సంక్షిప్త వార్తలు (8)

న్యూజిలాండ్‌తో సిరీస్‌లో రాణించిన భారత యువ బ్యాటర్లు శ్రేయస్‌ అయ్యర్‌, శుభ్‌మన్‌ గిల్‌ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో మెరుగయ్యారు. శ్రేయస్‌ ఆరు.. శుభ్‌మన్‌ మూడు స్థానాలు ఎగబాకి వరుసగా 27, 34 ర్యాంకుల్లో నిలిచారు.

Published : 01 Dec 2022 04:12 IST

శ్రేయస్‌, శుభ్‌మన్‌ ర్యాంకులు మెరుగు

దుబాయ్‌: న్యూజిలాండ్‌తో సిరీస్‌లో రాణించిన భారత యువ బ్యాటర్లు శ్రేయస్‌ అయ్యర్‌, శుభ్‌మన్‌ గిల్‌ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో మెరుగయ్యారు. శ్రేయస్‌ ఆరు.. శుభ్‌మన్‌ మూడు స్థానాలు ఎగబాకి వరుసగా 27, 34 ర్యాంకుల్లో నిలిచారు. ఈ సిరీస్‌ తొలి వన్డేలో అర్ధసెంచరీ చేసినా రెండు ర్యాంకులు కోల్పోయిన శిఖర్‌ ధావన్‌ 15వ స్థానంలో నిలిచాడు. కివీస్‌తో సిరీస్‌కు విశ్రాంతి తీసుకున్న విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ ఒక్కో స్థానం చేజార్చుకుని వరుసగా 8, 9 ర్యాంకుల్లో కొనసాగుతున్నారు. భారత్‌పై రాణించిన న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ తిరిగి టాప్‌-10లోకి వచ్చాడు. అతడు ఒక స్థానం మెరుగై పదో ర్యాంకులో ఉన్నాడు. బౌలింగ్‌లో బుమ్రా (14) మాత్రమే భారత్‌ తరఫున టాప్‌-20లో ఉన్నాడు.  


ఇక్కడ ఓటమి.. అక్కడ సంబరాలు

బాగ్దాద్‌: ప్రతిష్ఠాత్మక ఫిఫా ప్రపంచకప్‌లో ఓ జట్టు ఓడిపోతే ఆ దేశ అభిమానుల బాధ వర్ణాణాతీతం. కన్నీళ్లు పెట్టుకుంటూ.. ఆవేదనలో మునిగిపోతారు. కానీ ఇరాన్‌ ఓటమితో ఖుర్దీష్‌, పశ్చిమ అజర్‌బైజాన్‌లోని బుకాన్‌ ప్రాంతాల్లోని జనాలు బాణాసంచా కాలుస్తూ, కార్ల హారన్లు మోగిస్తూ సంబరాల్లో తేలిపోయారు. కొంతమంది ఆ దేశ సుప్రీం లీడర్‌ అయతోల్లా అలీ ఖమేనీని ఉద్దేశించి ‘‘నియంతకు చావు’’ అనే నినాదాలు చేశారు. రాజధాని టెహ్రాన్‌లోనూ కొంతమంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ జట్టు ఓడిపోతే ఇరాన్‌ ప్రజలు ఇలా సంబరాలు చేసుకోవడం వెనక కారణం ఉంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఓ ఖుర్దీష్‌ యువతి పోలీసు కస్టడీలో చనిపోయింది. అక్కడి నిబంధనల ప్రకారం వస్త్రాధారణ లేదని ఆమెను అరెస్టు చేశారు. ఆమె మృతితో ఇరాన్‌లో నిరసనలు, ఆందోళనలు పెల్లుబికాయి. ఈ ఆందోళనలు అణిచివేయాలని చూస్తున్న అక్కడి భద్రతా దళాల చేతుల్లో 400 మందికి పైగా సాధారణ పౌరులు చనిపోయారని సమాచారం. ఇరాన్‌ ఓటమిని అక్కడి ప్రభుత్వంపై సాధించిన విజయంగా ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు.


30 ఏళ్లు వచ్చే వరకు ఆగండి: పంత్‌

క్రైస్ట్‌చర్చ్‌: వరుస వైఫల్యాలతో సతమతం అవుతున్న వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ రిషబ్‌ పంత్‌.. పరిమిత ఓవర్ల క్రికెట్లో తన గణాంకాలు మరీ పేలవంగా ఏమీ లేవని అన్నాడు. టెస్టుల్లో పంత్‌కు మెరుగైన రికార్డే ఉన్నప్పటికీ.. వన్డేలు, టీ20ల్లో అతడి ప్రదర్శన అంతంతమాత్రమే. అందులోనూ ఈ ఏడాది పరిమిత ఓవర్ల క్రికెట్లో 21 ఇన్నింగ్స్‌ల్లో ఒక్కసారీ 30 దాటలేదు. ఇదే విషయమై అతణ్ని ప్రశ్నిస్తే.. ‘‘రికార్డులనేవి కేవలం అంకెలు మాత్రమే. పరిమిత ఓవర్ల క్రికెట్లో నా గణాంకాలు మరీ పేలవంగా ఏమీ లేవు. నాకిప్పుడు 24-25 ఏళ్లే. ఇప్పుడే నా గురించి పోలికలు అవసరం లేదు. గణాంకాలను పోల్చాలంటే నాకు 30-32 ఏళ్లు వచ్చే వరకు ఆగండి. ఇప్పుడే ఆ పని చేస్తే అర్థం ఉండదు’’ అని పంత్‌ అన్నాడు. ఏ ఫార్మాట్లో ఏ స్థానంలో ఆడాలనుకుంటాన్నవని పంత్‌ను అడగ్గా.. ‘‘టీ20ల్లో ఇన్నింగ్స్‌ను ఆరంభించాలనుకుంటా. వన్డేల్లో 4-5 స్థానాలు, వన్డేల్లో 5వ స్థానం నాకు బాగుంటుంది. దిగువన ఆడితే ఆడే ప్రణాళిక వేరుగా ఉంటుంది. కానీ జట్టుకు ఏది అవసరమో అది చేయాలి’’ అని చెప్పాడు.


తొలి మహిళా రిఫరీ ఫ్రాపార్ట్‌!

దోహా: ఫిఫా ప్రపంచకప్‌ చరిత్రలో తొలి మహిళా రిఫరీగా స్టీఫాని ఫ్రాపార్ట్‌ (ఫ్రాన్స్‌) రికార్డు సృష్టించబోతోంది. గురువారం జర్మనీ-కోస్టారికా మ్యాచ్‌కు ఆమె రిఫరీగా బాధ్యతలు నిర్వర్తించనుంది. గతంలో 2019 మహిళల ప్రపంచకప్‌ ఫైనల్‌, ఈసారి పురుషుల ప్రపంచకప్‌ క్వాలిఫయింగ్‌ మ్యాచ్‌లు, ఛాంపియన్స్‌ లీగ్‌, 2022 ఫ్రెంచ్‌ కప్‌ ఫైనల్‌కు 38 ఏళ్ల ఫ్రాపార్ట్‌ రిఫరీగా బాధ్యతలు చేపట్టింది.


లబుషేన్‌ అజేయ శతకం

విండీస్‌తో తొలి టెస్టులో ఆసీస్‌ 293/2
పెర్త్‌: సొంతగడ్డపై వెస్టిండీస్‌తో రెండు టెస్టుల సిరీస్‌ను ఆస్ట్రేలియా ఘనంగా ఆరంభించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆ జట్టు లబుషేన్‌ (154 బ్యాటింగ్‌; 270 బంతుల్లో 16×4, 1×6) అజేయ శతకం సాధించడంతో తొలి రోజు ఆట చివరికి 293/2తో నిలిచింది. ఆరంభంలోనే వార్నర్‌ (5) ఔటైనా.. ఖవాజా (65), స్టీవ్‌ స్మిత్‌ (59 బ్యాటింగ్‌)లతో శతక భాగస్వామ్యాలు నెలకొల్పిన లబుషేన్‌.. జట్టును పటిష్ట స్థితికి చేర్చాడు.

 


చివరి వన్డే లంక సొంతం

పల్లికలె: ఇబ్రహీం జద్రాన్‌ (162; 138 బంతుల్లో 15×4, 4×6) భారీ శతకంతో చెలరేగినా శ్రీలంకతో మూడో వన్డేలో అఫ్గానిస్థాన్‌కు ఓటమి తప్పలేదు. బుధవారం లంక 4 వికెట్ల తేడాతో నెగ్గి సిరీస్‌ను 1-1తో సమం చేసింది. మొదట అఫ్గాన్‌ 313/8 స్కోరు చేసింది. ఇబ్రహీంతో పాటు నజిబుల్లా జద్రాన్‌ (77) రాణించాడు. అసలంక (83 నాటౌట్‌), కుశాల్‌ మెండిస్‌ (67) సత్తా చాటడంతో లంక 49.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. శానక (43), నిశాంక (35), చండిమాల్‌ (33), దునిత్‌ (31 నాటౌట్‌) కూడా రాణించారు. రషీద్‌ఖాన్‌ (4/37) సత్తా చాటినా జట్టును గెలిపించలేకపోయాడు. రెండు జట్ల మధ్య రెండో మ్యాచ్‌ రద్దయ్యింది.

 


జైపుర్‌ చేతిలో బెంగళూరు చిత్తు

ఈనాడు, హైదరాబాద్‌: ప్రొ కబడ్డీ సీజన్‌-9లో జైపుర్‌ పింక్‌ పాంథర్స్‌ మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. బుధవారం ఆ జట్టు 45-25తో బెంగళూరు బుల్స్‌ను చిత్తు చేసింది. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన జైపుర్‌ ప్రత్యర్థికి ఏ దశలోనూ అవకాశం ఇవ్వలేదు. విరామ సమయానికి 25-10తో నిలిచిన పాంథర్స్‌.. బ్రేక్‌ తర్వాత అదే జోరు ప్రదర్శించి విజయాన్ని సొంతం చేసుకుంది. అర్జున్‌ (13), అజిత్‌ (6) జట్టు గెలుపులో కీలకంగా వ్యవహరించారు. బెంగళూరు తరఫున భరత్‌ (10) ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం 19 మ్యాచ్‌ల్లో 13 విజయాలతో జైపుర్‌ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. బుల్స్‌ (19 మ్యాచ్‌ల్లో 11 విజయాలు) మూడో స్థానంలో ఉంది. మరో మ్యాచ్‌లో దబాంగ్‌ దిల్లీ 37-37తో తమిళ్‌ తలైవాస్‌తో టై చేసుకుంది. దిల్లీ తరఫున నవీన్‌ (15), తలైవాస్‌ జట్టులో నరేందర్‌ (14) మెరిశారు.


ఇంగ్లాండ్‌-పాక్‌ తొలి టెస్టు మొదలయ్యేనా?

రావల్పిండి: 17 ఏళ్ల విరామం తర్వాత సొంతగడ్డపై ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు ఉత్సాహంగా సిద్ధమైంది పాకిస్థాన్‌. కానీ రెండు టెస్టుల సిరీస్‌లో తొలి మ్యాచ్‌ షెడ్యూల్‌ ప్రకారం గురువారం ఆరంభం కావడం సందేహమే. ఒక వైరస్‌ కారణంగా కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ సహా పలువురు ఇంగ్లిష్‌ ఆటగాళ్లు అనారోగ్యం బారిన పడడమే ఇందుక్కారణం. ముందు బ్రూక్‌, క్రాలీ, జెన్నింగ్స్‌, పోప్‌, రూట్‌ అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నట్లు వెల్లడైంది. తర్వాత వీరికి మరిందరు తోడయ్యారు. మొత్తం జట్టులో 17 మంది ఉండగా.. 13 మంది దాకా వైరస్‌తో ఇబ్బంది పడుతున్నట్లు తెలిసింది. ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు సమయానికి కోలుకోకుంటే మ్యాచ్‌ను ఒక రోజు ఆలస్యంగా, శుక్రవారం మొదలుపెట్టడానికి ఇరు జట్లు అంగీకరించినట్లు సమాచారం.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని