బ్రెజిల్‌కు షాకిచ్చి.. కామెరూన్‌ ఇంటికి

ఫిఫా ప్రపంచకప్‌ గ్రూప్‌ దశ చివరి రోజు కూడా సంచలనాల మోత కొనసాగింది. వెళ్తూ వెళ్తూ ప్రపంచ నంబర్‌వన్‌ బ్రెజిల్‌కు కామెరూన్‌ షాకిచ్చింది. 1998 తర్వాత గ్రూప్‌ దశలో ఆ జట్టుకిదే తొలి ఓటమి.

Published : 04 Dec 2022 03:18 IST

నాకౌట్లో స్విట్జర్లాండ్‌

ఫిఫా ప్రపంచకప్‌ గ్రూప్‌ దశ చివరి రోజు కూడా సంచలనాల మోత కొనసాగింది. వెళ్తూ వెళ్తూ ప్రపంచ నంబర్‌వన్‌ బ్రెజిల్‌కు కామెరూన్‌ షాకిచ్చింది. 1998 తర్వాత గ్రూప్‌ దశలో ఆ జట్టుకిదే తొలి ఓటమి. గ్రూప్‌- జి లో వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి సాంబా జట్టు ముందే నాకౌట్‌ బెర్తు ఖాయం చేసుకుంది. లేదంటే ఈ ఓటమి ఆ జట్టు పరిస్థితిని తలకిందులు చేసేదే. మరోవైపు సెర్బియాపై గెలిచిన స్విట్జర్లాండ్‌ రెండో స్థానంతో ప్రిక్వార్టర్స్‌ చేరింది.


24 ఏళ్ల తర్వాత..

అయిదు సార్లు ప్రపంచ ఛాంపియన్‌ బ్రెజిల్‌ గ్రూప్‌లో చివరి మ్యాచ్‌లో కంగుతింది. బెంచ్‌ బలాన్ని పరీక్షించేందుకు రిజర్వ్‌ ఆటగాళ్లను ఆడించిన ఆ జట్టు ఓటమి పాలైంది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన మ్యాచ్‌లో 0-1 తేడాతో కామెరూన్‌ చేతిలో ఓడింది. అదనపు సమయంలో గోల్‌ చేసి కెప్టెన్‌ అబూబాకర్‌ (90+2వ నిమిషంలో) జట్టును    గెలిపించాడు. ప్రపంచకప్‌ గ్రూప్‌ దశలో 24 ఏళ్ల తర్వాత బ్రెజిల్‌కిదే తొలి ఓటమి. చివరగా 1998లో ఫ్రాన్స్‌ చేతిలో 1-2తో ఓటమి తర్వాత ఆ జట్టు వరుసగా 17 గ్రూప్‌ మ్యాచ్‌లు గెలిచింది. ప్రపంచకప్‌ల్లో గత 10 మ్యాచ్‌ల్లో కామెరూన్‌కిదే మొదటి విజయం. ఆ జట్టు గత తొమ్మిది మ్యాచ్‌ల్లో ఎనిమిది ఓటములు, ఓ డ్రా నమోదు చేసింది. సెర్బియా, స్విట్జర్లాండ్‌పై గెలిచి ముందుగానే ప్రిక్వార్టర్స్‌లో చోటు ఖాయం చేసుకున్న బ్రెజిల్‌.. ఈ ఓటమి ఎదురైనా వరుసగా పదకొండో సారి గ్రూప్‌ను అగస్థ్రానంతో ముగించింది. స్విట్జర్లాండ్‌ కూడా 6 పాయింట్లే సాధించినప్పటికీ మెరుగైన గోల్‌ అంతరం కారణంగా బ్రెజిల్‌ నంబర్‌వన్‌గా నిలిచింది. గత మ్యాచ్‌తో పోలిస్తే కామెరూన్‌తో పోరు కోసం బ్రెజిల్‌ కోచ్‌ టైట్‌ 10 మార్పులు చేశాడు. నిర్ణీత సమయంలో రెండు జట్లూ అవకాశాలు సృష్టించుకున్నా గోల్స్‌ చేయలేకపోయాయి. కామెరూన్‌ గోల్‌కీపర్‌ డెవిస్‌ అడ్డుగోడలా నిలబడి ఉండకపోతే బ్రెజిల్‌ కనీసం మూడు గోల్స్‌ అయినా చేసేదే! మార్టినెల్లి మూడు గోల్‌ ప్రయత్నాలను అతను సమర్థంగా అడ్డుకున్నాడు. తొలి అర్ధభాగం అదనపు సమయంలో కామెరూన్‌ ఆటగాడు బ్రియాన్‌ హెడర్‌ను ఈ సారి బ్రెజిల్‌ గోల్‌కీపర్‌ ఆపాడు. 90 నిమిషాలు ముగియడంతో పోరు డ్రాగా ముగిసేలా కనిపించింది. కానీ అబూబాకర్‌ అద్భుతమైన హెడర్‌తో మ్యాచ్‌ను తమవైపు తిప్పాడు. గోల్‌ చేసిన తర్వాత నిబంధనలకు విరుద్ధంగా టీషర్ట్‌ విప్పి సంబరాలు చేసుకోవడంతో అతడికి రిఫరీ ఎల్లో కార్డు చూపించాడు. అప్పటికే ఓ ఎల్లో కార్డు ఎదుర్కొన్న అతడికి రిఫరీ రెడ్‌ కార్డు కూడా ఇచ్చి మైదానం నుంచి బయటకి పంపాడు. ప్రిక్వార్టర్స్‌లో దక్షిణ కొరియాతో బ్రెజిల్‌ తలపడుతుంది.


స్విస్‌ సూపర్‌..

దోహా: స్విట్జర్లాండ్‌ అదరగొట్టింది. వరుసగా మూడో సారి ప్రపంచకప్‌ నాకౌట్లో అడుగుపెట్టింది. ముందంజ వేయాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆ జట్టు 3-2తో సెర్బియాను ఓడించింది. హోరాహోరీగా సాగిన పోరులో తొలి గోల్‌ స్విస్‌ ఖాతాలోనే చేరింది. షకిరి (20వ) జట్టుకు ఆధిక్యాన్ని అందించాడు. కానీ ఆరు నిమిషాలకే మిత్రోవిచ్‌ (26వ) కళ్లు చెదిరే హెడర్‌తో బంతిని నెట్‌  లోపలికి పంపించి స్కోరు సమం చేశాడు. కొద్దిసేపటికే డుసాన్‌ (35వ) గోల్‌కీపర్‌ను బోల్తా కొట్టించి సెర్బియాను 2-1తో ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. కానీ ఆ ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. సిల్వన్‌ నుంచి పాస్‌ అందుకున్న ఎంబోలో (44వ) గోల్‌ చేసి మళ్లీ స్కోరు సమం చేశాడు. ద్వితీయార్ధం ఆరంభమైన వెంటనే రూబెన్‌ తెలివిగా అందించిన బంతిని వేగంగా లోపలికి పంపించిన రెమో (48వ) స్విట్జర్లాండ్‌ పైచేయి సాధించేలా చూశాడు. చివరి వరకూ ఆ ఆధిక్యాన్ని నిలబెట్టుకున్న జట్టు ఆనందంతో మైదానం వీడింది. ప్రిక్వార్టర్స్‌లో పోర్చుగల్‌ను స్విట్జర్లాండ్‌ ఢీ కొడుతుంది.


1

ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ చరిత్రలో తొలిసారి మూడు ఆసియా దేశాలు నాకౌట్లో అడుగుపెట్టాయి. జపాన్‌, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా ఈ సారి ప్రిక్వార్టర్స్‌ చేరాయి.


1994 తర్వాత ఏ జట్టు కూడా ప్రపంచకప్‌ గ్రూప్‌ దశలో మూడు మ్యాచ్‌లు గెలవలేకపోవడం ఇదే తొలిసారి.


2

నాలుగు సార్లు ఛాంపియన్‌ జర్మనీ వరుసగా రెండో ప్రపంచకప్‌లోనూ గ్రూప్‌ దశలోనే నిష్క్రమించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని