మొరాకో.. 1986 తర్వాత!

మొరాకో అదరగొట్టింది. స్ఫూర్తిదాయక ప్రదర్శనతో ఫిఫా ప్రపంచకప్‌లో నాకౌట్‌కు దూసుకెళ్లింది. గురువారం గ్రూప్‌-ఎఫ్‌ చివరి మ్యాచ్‌లో ఆ జట్టు 2-1 గోల్స్‌తో కెనడాను ఓడించి గ్రూప్‌లో అగ్రస్థానంతో  (7 పాయింట్లు) ప్రిక్వార్టర్స్‌ చేరింది.

Published : 02 Dec 2022 02:52 IST

ప్రిక్వార్టర్స్‌కు

అల్‌ తమారా: మొరాకో అదరగొట్టింది. స్ఫూర్తిదాయక ప్రదర్శనతో ఫిఫా ప్రపంచకప్‌లో నాకౌట్‌కు దూసుకెళ్లింది. గురువారం గ్రూప్‌-ఎఫ్‌ చివరి మ్యాచ్‌లో ఆ జట్టు 2-1 గోల్స్‌తో కెనడాను ఓడించి గ్రూప్‌లో అగ్రస్థానంతో  (7 పాయింట్లు) ప్రిక్వార్టర్స్‌ చేరింది. ఈ మ్యాచ్‌లో నాలుగో నిమిషంలోనే గోల్‌ కొట్టిన మొరాకో ప్రత్యర్థికి షాకిచ్చింది. మెరుపులా కెనడా గోల్‌ ప్రాంతానికి దూసుకొచ్చిన మొరాకో ఆటగాళ్లు ప్రత్యర్థి డిఫెన్స్‌కు పరీక్ష పెట్టారు. ఈ స్థితిలో బంతిని తానే అందుకుని వారి ప్రయత్నాన్ని నిలువరిద్దామనుకున్న కెనడా గోల్‌కీపర్‌ బొజాన్‌ ముందుకు పరుగెత్తుకొచ్చాడు. కానీ అతడు బంతిని తమ డిఫెండర్‌ వైపు కాక ప్రత్యర్థి ఆటగాడికి సమీపంగా తన్నాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ హకీమ్‌.. బంతిని స్కూప్‌ చేస్తూ గోల్‌ కొట్టేశాడు. ఆ తర్వాత కెనడాకు ఇంకో షాక్‌ తగిలింది. ప్రత్యర్థి గోల్‌ బాక్స్‌ సమీపంగా బంతిని దొరకబుచ్చుకున్న యూసెఫ్‌ (23వ) కార్నర్‌ నుంచి మెరుపు గోల్‌ చేసి మొరాకో ఆధిక్యాన్ని రెట్టింపు చేశాడు. ప్రథమార్థం కాసేపట్లో ముగుస్తుందనగా కెనడా ఖాతా తెరిచింది. కానీ అది కూడా వాళ్ల ప్రతిభ కాదు మొరాకో స్వయంకృతం! కెనడా ఆటగాడు కొట్టిన షాట్‌ను అడ్డుకోబోయిన మొరాకో డిఫెండర్‌ నయీమ్‌ (40వ) సెల్ఫ్‌గోల్‌ కొట్టేశాడు. అదృష్టవశాత్తూ ఓ గోల్‌ పడినా కూడా ఆ తర్వాత కెనడా స్కోరు సమం చేయలేకపోయింది. 71వ నిమిషంలో ఆ జట్టుకు గోల్‌ త్రుటిలో చేజారింది. ఆ తర్వాత ప్రత్యర్థికి మరో అవకాశం ఇవ్వకుండా ఆడిన మొరాకో సంబరాలు చేసుకుంది. 1986 తర్వాత ప్రపంచకప్‌లో నాకౌట్‌ చేరడం మొరాకోకు ఇదే తొలిసారి. 1998లో నైజీరియా తర్వాత గ్రూప్‌ దశలో అగ్రస్థానంలో నిలిచిన ఆఫ్రికా జట్టుగా మొరాకో ఘనత సాధించింది.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు