భారత టీ20 లీగ్‌కు బ్రావో వీడ్కోలు

భారత టీ20 లీగ్‌కు ఆకర్షణ తెచ్చిన మరో వెస్టిండీస్‌ స్టార్‌ నిష్క్రమించాడు. పొలార్డ్‌ బాటలోనే నడుస్తూ 39 ఏళ్ల డ్వేన్‌ బ్రావో ఈ లీగ్‌కు వీడ్కోలు పలికాడు.

Published : 03 Dec 2022 02:21 IST

చెన్నై బౌలింగ్‌ కోచ్‌గా బాధ్యతలు

చెన్నై: భారత టీ20 లీగ్‌కు ఆకర్షణ తెచ్చిన మరో వెస్టిండీస్‌ స్టార్‌ నిష్క్రమించాడు. పొలార్డ్‌ బాటలోనే నడుస్తూ 39 ఏళ్ల డ్వేన్‌ బ్రావో ఈ లీగ్‌కు వీడ్కోలు పలికాడు. ఆటగాడిగా ప్రయాణాన్ని ఆపినా కోచ్‌గా కొత్త పాత్రలో చెన్నైకి సేవలందించబోతున్నాడు. ఈనెలలో జరిగే లీగ్‌ వేలానికి దూరంగా ఉన్న బ్రావో.. ఇకపై ఆటగాడిగా కనబడనని ప్రకటించాడు. దశాబ్దానికి పైగా చెన్నై   విజయాల్లో కీలకంగా వ్యవహరించిన ఈ ఆల్‌రౌండర్‌ 2023 సీజన్లో లక్ష్మీపతి బాలాజీ స్థానంలో బౌలింగ్‌ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. 2008లో లీలీగ్‌ మొదలైన నాటి నుంచి బ్రావోకు ఈ టోర్నీతో బంధం ఉంది. తొలి మూడు సీజన్లలో ముంబయి జట్టుకు ఆడిన అతడు 2011 నుంచి చెన్నైకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. 2016, 17 సీజన్లలో చెన్నైపై నిషేధం పడడంతో ఆ రెండేళ్లు గుజరాత్‌కు ఆడాడు. 2011, 2018, 2021లో చెన్నై టైటిల్‌ గెలవడంలో డ్వేన్‌ది కీలకపాత్ర. 2014 ఛాంపియన్స్‌ లీగ్‌ విజయంలోనూ అతడి భాగస్వామ్యం ఉంది. రెండుసార్లు పర్పుల్‌ క్యాప్‌ (2013, 15) అందుకున్న తొలి బౌలర్‌ అతడే. మొత్తం 161 మ్యాచ్‌ల్లో 183 వికెట్లు తీసిన బ్రావో భారత టీ20 లీగ్‌లో అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచాడు. ఒక్క చెన్నై తరఫునే 168 వికెట్లు పడగొట్టాడు. మొత్తం మీద 1560 పరుగులు కూడా చేసిన అతడు 80 క్యాచ్‌లు పట్టాడు. బ్యాటర్లను ఔట్‌ చేశాక నృత్యం చేస్తూ అతడు చేసుకునే సంబరాలు  అభిమానులను ఆకట్టుకునేవి. ముఖ్యంగా పదునైన డెత్‌ బౌలింగ్‌తో ఎన్నో మ్యాచ్‌ల్లో చెన్నైని గెలిపించాడతను. 17-20 ఓవర్ల మధ్య 1115 బంతుల్లో 102 వికెట్లు పడగొట్టాడు. అతడిలా చివరి నాలుగు ఓవర్లలో ఇన్ని బంతులు ఎవరూ వేయలేదు. తనకే సొంతమైన టిపికల్‌ బ్యాటింగ్‌తో లోయర్‌ఆర్డర్‌లో కీలక ఇన్నింగ్స్‌లు ఆడిన బ్రావో.. ఫీల్డర్‌గానూ ఎన్నో మెరుపు క్యాచ్‌లు పట్టాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని