ENG-PAK: ఒక్క రోజులో 506

ఇంగ్లాండ్‌ పవర్‌ హిట్టింగ్‌తో టెస్టు పరుగుల వేటను మరో స్థాయికి తీసుకెళ్లింది. రికార్డు పుస్తకాల దుమ్ము దులుపుతూ పాకిస్థాన్‌పై రావల్పిండిలో గురువారం ఒక్క రోజే, అదీ 75 ఓవర్లలోనే ఏకంగా 506 పరుగులు చేసి క్రికెట్‌ ప్రపంచాన్ని నివ్వెరపరిచింది.

Updated : 02 Dec 2022 11:05 IST

టెస్టు క్రికెట్లో ఇంగ్లాండ్‌ రికార్డుల మోత
పాకిస్థాన్‌పై వీరబాదుడు
క్రాలీ, డకెట్‌, పోప్‌, బ్రూక్‌ శతకాలు

ఇంగ్లాండ్‌ పవర్‌ హిట్టింగ్‌తో టెస్టు పరుగుల వేటను మరో స్థాయికి తీసుకెళ్లింది. రికార్డు పుస్తకాల దుమ్ము దులుపుతూ పాకిస్థాన్‌పై రావల్పిండిలో గురువారం ఒక్క రోజే, అదీ 75 ఓవర్లలోనే ఏకంగా 506 పరుగులు చేసి క్రికెట్‌ ప్రపంచాన్ని నివ్వెరపరిచింది.

వీళ్లాడుతున్నది టెస్టు క్రికెట్టా లేదా వన్డే/టీ20 ఫార్మాటా అన్న సందేహం కలిగేలా విధ్వంసం సృష్టించిన ఇంగ్లాండ్‌.. టెస్టు మ్యాచ్‌ తొలి రోజు అత్యధిక పరుగులు చేసిన జట్టుగా ప్రపంచ రికార్డు సృష్టించింది. అనుభవం లోపించిన పాక్‌ బౌలింగ్‌ను తుత్తునియలు చేస్తూ ఏకంగా నలుగురు బ్యాటర్లు శతక్కొట్టేయడం మరో రికార్డు. క్రాలీ, డకెట్‌, పోప్‌, బ్రూక్‌ సెంచరీల మోత మోగించారు. ఇది గత 17 ఏళ్లలో పాక్‌లో ఇంగ్లాండ్‌ ఆడుతున్న తొలి టెస్టు కావడం విశేషం.

క్రాలీ 86 బంతుల్లో, డకెట్‌ 105 బంతుల్లో, పోప్‌ 90 బంతుల్లో, బ్రూక్‌ 80 బంతుల్లో..! ఆతిథ్య పాక్‌ బౌలింగ్‌ను ఓ ఆటాడుకున్న ఇంగ్లాండ్‌ బ్యాటర్లు సెంచరీలు సాధించిన తీరిది. ఫలితంగా తొలి టెస్టు తొలి రోజు, గురువారం ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 506 పరుగులు సాధించింది. క్రాలీ (122; 111 బంతుల్లో 21×4), పోప్‌ (108; 104 బంతుల్లో 14×4), డకెట్‌ (107; 110 బంతుల్లో 15×4), బ్రూక్‌ (101 బ్యాటింగ్‌; 81 బంతుల్లో 14×4, 2×6) పరుగుల వరద పారించారు. బ్రూక్‌తో పాటు స్టోక్స్‌ క్రీజులో ఉన్నాడు. మిగతా వాళ్లు ఏ వన్డే/టీ20 ఫార్మాట్లాగో ఆడితే.. ఆఖర్లో స్టోక్స్‌ (34 బ్యాటింగ్‌; 15 బంతుల్లో 6×4, 1×6) టీ10 జోరును ప్రదర్శించాడు. ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ 73 ఫోర్లు, మూడు సిక్స్‌లు బాదిందంటే ఆ జట్టు విధ్వంసం ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. టెస్టు మ్యాచ్‌ మొదటి రోజు నలుగురు బ్యాటర్లు శతకాలు సాధించడం ఇదే తొలిసారి.

6.74 రన్‌రేట్‌తో..: ఆకాశమే హద్దుగా చెలరేగిన ఇంగ్లాండ్‌ తొలి రోజు 75 ఓవర్ల ఇన్నింగ్స్‌లో 6.74 రన్‌రేట్‌తో పరుగులు రాబట్టింది. వెలుతురు లేమి కారణంగా ఆట త్వరగా ముగియకపోతే ఇంకెన్ని పరుగులు చేసేదో. నిజానికి.. అనేకమంది ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు వైరస్‌ కారణంగా అనారోగ్యంపాలు  కావడంతో షెడ్యూలు ప్రకారం మ్యాచ్‌ ఆరంభం కావడంపైనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇంగ్లాండ్‌.. తాము తుది జట్టును బరిలోకి దించే స్థితిలో ఉన్నట్లు సమాచారమిచ్చిందని, టెస్టు మ్యాచ్‌ షెడ్యూలు ప్రకారమే మొదలవుతుందని టాస్‌కు కేవలం రెండు గంటల ముందు పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు చెప్పింది. అయితే ఈ అనారోగ్య ప్రభావమేమీ ఇంగ్లాండ్‌ జట్టుపై కనపడలేదు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆ జట్టు పరుగుల వరద పారించింది. గాయంతో పాక్‌ పేసర్‌ షహీన్‌ అఫ్రిది ఈ మ్యాచ్‌కు దూరం కాగా.. ఫాస్ట్‌బౌలర్లు రవూఫ్‌, మహ్మద్‌ అలీ, లెగ్‌స్పిన్నర్‌ జాహిద్‌ టెస్టు అరంగేట్రం చేశారు. వారి అనుభవరాహిత్యాన్ని సొమ్ము చేసుకుంటూ బ్యాటర్లు చెలరేగిపోయారు. ఓపెనర్లు క్రాలీ, డకెట్‌ జోరుతో లంచ్‌ సమయానికే ఇంగ్లాండ్‌ 174 పరుగులు చేసింది.  శతక్కొట్టిన డకెట్‌ను లంచ్‌ తర్వాత ఔట్‌ చేసిన జాహిద్‌ 233 పరుగుల తొలి వికెట్‌ భాగస్వామ్యాన్ని విడదీశాడు. తర్వాతి ఓవర్లోనే క్రాలీని ఔట్‌ చేయడం, జట్టు స్కోరు 286 వద్ద రూట్‌ (23)నూ వెనక్కి పంపడంతో పాక్‌ కాస్త ఉపశమనం పొంది ఉంటుంది. ఇంత ఉపద్రవాన్ని మాత్రం ఊహించి ఉండదు. పాక్‌ బౌలర్లును నిస్సహాయులుగా మారుస్తూ పోప్‌, బ్రూక్‌ కూడా రెచ్చిపోయి ఆడారు. ఎడాపెడా బౌండరీలు బాదస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. బ్రూక్‌తో నాలుగో వికెట్‌కు కేవలం 149 బంతుల్లో 176 పరుగులు జోడించిన పోప్‌.. చివరికి టీ తర్వాత జట్టు స్కోరు 462 వద్ద ఔటయ్యాడు. క్రీజులోకి వచ్చిన స్టోక్స్‌ కూడా నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడడంతో ఇంగ్లాండ్‌ స్కోరు ఐదొందలు దాటింది. తొలి రోజు ఆఖరి ఓవర్లో (నసీమ్‌) స్టోక్స్‌ మూడు ఫోర్లు, ఓ సిక్స్‌ దంచాడు. బ్రూక్‌తో అభేద్యమైన అయిదో వికెట్‌కు అతడు 44 పరుగులు జోడించాడు. షకీల్‌ వేసిన ఓ ఓవర్లో బ్రూక్‌ ఆరు ఫోర్లు కొట్టడం విశేషం.


* ఓ టెస్టు తొలి రోజు అత్యధిక పరుగులు చేసిన జట్టుగా ఇంగ్లాండ్‌ రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు ఆ రికార్డు ఆస్ట్రేలియా (494/6, 1910లో దక్షిణాఫ్రికా) పేరిట ఉంది.

* టెస్టు క్రికెట్‌ చరిత్రలో ఒకే ఓవర్లో ఆరు ఫోర్లు కొట్టిన అయిదో బ్యాట్స్‌మన్‌గా బ్రూక్‌  నిలిచాడు. ఇంతకుముందు సందీప్‌ పాటిల్‌, గేల్‌, శర్వాణ్‌, జయసూర్య ఈ ఘనత సాధించారు.

* టెస్టు మ్యాచ్‌ మొదటి రోజు నలుగురు బ్యాటర్లు శతకాలు సాధించడం ఇదే తొలిసారి.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని