సంక్షిప్త వార్తలు (3)

టాటా స్టీల్‌ చెస్‌ టోర్నీలో బ్లిట్జ్‌ ఈవెంట్లో అర్జున్‌ ఇరిగేశి ఆధిక్యంలో నిలిచాడు. శనివారం ఈ విభాగంలో తొమ్మిది రౌండ్లు పూర్తవగా ఈ తెలంగాణ కుర్రాడు 6.5 పాయింట్లతో అగ్రస్థానం సాధించాడు.

Published : 04 Dec 2022 03:10 IST

ఆధిక్యంలో అర్జున్‌

కోల్‌కతా: టాటా స్టీల్‌ చెస్‌ టోర్నీలో బ్లిట్జ్‌ ఈవెంట్లో అర్జున్‌ ఇరిగేశి ఆధిక్యంలో నిలిచాడు. శనివారం ఈ విభాగంలో తొమ్మిది రౌండ్లు పూర్తవగా ఈ తెలంగాణ కుర్రాడు 6.5 పాయింట్లతో అగ్రస్థానం సాధించాడు. తొమ్మిది రౌండ్లలో అయిదింట్లో నెగ్గిన అర్జున్‌.. మూడు గేమ్‌లు డ్రా చేసుకుని, ఒక దాంట్లో ఓడాడు. మహిళల విభాగంలో ద్రోణవల్లి హారిక (5) నాలుగు.. కోనేరు హంపి (4.5) అయిదు స్థానాల్లో కొనసాగుతున్నారు. 9 రౌండ్లలో హారిక 3 గేమ్‌లు గెలిచి, రెండింట్లో ఓడింది. నాలుగు గేమ్‌లు డ్రా అయ్యాయి. మూడు గెలిచి.. అన్నే ఓడిన హంపి మరో మూడు గేమ్‌లను డ్రా చేసుకుంది.


నాలుగో టెస్టులో భారత్‌ ఓటమి
హాకీ సిరీస్‌ ఆస్ట్రేలియా సొంతం

అడిలైడ్‌: ఆస్ట్రేలియాతో 5 టెస్టుల హాకీ సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలుండగానే భారత్‌ 1-3తో కోల్పోయింది. శనివారం నాలుగో టెస్టులో 1-5 గోల్స్‌తో కంగారూల చేతిలో చిత్తయింది. మూడో టెస్టులో సత్తా చాటిన భారత్‌.. నాలుగో మ్యాచ్‌ ఆరంభంలో బాగానే ఆడింది. దిల్‌ప్రీత్‌ (25వ ని) కొట్టిన గోల్‌తో ఆధిక్యంలోకి వెళ్లింది. కానీ అక్కడ నుంచి భారత డిఫెన్స్‌ బలహీనపడింది. హేవార్డ్‌ (29వ), జాక్‌ (30వ)  గోల్స్‌ చేయడంతో 1-2తో వెనుకబడింది. భారత కష్టాలను మరింత పెంచుతూ  టామ్‌ (34వ), హేవార్డ్‌ (41వ) బంతిని లక్ష్యానికి చేర్చడంతో ఆస్ట్రేలియా 4-1తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. ఆ తర్వాత మాట్‌ డాసన్‌ గోల్‌తో ఆస్ట్రేలియా గోల్స్‌ సంఖ్య అయిదుకు చేరింది. ఆఖరి దాకా భారత్‌ను మరో గోల్‌ చేయనీయకుండా అడ్డుకున్న కంగారూ జట్టు ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది.


ప్లేఆఫ్స్‌కు జైపుర్‌, పుణెరి

ఈనాడు, హైదరాబాద్‌: ప్రొ కబడ్డీ లీగ్‌ తొమ్మిదో సీజన్‌లో జైపుర్‌ పింక్‌ పాంథర్స్‌, పుణెరి పల్టాన్‌ ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టాయి. శనివారం గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో జైపుర్‌ 57-31 తేడాతో బెంగాల్‌ వారియర్స్‌పై విజయం సాధించింది. అర్జున్‌ (22), అజిత్‌ (12) ఆ జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించారు. మ్యాచ్‌ ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన జైపుర్‌ 26-9తో తొలి అర్ధభాగాన్ని ముగించింది. విరామం తర్వాత కూడా జోరు కొనసాగించి మ్యాచ్‌ సొంతం చేసుకుంది. బెంగాల్‌ తరపున శ్రీకాంత్‌ (16) రాణించాడు. మరో మ్యాచ్‌లో పుణెరి పల్టాన్‌ 47-44తో దబంగ్‌ దిల్లీని ఓడించింది. ఇంకో మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్‌ 24-52తో తమిళ్‌ తలైవాస్‌ చేతిలో చిత్తయింది. కనీస పోరాటం కొరవడిన టైటాన్స్‌ ఏ దశలోనూ ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించేలా కనిపించలేదు. తలైవాస్‌ జట్టులో అజింక్య పవార్‌ (20), నరేందర్‌ (10) మెరిశారు. టైటాన్స్‌ తరపున హనుమంతు (11) ఒక్కడే రాణించాడు.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు