షెల్డన్‌ అజేయ శతకం

అద్భుత ఫామ్‌లో ఉన్న రుతురాజ్‌ గైక్వాడ్‌ మరో శతకం సాధించాడు. అయినా విజయ్‌ హజారె ఫైనల్లో మహారాష్ట్రకు నిరాశ తప్పలేదు.

Published : 03 Dec 2022 05:17 IST

సౌరాష్ట్రదే విజయ్‌హజారె ట్రోఫీ
రుతురాజ్‌ సెంచరీ వృథా

అహ్మదాబాద్‌: అద్భుత ఫామ్‌లో ఉన్న రుతురాజ్‌ గైక్వాడ్‌ మరో శతకం సాధించాడు. అయినా విజయ్‌ హజారె ఫైనల్లో మహారాష్ట్రకు నిరాశ తప్పలేదు. గైక్వాడ్‌ను మించి పోరాడిన షెల్డన్‌ జాక్సన్‌ (133 నాటౌట్‌; 136 బంతుల్లో 12×4, 5×6) సౌరాష్ట్రకు టైటిల్‌ అందించాడు. శుక్రవారం ఫైనల్లో జాక్సన్‌ అసాధారణంగా ఆడటంతో సౌరాష్ట్ర 5 వికెట్ల తేడాతో మహారాష్ట్రను ఓడించింది. 249 పరుగుల లక్ష్యాన్ని సౌరాష్ట్ర 46.3 ఓవర్లలో 5 వికెట్లే కోల్పోయి ఛేదించింది. సౌరాష్ట్ర ఈ ట్రోఫీ సాధించడం ఇది రెండోసారి. 2007-08 సీజన్‌లో ఆ జట్టు విజేతగా నిలిచింది. మొదట కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ (108; 131 బంతుల్లో 7×4, 4×6) శతకంతో మహారాష్ట్ర 248/9 స్కోరు చేసింది. ఆరంభంలో నెమ్మదిగా ఆడిన రుతురాజ్‌ ఆఖర్లో బ్యాట్‌ ఝుళిపించి సెంచరీ అందుకున్నా ఆ జట్టు 250లోపే పరిమితమైంది. అజీమ్‌ (37), నౌషద్‌ (31) రాణించారు. చిరాగ్‌ (3/43) ప్రత్యర్థి బ్యాటర్లకు కళ్లెం వేశాడు. ఛేదనలో ఓపెనర్‌ షెల్డన్‌.. హర్విక్‌ (50)తో కలిసి తొలి వికెట్‌కు 125 పరుగులు జోడించి సౌరాష్ట్రకు శుభారంభం ఇచ్చాడు. కానీ ముకేశ్‌ (2/38) మూడు బంతుల వ్యవధిలో హర్విక్‌, జయ్‌ గోహ్లీ (0) వికెట్లు తీయడంతో సౌరాష్ట్ర తడబడింది. ఆ జట్టు ఒక దశలో 192/5తో నిలిచింది. చిరాగ్‌ (30 నాటౌట్‌) తోడుగా షెల్డన్‌ మరో జట్టును విజయతీరాలకు చేర్చాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని