దేశానికి సాయంగా.. ఒలింపిక్‌ పతకాల వేలం

తమ దేశంపై రష్యా యుద్ధం కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు అండగా నిలిచేందుకు ఉక్రెయిన్‌ అథ్లెట్లు ఏకమయ్యారు. ఆ దేశ దిగ్గజ ఒలింపిక్‌ అథ్లెట్‌ యూరి చెబాన్‌ తన రెండు స్వర్ణాలు, ఓ కాంస్యాన్ని వేలానికి పెట్టాడు.

Published : 02 Dec 2022 02:52 IST

కీవ్‌: తమ దేశంపై రష్యా యుద్ధం కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు అండగా నిలిచేందుకు ఉక్రెయిన్‌ అథ్లెట్లు ఏకమయ్యారు. ఆ దేశ దిగ్గజ ఒలింపిక్‌ అథ్లెట్‌ యూరి చెబాన్‌ తన రెండు స్వర్ణాలు, ఓ కాంస్యాన్ని వేలానికి పెట్టాడు. ఈ కెనాయి ఛాంపియన్‌ 2012, 2016 ఒలింపిక్స్‌ల్లో 200 మీటర్ల విభాగంలో స్వర్ణాలు, 2008లో 500మీ. విభాగంలో కాంస్యం గెలిచాడు. ఇప్పుడు వీటిని వేలంలో అమ్మడం ద్వారా దేశం కోసం ఆరంకెల మొత్తాన్ని సేకరిస్తాననే నమ్మకం వ్యక్తం చేశాడు. ‘‘స్వేచ్ఛ, స్వాతంత్య్రం కోసం జరుగుతున్న ఈ యుద్ధంలో ఉక్రెయిన్‌ నిలబడలేకపోతే నా ఒలింపిక్‌ పతకాలకు అర్థమే ఉండదు. ప్రపంచంలోని చాలా మంది ప్రజలకు ఇక్కడి పరిస్థితుల గురించి పూర్తిగా తెలీదు. ఇక్కడి నగరాల్లో విద్యుత్‌ ఉండడం లేదు. ఆసుపత్రులు, పాఠశాలలు, స్టోర్లు మూతబడ్డాయి. ప్రజలు అపార్టుమెంట్లలో ఉండిపోయారు. ఈ పరిస్థితుల్లోనూ కొంతమంది మా కుటుంబ సభ్యులు జీవనం సాగించేందుకు పని చేస్తున్నారు’’ అని 36 ఏళ్ల చెబాన్‌ తెలిపాడు. ఈ వేలం ద్వారా ఒక్కో బంగారు పతకానికి దాదాపు రూ.60.56 లక్షలు వస్తాయని అంచనా. ఈ డబ్బును ఒలింపిక్‌ సర్కిల్‌ ఛారిటీ నిధులకు అతను ఇవ్వనున్నాడు. మికోలైవ్‌ నగరంలోని ప్రజలకు ఈ డబ్బుతో సాయం చేయనున్నారు. లేకర్స్‌ తరపున బాస్కెట్‌బాల్‌ ఆడినప్పుడు వచ్చిన రెండు ఛాంపియన్‌షిప్‌ రింగ్‌లను స్లేవ్‌ మెద్వెదెంకో వేలం వేయగా.. సుమారు రూ.2 కోట్లు వచ్చాయి. దీంతో తన పతకాలనూ వేలం వేయాలని చెబాన్‌ నిర్ణయించుకున్నాడు. మరోవైపు ఉక్రెయిన్‌ అథ్లెటిక్‌ సంఘానికి తమ అత్యున్నత గౌరవ పురస్కారమైన ప్రెసిడెంట్‌ అవార్డును ప్రపంచ అథ్లెటిక్స్‌ ప్రదానం చేసింది.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు