలిసొచ్చి న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ను చేజిక్కించుకున్న టీమ్‌ఇండియా.. వన్డే సిరీస్‌ను మాత్రం ప్రత్యర్థికి అప్పగించక తప్పలేదు. వర్షం వల్ల రెండో వన్డే లాగే మూడో మ్యాచ్‌ సైతం మధ్యలో ఆగి, ఫలితం రాకపోవడంతో కివీస్‌.. సిరీస్‌ను 1-0తో చేజిక్కించుకుంది. టీ20 సిరీస్‌ చివరి మ్యాచ్‌లో ఓటమి బాటలో పయనిస్తున్న భారత్‌ను ఆదుకుని, సమమవ్వాల్సిన సిరీస్‌ను 1-0తో సాధించేందుకు సహకరించిన వరుణుడు.. వన్డే సిరీస్‌లో 0-2తో కాకుండా, 0-1 ఓటమితో సంతృప్తి చెందేలా టీమ్‌ఇండియాకు తోడ్పడ్డాడు! బుధవారం 220 పరుగు లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్‌.. ఓపెనర్లు అలెన్‌ (57; 54 బంతుల్లో 8×4, 1×6), కాన్వే (38; 51 బంతుల్లో 6×4) మెరుపులతో 18 ఓవర్లకు 104/1కు చేరుకుంది. ఈ దశలో వర్షం వల్ల మ్యాచ్‌ ఆగిపోయింది. అప్పటికి 9 వికెట్లు చేతిలో ఉండగా కివీస్‌ 32 ఓవర్లలో 116 పరుగులే చేయాలి. ఆట కొనసాగి ఉంటే ఆ జట్టు సులువుగానే గెలిచేదేమో! అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. బ్యాటర్ల వైఫల్యంతో తడబడింది. కివీస్‌ ప్రధాన పేసర్లు ఆడమ్‌ మిల్నె (3/57), టిమ్‌ సౌథీ (2/36)లకు తోడు పార్ట్‌ టైం పేసర్‌ డరైల్‌ మిచెల్‌ (3/25) విజృంభించడంతో 47.3 ఓవర్లలో 219 పరుగులకే ఆలౌటైంది. తొలి వన్డేలో ఇన్నింగ్స్‌కు మెరుపు ముగింపును ఇచ్చిన ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ (51; 64 బంతుల్లో 5×4, 1×6) ఆదుకోకుంటే భారత్‌ 200 కూడా చేసేది కాదు. మిగతా బ్యాటర్లలో శ్రేయస్‌ అయ్యర్‌ (49; 59 బంతుల్లో 8×4), ధావన్‌ (28) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. శుభ్‌మన్‌ (13), పంత్‌ (10), సూర్యకుమార్‌ యాదవ్‌ (6), దీపక్‌ హుడా (12) విఫలమయ్యారు.

సంక్షిప్త స్కోర్లు.. భారత్‌: 47.3 ఓవర్లలో 219 ఆలౌట్‌ (సుందర్‌ 51, శ్రేయస్‌ 49, ధావన్‌ 28; మిల్నె 3/57, సౌథీ 2/36, మిచెల్‌ 3/25); న్యూజిలాండ్‌: 18 ఓవర్లలో 104/1 (అలెన్‌ 57, కాన్వే 38; ఉమ్రాన్‌ మాలిక్‌ 1/31)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని