ఆసియా సింహాలు అదరహో

ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రత్యర్థి మెరుగైన స్థానంలో ఉండొచ్చు.. ఆ జట్టులో అత్యుత్తమ ఆటగాళ్లు ఉండొచ్చు.. ఇప్పటికే కప్పు గెలిచి ఉండొచ్చు.. కానీ పోరాటాన్నే నమ్ముకున్న జపాన్‌ మరోసారి సంచలనం సృష్టించింది.

Published : 03 Dec 2022 05:16 IST

నాకౌట్లో జపాన్‌, దక్షిణ కొరియా
జర్మనీ, ఉరుగ్వే నిష్క్రమణ

ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో ఆసియా జట్ల ప్రదర్శన అదరహో. బలబలాల్లో, ఘనతల్లో, గత ప్రదర్శనలో తమ కంటే ఎంతో ఎత్తులో ఉన్న జట్లకు షాకిస్తూ ప్రిక్వార్టర్స్‌ చేరడం ద్వారా సంచలనం రేపాయి జపాన్‌, దక్షిణ కొరియా. గ్రూప్‌-ఈ తొలి మ్యాచ్‌లో నాలుగుసార్లు ఛాంపియన్‌ జర్మనీకి షాకిచ్చిన జపాన్‌.. చివరి మ్యాచ్‌లో మరో మాజీ ఛాంపియన్‌ స్పెయిన్‌కు చెక్‌ పెట్టింది. దీంతో జర్మనీ ఇంటిముఖం పట్టక తప్పలేదు. మరోవైపు గ్రూప్‌-హెచ్‌ నుంచి దక్షిణ కొరియా అనూహ్యంగా నాకౌట్లో అడుగు పెట్టింది. ఆ జట్టు తన చివరి మ్యాచ్‌లో పోర్చుగల్‌ను ఓడించి ఉరుగ్వే అవకాశాలకు గండి కొట్టింది. తన చివరి మ్యాచ్‌లో ఉరుగ్వే.. ఘనాను ఓడించినా ఫలితం లేకపోయింది.

దోహా: ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రత్యర్థి మెరుగైన స్థానంలో ఉండొచ్చు.. ఆ జట్టులో అత్యుత్తమ ఆటగాళ్లు ఉండొచ్చు.. ఇప్పటికే కప్పు గెలిచి ఉండొచ్చు.. కానీ పోరాటాన్నే నమ్ముకున్న జపాన్‌ మరోసారి సంచలనం సృష్టించింది. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 2-1 తేడాతో 2010 ప్రపంచకప్‌ విజేత స్పెయిన్‌ను ఓడించింది. రిత్సు డోన్‌ (48వ నిమిషంలో), తనక (51వ) చెరో గోల్‌ కొట్టారు. స్పెయిన్‌ తరపున మొరాటా (11వ) గోల్‌ చేశాడు. తన తొలి మ్యాచ్‌లో అదే స్టేడియంలో జర్మనీని అంతే తేడాతో ఓడించి.. ఫుట్‌బాల్‌ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన జపాన్‌.. మరోసారి అదే ఫలితాన్ని రాబట్టింది. మరో శక్తిమంతమైన ఐరోపా జట్టుపై నెగ్గి గ్రూప్‌లో అగ్రస్థానం (2 విజయాలు, ఓ ఓటమితో 6 పాయింట్లు)తో సగర్వంగా ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. ఆ జట్టు తొలిసారి వరుసగా రెండు ప్రపంచకప్‌ల్లో నాకౌట్‌కు చేరింది. స్పెయిన్‌ ఓడినా రెండో స్థానంతో ముందంజ వేసింది. స్పెయిన్‌, జర్మనీ ఒక్కో విజయం, గెలుపు, డ్రా చొప్పున నమోదు చేసి 4 పాయింట్లతో సమానంగా నిలిచాయి. కానీ మెరుగైన గోల్‌ అంతరంతో జర్మనీ (1)ని స్పెయిన్‌ (6) వెనక్కినెట్టింది. తన తొలి మ్యాచ్‌లో కోస్టారికాపై 7-0 విజయం స్పెయిన్‌కు కలిసొచ్చింది. జపాన్‌పై స్పెయిన్‌ గెలిచి.. కోస్టారికాపై తాము నెగ్గితే జర్మనీకి నాకౌట్‌ చేరే అవకాశం ఉండేది. కానీ జపాన్‌.. స్పెయిన్‌కు షాకిచ్చింది. మ్యాచ్‌లో బంతిపై నియంత్రణ, గోల్‌పోస్టుపై దాడులు.. ఇలా అన్ని రకాలుగా స్పెయిన్‌దే ఆధిపత్యం. తొలి గోల్‌ కూడా ఆ జట్టుదే. సీజర్‌ నుంచి పాస్‌ అందుకున్న మొరాటా తలతో బంతిని నెట్‌లోకి పంపించాడు. కానీ విరామం తర్వాత జపాన్‌ జోరందుకుంది. ద్వితీయార్ధం ఆరంభంలో నాలుగు నిమిషాల్లోనే రెండు గోల్స్‌ కొట్టింది. సబ్‌స్టిట్యూట్‌గా రిత్సు వచ్చి రాగానే పెనాల్టీ ప్రదేశం బయట నుంచి కళ్లుచెదిరే రీతిలో ఎడమ కాలితో బంతిని గోల్‌కీపర్‌ అందుకోలేని విధంగా లోపలికి పంపించాడు. ఆ వెంటనే తనక వివాదాస్పద గోల్‌తో జపాన్‌ ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత స్కోరు సమం చేసేందుకు స్పెయిన్‌ ప్రయత్నాలను సమర్థంగా అడ్డుకున్న జపాన్‌ ఆటగాళ్లు ఆనందబాష్పాలతో మైదానం వీడారు. నాకౌట్‌లో క్రొయేషియాతో జపాన్‌, మొరాకోతో స్పెయిన్‌ తలపడతాయి.


ఆ గోల్‌ ఎందుకు?

స్పెయిన్‌తో మ్యాచ్‌లో జపాన్‌ చేసిన రెండో గోల్‌ వివాదాస్పదమైంది. ఈ గోల్‌తోనే ఆ జట్టు నాకౌట్లో అడుగుపెట్టగా.. జర్మనీ నిష్క్రమించింది. గోల్‌పోస్టు పక్కన గీత దాటి పోతున్న బంతిని మిటోమా అద్భుతంగా డైవ్‌ చేసి లోపలికి తన్నాడు. అక్కడే ఉన్న తనక గోల్‌ చేశాడు. కానీ బంతి గీత దాటిందనే అనుమానంతో రిఫరీ.. వీడియో సమీక్ష (వార్‌)ను సంప్రదించాడు. చాలాసేపు పరిశీలించిన తర్వాత గోల్‌ అని ప్రకటించారు. కానీ దీనిపై చర్చలు జోరందుకున్నాయి. బంతి గీత దాటి వెళ్లిపోయిందని, ఎలా గోల్‌ ఇస్తారనే? ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఆట నిబంధనలు రూపొందించే ఐఎఫ్‌ఏబీ ప్రకారం.. నేలపై నుంచి లేదా గాలిలో నుంచి పూర్తిగా గోల్‌ లైన్‌ లేదా టచ్‌ లైన్‌ను దాటి వెళ్లిపోతేనే బంతిని ఔట్‌గా భావిస్తారు. మిటోమా బంతిని మైదానంలోకి లోపలికి పంపడానికి ముందే.. బంతి గీతను దాటినట్లు కనిపించింది. సాంకేతికత దృష్టిలో మాత్రం బంతిలో కొద్దిభాగం గీతకు తాకే ఉంది. గోల్‌లైన్‌పై అమర్చిన కెమెరా ఆధారంగా బంతిలోని కొద్ది భాగం ఇంకా గీత దాటలేదని వార్‌ తేల్చింది. జపాన్‌ ఖాతాలో గోల్‌ చేరింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని