డచ్‌ ధమాకా

ఈసారి ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ గ్రూప్‌ దశలో అంచనాలను అందుకోలేకపోయిన మూడుసార్లు రన్నరప్‌ నెదర్లాండ్స్‌.. ప్రిక్వార్టర్స్‌లో జూలు విదిల్చింది. అమెరికాను ఓడించి క్వార్టర్స్‌లో అడుగు పెట్టింది.

Published : 04 Dec 2022 03:24 IST

విజృంభించిన నెదర్లాండ్స్‌
అమెరికాపై గెలుపుతో క్వార్టర్స్‌కు

ఈక్వెడార్‌ను అలవోకగా ఓడిస్తారనుకుంటే 1-1 డ్రాతో సరిపెట్టుకున్నారు. ఖతార్‌ లాంటి చిన్న జట్టుపై గోల్స్‌ మోత మోగిస్తారనుకుంటే 2-0తో మామూలుగా గెలిచారు. సులువుగానే నాకౌట్‌ చేరినా నెదర్లాండ్స్‌ ఆటపై అభిమానుల్లో అసంతృప్తి! కానీ నాకౌట్‌లోకి వచ్చేసరికి డచ్‌ జట్టు తన అసలు ఆటను చూపించింది. అమెరికాపై ఆధిపత్యం చలాయిస్తూ 3-1తో ఆ జట్టును మట్టికరిపించి క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లింది.

అల్‌రయాన్‌

సారి ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ గ్రూప్‌ దశలో అంచనాలను అందుకోలేకపోయిన మూడుసార్లు రన్నరప్‌ నెదర్లాండ్స్‌.. ప్రిక్వార్టర్స్‌లో జూలు విదిల్చింది. అమెరికాను ఓడించి క్వార్టర్స్‌లో అడుగు పెట్టింది. శనివారం ఆ జట్టు హీరో డంఫ్రీస్‌. నెదర్లాండ్స్‌ సాధించిన మూడు గోల్స్‌లోనూ అతడి భాగస్వామ్యం ఉంది. స్వయంగా ఒక గోల్‌ కొట్టడమే కాక.. మిగతా రెండు గోల్స్‌కూ అతను సహకారం అందించాడు. గ్రూప్‌ దశలో చక్కటి ప్రదర్శన చేసినా అమెరికా.. డచ్‌ జట్టు దూకుడు ముందు నిలవలేకపోయింది. బంతి ఎక్కువగా అమెరికా నియంత్రణలో ఉన్నప్పటికీ గోల్‌ అవకాశాలను సమర్థంగా ఉపయోగించుకుని నెదర్లాండ్స్‌ పైచేయి సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో తొలి గోల్‌ కొట్టే అవకాశం లభించింది అమెరికాకే. మూడో నిమిషంలోనే ఆ జట్టు ఆటగాడు పులిసిచ్‌ గోల్‌ కోసం గట్టి ప్రయత్నం చేశాడు. కానీ నెదర్లాండ్స్‌ గోల్‌కీపర్‌ నొపెర్ట్‌ సమర్థంగా అడ్డుకున్నాడు. 10వ నిమిషంలో చక్కటి పాసింగ్‌తో గోల్‌ అవకాశాన్ని సృష్టించుకున్న డచ్‌ జట్టు ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. డంఫ్రీస్‌ నుంచి పాస్‌ అందుకున్న డీపే.. అమెరికా డిఫెన్స్‌ను ఛేదించి గోల్‌ కొట్టాడు. తర్వాత ఇరు జట్లూ హోరాహోరీగా తలపడ్డా ప్రథమార్ధం ముగిసేవరకు మరో గోల్‌ నమోదు కాలేదు. అయితే 46వ నిమిషంలో డంఫ్రీస్‌ మరోసారి జట్టుకు మంచి అవకాశం సృష్టించాడు. ఈసారి డేలీ బ్లైండ్‌ స్కోర్‌ చేశాడు. ద్వితీయార్ధంలో యుఎస్‌ నుంచి ప్రతిఘటన ఎదురైనప్పటికీ డచ్‌ దూకుడు తగ్గించలేదు. 76వ నిమిషంలో హాజి రైట్‌ గోల్‌ కొట్టడంతో అమెరికా.. డచ్‌ ఆధిక్యాన్ని 1-2కు తగ్గించింది. ఆ జట్టు స్కోరు సమం చేస్తుందా అని ఉత్కంఠగా ఎదురు చూస్తుండగా.. ఇంకో అయిదు నిమిషాలకే డచ్‌ మళ్లీ స్కోర్‌ చేసింది. ఈసారి డంఫ్రీస్‌ (81వ) స్వయంగా గోల్‌ కొట్టి జట్టు ఆధిక్యాన్ని పెంచాడు. బ్లైండ్‌ క్రాస్‌తో అతను సునాయాసంగా గోల్‌ కొట్టేశాడు. తర్వాత అమెరికా గట్టిగా ప్రయత్నించినా గోల్‌ కొట్టలేకపోయింది. నెదర్లాండ్స్‌ క్వార్టర్స్‌ చేరడమిది ఏడోసారి. అమెరికా 2002లో మాత్రమే క్వార్టర్స్‌ ఆడింది.


19

నెదర్లాండ్స్‌ ఓటమి లేకుండా ముగించిన మ్యాచ్‌లు. ఈ 19 మ్యాచ్‌ల్లో 13 నెగ్గిన డచ్‌ జట్టు.. ఆరు మ్యాచ్‌లను డ్రా చేసుకుంది. చివరగా గత ఏడాది జూన్‌లో చెక్‌ రిపబ్లిక్‌ చేతిలో నెదర్లాండ్స్‌ ఓడింది.


* అర్జెంటీనా-ఆస్ట్రేలియా ప్రిక్వార్టర్స్‌  పోరు విజేతతో నెదర్లాండ్స్‌ వచ్చే శుక్రవారం అర్ధరాత్రి క్వార్టర్స్‌ ఆడుతుంది.

* ప్రిక్వార్టర్స్‌ మ్యాచ్‌ ఆడిన అమెరికా జట్టు సగటు వయసు 25 ఏళ్ల 86 రోజులు. వయసు పరంగా ప్రపంచకప్‌ నాకౌట్‌ మ్యాచ్‌ ఆడిన అత్యంత చిన్న అమెరికా జట్టు ఇదే.


నెదర్లాండ్స్‌ (3) అమెరికా (1)
12   గోల్‌ ప్రయత్నాలు   17
6    గోల్‌ దిశగా షాట్‌లు  6
41%  బంతిపై నియంత్రణ  59%
403  పాసులు       572
10   ఫౌల్స్‌         5

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని