అర్జెంటీనావచ్చేసింది

అసలు అర్జెంటీనా నాకౌట్‌కు చేరుతుందా..? తొలి మ్యాచ్‌లో సౌదీ అరేబియా చేతిలో కంగుతిన్నాక మాజీ ఛాంపియన్‌పై ఇలాంటి అనుమానాలెన్నో..!

Published : 02 Dec 2022 02:56 IST

నాకౌట్లో ప్రవేశం
ఓడినా పోలెండ్‌ ముందుకు

అసలు అర్జెంటీనా నాకౌట్‌కు చేరుతుందా..? తొలి మ్యాచ్‌లో సౌదీ అరేబియా చేతిలో కంగుతిన్నాక మాజీ ఛాంపియన్‌పై ఇలాంటి అనుమానాలెన్నో..! వాటిని పటాపంచలు చేస్తూ.. సామర్థ్యంతో సందేహాలకు సమాధానాలు ఇస్తూ.. మెస్సి సేన ముందంజ వేసింది. గ్రూప్‌-సి నుంచి అగ్రస్థానంతో ప్రపంచకప్‌లో ప్రి క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. అర్జెంటీనా చేతిలో ఓడినా.. రెండో స్థానంతో పోలెండ్‌ కూడా నాకౌట్‌లో అడుగుపెట్టింది.  1986 తర్వాత తొలిసారి ఆ జట్టు గ్రూప్‌ దాటింది. మెక్సికో, సౌదీ అరేబియా కథ ముగిసింది.


కల దిశగా..

ర్జెంటీనా తొలి విఘ్నాన్ని దాటింది. నాకౌట్లో అడుగుపెట్టింది. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 2-0 తేడాతో పోలెండ్‌పై గెలిచింది. అలిస్టర్‌ (46వ నిమిషంలో), అల్వరెజ్‌ (67వ) చెరో గోల్‌ కొట్టారు. మూడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు, ఓ ఓటమితో 6 పాయింట్లతో మెస్సి జట్టు గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో ఓడినా మెరుగైన గోల్స్‌ అంతరం కారణంగా మెక్సికో (-1)ను వెనక్కినెట్టి పోలెండ్‌ (0) రెండో స్థానంతో ముందంజ వేసింది. ఈ రెండు జట్లూ ఒక్కో గెలుపు, ఓటమి, డ్రా నమోదు చేశాయి. పోలెండ్‌తో పోరులో ఆరంభం నుంచే అర్జెంటీనా దూకుడుగా ఆడింది. మ్యాచ్‌లో 67 శాతం బంతి తమ నియంత్రణలోనే ఉంచుకుని, గోల్‌పోస్టుపై సూటిగా 13 సార్లు అర్జెంటీనా దాడి చేసినా.. రెండు సార్లు మాత్రమే సఫలమైంది. బలమైన పోలెండ్‌ రక్షణశ్రేణి అందుకు కారణం. ముఖ్యంగా గోల్‌కీపర్‌ వోయ్‌చెక్‌ షుటెస్నీ అడ్డుగోడలా నిలబడి ఆ జట్టు ఆశలు నిలిపాడు. పదో నిమిషంలో మెస్సి తన్నిన బంతిని అతను అడ్డుకున్నాడు. కొద్దిసేపటికే మార్కస్‌ బంతి గోల్‌పోస్టు పక్కనుంచి వెళ్లింది. 39వ నిమిషంలో పెనాల్టీ అవకాశాన్ని మెస్సి వృథా చేశాడు. కుడి వైపు అతని కిక్‌ను.. తన ఎడమ వైపు డైవ్‌ చేస్తూ కుడి చేతితో వోయ్‌చెక్‌ గొప్పగా ఆపాడు. విరామం తర్వాత అర్జెంటీనా వేగం పెంచింది. మొలీనా నుంచి పాస్‌ అందుకున్న అలిస్టర్‌ ఎలాంటి పొరపాటు చేయకుండా గోల్‌కీపర్‌ను బోల్తా కొట్టించి జట్టు ఖాతా తెరిచాడు. కొద్దిసేపటికే ప్రత్యర్థి పెనాల్టీ ప్రదేశంలో డిఫెండర్లను తప్పించి అల్వరెజ్‌ గోల్‌తో జట్టు ఆనందాన్ని రెట్టింపు చేశాడు. ఆ తర్వాత కూడా గోల్స్‌ కోసం అర్జెంటీనా ప్రయత్నాలు చేసినప్పటికీ సఫలం కాలేకపోయింది. మరోవైపు మెక్సికో, సౌదీ అరేబియా మ్యాచ్‌ ఫలితం తెలిసిన తర్వాత పోలెండ్‌ ఆటగాళ్లు మైదానంలో సంబరాలు చేసుకున్నారు. నాకౌట్‌లో ఆస్ట్రేలియాతో అర్జెంటీనా, డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఫ్రాన్స్‌తో పోలెండ్‌ తలపడతాయి.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని