సంక్షిప్త వార్తలు

స్వదేశంలో ఆస్ట్రేలియాతో 5 టీ20ల సిరీస్‌లో తలపడే భారత మహిళల జట్టులో తెలుగమ్మాయిలు అంజలి శర్వాణి, సబ్బినేని మేఘన చోటు దక్కించుకున్నారు.

Updated : 03 Dec 2022 05:13 IST

భారత జట్టులో అంజలి, మేఘన

దిల్లీ: స్వదేశంలో ఆస్ట్రేలియాతో 5 టీ20ల సిరీస్‌లో తలపడే భారత మహిళల జట్టులో తెలుగమ్మాయిలు అంజలి శర్వాణి, సబ్బినేని మేఘన చోటు దక్కించుకున్నారు. మేఘన (కృష్ణా జిల్లా) ఇప్పటికే టీమ్‌ఇండియా తరఫున ఆడగా.. సీనియర్‌ జట్టుకు ఎంపిక కావడం లెఫ్ట్‌ ఆర్మ్‌ మీడియం పేసర్‌ అంజలికి ఇదే తొలిసారి. కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన 25 ఏళ్ల అంజలి ఇటీవల మహిళల ఛాలెంజర్‌ టోర్నీలో భారత్‌-ఎ తరఫున సత్తా చాటింది. భారత్‌-డితో పోరులో 3 ఓవర్లలో 11 పరుగులకే 2 వికెట్లు తీసింది. డిసెంబర్‌ 9న ఆరంభమయ్యే ఈ టీ20 సిరీస్‌లో పాల్గొనే భారత జట్టుకు హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, స్మృతి మంధాన కెప్టెన్‌, వైస్‌ కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు.


ముంబాపై యోధాస్‌ గెలుపు

ఈనాడు, హైదరాబాద్‌: ప్రొ కబడ్డీ లీగ్‌ తొమ్మిదో సీజన్‌లో యూపీ యోధాస్‌ మరో విజయాన్ని అందుకుంది. శుక్రవారం గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 38-28 తేడాతో యు ముంబాపై గెలిచింది. కెప్టెన్‌ పర్దీప్‌ నర్వాల్‌ (13) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ముంబా తరపున గమన్‌ (10) రాణించాడు. ఇతర మ్యాచ్‌ల్లో గుజరాత్‌ జెయింట్స్‌ 40-34తో పట్నా పైరేట్స్‌పై, హరియాణా స్టీలర్స్‌ 32-26తో బెంగాల్‌ వారియర్స్‌పై నెగ్గాయి.


సత్తాచాటిన షట్లర్లు

దిల్లీ: ఆసియా జూనియర్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్స్‌లో భారత షట్లర్లు సత్తాచాటారు. కనీసం 5 పతకాలు ఖాయం చేశారు. సింగిల్స్‌లో ఉన్నతి హుడా, జ్ఞానదత్తు, అనీష్‌, డబుల్స్‌లో అర్ష్‌- సరస్వత్‌, జైసన్‌- ఆతిష్‌ సెమీస్‌ చేరారు. శుక్రవారం అండర్‌-17 మహిళల సింగిల్స్‌ క్వార్టర్స్‌లో టాప్‌సీడ్‌ ఉన్నతి 21-15, 21-18 తేడాతో మిన్‌ జి కిమ్‌ (దక్షిణ కొరియా)పై గెలిచింది. అండర్‌-15 పురుషుల సింగిల్స్‌లో ఏడో సీడ్‌ జ్ఞానదత్తు 21-11, 13-21, 21-11తో నాలుగో సీడ్‌ రాదిత్యపై, అనీష్‌ 22-20, 19-21, 21-12తో అయిదో సీడ్‌ రుమాండోర్‌పై నెగ్గారు. అండర్‌-17 పురుషుల డబుల్స్‌లో అర్ష్‌- సరస్వత్‌ 24-22, 20-22, 21-15తో నవాఫ్‌- ఆడ్రియల్‌పై, అండర్‌-15 డబుల్స్‌లో జైసన్‌- ఆతిష్‌ 16-21, 21-12, 21-17తో షెంగ్‌- యు సాయ్‌పై విజయాలు సాధించారు.


భారత క్రికెట్‌ లీగ్‌లోనూ  ‘ఇంపాక్ట్‌ ప్లేయర్‌’

దిల్లీ: వచ్చే ఏడాది భారత క్రికెట్‌ లీగ్‌లో ‘ఇంపాక్ట్‌ ప్లేయర్‌’ విధానాన్ని ప్రవేశపెట్టే దిశగా బీసీసీఐ కసరత్తులు చేస్తోంది. ఈ ఏడాది సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 టోర్నీలో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని పరీక్షించిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో విజయవంతం కావడంతో ఇప్పుడు భారత టీ20 లీగ్‌లోనూ అమలు చేయాలని చూస్తోంది. ఈ మేరకు టీ20 లీగ్‌ పాలక మండలి సమావేశంలో దీని గురించి చర్చించినట్లు తెలిసింది. ఈ విప్లవాత్మక సబ్‌స్టిట్యూషన్‌ విధానాన్ని ప్రవేశ పెట్టే విషయంపై ఫ్రాంఛైజీలకు కూడా సమాచారం ఇచ్చారు. ఇప్పటివరకూ మ్యాచ్‌లో సబ్‌స్టిట్యూట్‌ ఆటగాళ్లు ఫీల్డింగ్‌ మాత్రమే చేస్తున్నారు. కానీ ఈ ‘ఇంపాక్ట్‌ ప్లేయర్‌’ బౌలింగ్‌, బ్యాటింగ్‌ చేయొచ్చు.


బంగ్లాదేశ్‌-ఎతో టెస్టు డ్రా

కాక్స్‌ బజార్‌: బంగ్లాదేశ్‌-ఎతో అనధికార టెస్టులో భారత్‌-ఎ డ్రాతో సరిపెట్టుకుంది. 353 పరుగుల వెనకబడి ఓవర్‌నైట్‌ స్కోరు 172/1తో చివరి రోజైన శుక్రవారం రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన బంగ్లా ఆట చివరకు 343/9తో నిలిచింది. జాకీర్‌ హసన్‌ (173) జట్టును గట్టెక్కించాడు. స్పిన్నర్‌ సౌరభ్‌ కుమార్‌ (5/63) విజృంభించడంతో ఓ దశలో బంగ్లా 322/7తో నిలిచింది. కానీ హసన్‌ ఆ జట్టును కాపాడాడు. తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్‌ 112కే కుప్పకూలగా.. భారత్‌ 465/5 వద్ద డిక్లేర్‌ చేసింది.


జాతీయ ఛాంపియన్‌షిప్‌కు వెయిట్‌లిఫ్టర్ల ఎంపిక

ఈనాడు, హైదరాబాద్‌: యూత్‌, జూనియర్‌, సీనియర్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనే తెలంగాణ వెయిట్‌లిఫ్టర్లను శుక్రవారం ప్రకటించారు. ఈ పోటీల కోసం 13 మంది లిఫ్టర్లను తెలంగాణ వెయిట్‌లిఫ్టింగ్‌ సంఘం ఎంపిక చేసింది. ఈ నెల 27 నుంచి తమిళనాడులో ఈ ఛాంపియన్‌షిప్‌ జరుగుతుంది. యూత్‌ విభాగంలో మోహన్‌, మోనిక, సాయివర్ధన్‌, యశ్వంత్‌ గౌడ్‌, సహస్ర, లక్ష్మీ ప్రసన్న పోటీపడతారు. సీనియర్‌లో ప్రియదర్శిని, ఆర్‌ఎస్‌ఎల్‌ సాయి, అఖిల్‌ బరిలో దిగుతారు. జూనియర్‌లో గణేష్‌, అనూష ఎంపికయ్యారు. యశ్వంత్‌, సాహితి జూనియర్‌తో పాటు సీనియర్‌ విభాగాల్లోనూ తలపడతారు.


‘డాన్‌’లా ఎదగాలని.. ప్రమోద్‌ భగత్‌

దిల్లీ: ప్రపంచ బ్యాడ్మింటన్‌ చరిత్రలో మరెవ్వరికీ సాధ్యం కాని రీతిలో అయిదు సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన దిగ్గజం లిన్‌ డాన్‌ (చైనా)ను అందుకోవడమే తన లక్ష్యమని భారత స్టార్‌ పారా షట్లర్‌ ప్రమోద్‌ భగత్‌ చెప్పాడు. ఇప్పటికే నాలుగు ప్రపంచ పారా బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌ (ఎస్‌ఎల్‌3) టైటిళ్లను ప్రమోద్‌ సాధించాడు. డబుల్స్‌లో రెండేసి స్వర్ణాలు, రజతాలు, ఓ కాంస్యం, సింగిల్స్‌లో మరో రెండు కాంస్యాలు కలిపి మొత్తం 11 పతకాలు నెగ్గాడు. ‘‘లిన్‌ డాన్‌ లాగా సింగిల్స్‌లో అయిదు సార్లు ప్రపంచ ఛాంపియన్‌ అవ్వాలనుకుంటున్నా. 2024 పారిస్‌ ఒలింపిక్స్‌లో పసిడితో పాటు ఇది కూడా నా లక్ష్యాల్లో ఒకటి. ఉత్తమ ప్రదర్శన కోసం బెంగళూరులోని ప్రకాశ్‌ పదుకొనే బ్యాడ్మింటన్‌ అకాడమీకి మకాం మార్చా. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు ముందు అక్కడ రెండు నెలల శిక్షణ పొందా. గత నెలలో టోక్యోలో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచా. వచ్చే ఫిబ్రవరి రెండో వారం నుంచి పారిస్‌ ఒలింపిక్స్‌ అర్హత చక్రం మొదలవుతుంది. ఆ దిశగా జనవరి మొదటి వారం నుంచి తిరిగి సాధన ప్రారంభిస్తా. మేటి పురుష పారా బ్యాడ్మింటన్‌ ఆటగాడి అవార్డుకు వరుసగా మూడోసారి నామినేట్‌ అయ్యా. అవార్డు వస్తుందో లేదో చూడాలి. దేశంలో పారా బ్యాడ్మింటన్‌కు ఆదరణ పెరుగుతుండడం ఆనందంగా ఉంది’’ అని అతను పేర్కొన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు