నాకౌట్‌కు ముందు సరదాగా

ప్రపంచకప్‌లో నాకౌట్‌ పోరు.. ఓడితే ఇంటి ముఖం పట్టాల్సిందే. ఇలాంటి కీలక మ్యాచ్‌లకు ముందు గెలుపు వ్యూహాలు, ప్రణాళికల్లో జట్లు మునిగిపోతాయి.

Updated : 04 Dec 2022 04:19 IST

దోహా: ప్రపంచకప్‌లో నాకౌట్‌ పోరు.. ఓడితే ఇంటి ముఖం పట్టాల్సిందే. ఇలాంటి కీలక మ్యాచ్‌లకు ముందు గెలుపు వ్యూహాలు, ప్రణాళికల్లో జట్లు మునిగిపోతాయి. కానీ ఇంగ్లాండ్‌ మాత్రం సరదాగా సమయాన్ని ఆస్వాదిస్తోంది. ఆ జట్టు ఆటగాళ్లు తమాషా ఆటలు ఆడుతున్నారు. జట్టు కలిసికట్టుగా ఉంటే మెరుగైన ఫలితాలు వస్తాయన్నది కోచ్‌ సౌత్‌గేట్‌ నమ్మకం. అందుకే ఆదివారం సెనెగల్‌తో ప్రిక్వార్టర్స్‌ మ్యాచ్‌కు ముందు శనివారం ఆటగాళ్లు కాలక్షేపం చేశారు. తోడేళ్ల పాత్రల్లోకి దూరిపోయి అబద్ధాలు చెప్పే ఆటలాడారు. నాకౌట్లో సెనెగల్‌తో పోరులో ఇంగ్లాండే ఫేవరెట్‌. గ్రూప్‌- బి లో రెండు విజయాలు, ఓ డ్రాతో అజేయంగా నిలిచి ఆ జట్టు ముందంజ వేసింది. గ్రూప్‌ దశలో అత్యధిక గోల్స్‌ (9) చేసిన జట్టుగా స్పెయిన్‌తో కలిసి అగ్రస్థానంలో నిలిచింది. అమెరికాతో 0-0తో డ్రా తప్ప ఆ జట్టు మెరుగైన ప్రదర్శన చేసింది. కానీ సెనెగల్‌ను తక్కువ అంచనా వేయడానికి లేదు. గ్రూప్‌- ఎ నుంచి రెండో స్థానం (రెండు విజయాలు, ఓ ఓటమి)తో ఆ జట్టు నాకౌట్‌ చేరింది. నాకౌట్‌ మ్యాచ్‌లో తెగించి ఆడేందుకు సిద్ధమైంది. అందుకే ప్రత్యర్థిపై, ఆట ప్రమాణాలపై దృష్టి పెట్టాలని కెప్టెన్‌ హ్యారీకేన్‌ ఇంగ్లాండ్‌కు చెప్పాడు. అంతకంటే ముందు మరో ప్రిక్వార్టర్స్‌ పోరులో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఫ్రాన్స్‌తో పోలండ్‌ తలపడనుంది. గ్రూప్‌- డిలో అగ్రస్థానంతో ఫ్రాన్స్‌, ‘సి’ నుంచి రెండో స్థానంతో పోలండ్‌ ముందంజ వేశాయి. ఈ మ్యాచ్‌లో ఫ్రాన్స్‌కే విజయావకాశాలు ఎక్కువ. కానీ గత మ్యాచ్‌లో ట్యునీసియా చేతిలో ఓటమి నుంచి ఆ జట్టు పాఠాలు నేర్చుకోవాల్సి ఉంది. మరోసారి తప్పిదాలకు తావు ఇవ్వకుండా ఎటాకింగ్‌లో దూకుడు పెంచాలనుకుంటోంది. నాకౌట్‌ తొలి మ్యాచ్‌ల్లో ఆ జట్టు రికార్డు 5-0తో మెరుగ్గా ఉంది. 36 ఏళ్ల తర్వాత తొలిసారి నాకౌట్‌ చేరిన పోలెండ్‌.. ఫ్రాన్స్‌కు చెక్‌ పెట్టాలనే ధ్యేయంతో ఉంది. 1982 ప్రపంచకప్‌లో మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో ఫ్రాన్స్‌పై పోలెండ్‌ గెలిచింది.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని