లక్ష్యసేన్‌పై ఎఫ్‌ఐఆర్‌

భారత బ్యాడ్మింటన్‌ యువ సంచలనం, నంబర్‌వన్‌ ఆటగాడు లక్ష్యసేన్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది.

Published : 04 Dec 2022 03:10 IST

వయసు మోసం అభియోగాలు

దిల్లీ: భారత బ్యాడ్మింటన్‌ యువ సంచలనం, నంబర్‌వన్‌ ఆటగాడు లక్ష్యసేన్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. అతనితో పాటు అన్న చిరాగ్‌ సేన్‌ కూడా తప్పుడు వయసు ధ్రువీకరణ పత్రాలతో మోసం చేస్తున్నారని గోవియప్ప నాగరాజ బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇలాగే తప్పుడు వయసు చూపిస్తూ 2010 నుంచి టోర్నీల్లో ఆడుతున్నారని అందులో పేర్కొన్నాడు. లక్ష్య వాస్తవ వయసు 24 ఏళ్లు కాగా భారత బ్యాడ్మింటన్‌ సంఘం (బాయ్‌)లో 21 అని, చిరాగ్‌ వయసు 26కు బదులుగా 24 అని తప్పుగా నమోదు చేసుకున్నారని ఫిర్యాదులో తెలిపాడు. ఈ అన్నదమ్ములతో సహా లక్ష్య తల్లిదండ్రులు, జాతీయ మాజీ కోచ్‌ విమల్‌ కుమార్‌ పేర్లనూ అందులో చేర్చాడు. లక్ష్య తండ్రి ధీరేంద్ర సాయ్‌ కోచ్‌ కూడా. విమల్‌ పదేళ్ల ముందు నుంచి ప్రకాశ్‌ పదుకొనె అకాడమీలో ఈ సోదరులకు శిక్షణ ఇస్తున్నాడు. నాగరాజ ఫిర్యాదు మేరకు మోసం (సెక్షన్‌ 420), ఫోర్జరీ (468), ఫోర్జరీ దస్త్రాన్ని అసలైన దానిగా వాడడం (471), ఒకే ఉద్దేశంతో కొంతమంది వ్యక్తులు ఇలా ప్రవర్తించడం (34) అభియోగాల కింద వీళ్లందరి పేర్లతో పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. అంతర్జాతీయ స్థాయిలో అద్భుత ప్రదర్శనతో దూసుకెళ్తోన్న లక్ష్యసేన్‌ గతేడాది ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో కాంస్యం గెలిచాడు. ఆల్‌ ఇంగ్లాండ్‌ ఛాంపియన్‌షిప్‌లో రన్నరప్‌గా నిలిచాడు. భారత థామస్‌ కప్‌ విజయంలోనూ కీలక పాత్ర పోషించాడు. కామన్వెల్త్‌ క్రీడల పసిడి నెగ్గాడు. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అతను ఆరో స్థానంలో ఉన్నాడు. ఇటీవల లక్ష్య అర్జున పురస్కారమూ అందుకున్నాడు. ఈ ఆరోపణలన్నీ నిరాధారమైనవని, ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తున్నారని విమల్‌ చెప్పాడు. ఆటగాళ్ల వయసు ధ్రువీకరణ బాయ్‌ చూసుకుంటుందని, కోచ్‌గా 30 ఏళ్లుగా వర్థమాన ఆటగాళ్లను తీర్చిదిద్దడంపైనే దృష్టి పెట్టానని అతనన్నాడు.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు