బంగ్లాను బెంబేలెత్తిస్తారా?

టీ20 ప్రపంచకప్‌ ముగిశాక అందరి దృష్టీ వచ్చే ఏడాది భారత్‌ వేదికగా జరగబోయే వన్డే ప్రపంచకప్‌ మీదే ఉంది. ఆ దిశగా వరుసగా వన్డే సిరీస్‌లు ఆడుతున్నాయి జట్లన్నీ.

Updated : 04 Dec 2022 07:28 IST

నేటి నుంచే వన్డే సిరీస్‌
ఉదయం 11.30 నుంచి

టీ20 ప్రపంచకప్‌ ముగిశాక అందరి దృష్టీ వచ్చే ఏడాది భారత్‌ వేదికగా జరగబోయే వన్డే ప్రపంచకప్‌ మీదే ఉంది. ఆ దిశగా వరుసగా వన్డే సిరీస్‌లు ఆడుతున్నాయి జట్లన్నీ. ఇప్పటికే న్యూజిలాండ్‌ పర్యటనలో ఓ సిరీస్‌ ఆడేసిన టీమ్‌ఇండియా.. ఇప్పుడు బంగ్లాదేశ్‌తో పోరుకు సిద్ధమైంది. టెస్టులూ ఉన్న ఈ పర్యటనలో ముందుగా మూడు వన్డేల సిరీస్‌లో ఇరు జట్లూ తలపడబోతున్నాయి. న్యూజిలాండ్‌లో ద్వితీయ శ్రేణి జట్టుతో ఇబ్బంది పడ్డ భారత్‌.. ఇప్పుడు పూర్తి స్థాయి జట్టుతో బంగ్లాను ఢీకొనబోతోంది. మరి స్టార్లతో నిండిన టీమ్‌ఇండియా.. బంగ్లాను బెంబేలెత్తిస్తుందా?

బంగ్లాదేశ్‌ పర్యటనలో తొలి పోరుకు టీమ్‌ఇండియా సిద్ధమైంది. రోహిత్‌ సారథ్యంలోని భారత్‌.. ఆదివారం మూడు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో బంగ్లాను ఢీకొనబోతోంది. టీ20 ప్రపంచకప్‌ తర్వాత న్యూజిలాండ్‌ పర్యటనలో ద్వితీయ శ్రేణి జట్టుతో ఆడిన భారత్‌.. ఈ పర్యటనలో పూర్తి స్థాయి జట్టునే బరిలోకి దించుతోంది. కెప్టెన్‌ రోహిత్‌తో పాటు కోహ్లి, రాహుల్‌ ఈ సిరీస్‌కు అందుబాటులోకి వచ్చారు. పొట్టి కప్పులో పేలవ ఫామ్‌తో విమర్శలెదుర్కొన్న రోహిత్‌, రాహుల్‌ బంగ్లాపై చెలరేగిపోతారేమో చూడాలి. భారత తుది జట్టు కూర్పు కూడా ఆసక్తి రేకెత్తిస్తోంది. గత కొన్నేళ్ల నుంచి క్రమంగా ఎదుగుతూ పెద్ద జట్లను తరచుగా ఓడిస్తున్న బంగ్లాను భారత్‌ తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు.

మిడిల్‌లో రాహుల్‌?: టీ20లకు దూరం పెట్టిన ధావన్‌ను వన్డేల్లో మాత్రం ఆడిస్తున్నారు సెలక్టర్లు. వన్డే ప్రపంచకప్‌కు అతణ్ని కీలక ఆటగాడిగా భారత జట్టు యాజమాన్యం చూస్తున్నట్లుంది. అందుకే రోహిత్‌కు తోడుగా ధావన్‌నే ఓపెనర్‌గా పంపే అవకాశముంది. మరో ఓపెనర్‌ రాహుల్‌ మిడిలార్డర్లో ఆడే అవకాశముంది. కోహ్లి, శ్రేయస్‌ వరుసగా 3, 4 స్థానాల్లో ఆడొచ్చు. బంగ్లాదేశ్‌లో తిరుగులేని రికార్డున్న విరాట్‌.. ఆ ధాటిని కొనసాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు. రోహిత్‌, ధావన్‌, రాహుల్‌ కూడా స్థాయికి తగ్గ ప్రదర్శనతో విమర్శకులకు బదులివ్వాల్సిన అవసరముంది. ఈ సీనియర్ల మధ్య యువ ఆటగాళ్లు శ్రేయస్‌, పంత్‌ ఎలా తమ ప్రత్యేకతను చాటుకుంటారో చూడాలి. బుమ్రా, షమి అందుబాటులో లేకపోవడంతో పేస్‌ విభాగంలో అనుభవలేమి సమస్యగా మారొచ్చు. మరి శార్దూల్‌, సిరాజ్‌, దీపక్‌ చాహర్‌ సవాలును ఎలా కాచుకుంటారో? న్యూజిలాండ్‌లో సత్తా చాటిన సుందర్‌కు తోడు అక్షర్‌ పటేల్‌ స్పిన్‌ బాధ్యతలు పంచుకునే అవకాశముంది.

వాళ్లు లేకున్నా..: బంగ్లాదేశ్‌ కొందరు కీలక ఆటగాళ్ల సేవల్ని కోల్పోయింది. కెప్టెన్‌ తమీమ్‌తో పాటు ఫామ్‌లో ఉన్న పేసర్‌ తస్కిన్‌ అహ్మద్‌ గాయాలతో ఈ సిరీస్‌కు దూరమయ్యారు. అయితే బ్యాటింగ్‌లో తాత్కాలిక కెప్టెన్‌ లిటన్‌ దాస్‌కు తోడు షకిబ్‌, మహ్మదుల్లా ముష్ఫికర్‌.. బౌలింగ్‌లో ముస్తాఫిజుర్‌, మెహదీ హసన్‌ మిరాజ్‌ లాంటి సీనియర్ల మీద బంగ్లా భరోసాతో ఉంది. సొంతగడ్డపై బంగ్లాను ఎప్పుడూ తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. తమ దేశంలో భారత్‌తో జరిగిన గత సిరీస్‌నే స్ఫూర్తిగా తీసుకుని చెలరేగాలని బంగ్లా భావిస్తోంది.

తుది జట్లు (అంచనా).. భారత్‌: రోహిత్‌ (కెప్టెన్‌), ధావన్‌, కోహ్లి, శ్రేయస్‌, కేఎల్‌ రాహుల్‌, పంత్‌, సుందర్‌, అక్షర్‌ పటేల్‌, శార్దూల్‌, దీపక్‌ చాహర్‌, సిరాజ్‌;

బంగ్లాదేశ్‌: లిటన్‌ దాస్‌ (కెప్టెన్‌), అనాముల్‌ హక్‌, షకిబ్‌, ముష్ఫికర్‌, మహ్మదుల్లా, అఫిఫ్‌ హుస్సేన్‌, యాసిర్‌ అలీ, మెహదీ హసన్‌ మిరాజ్‌, హసన్‌ మహ్మూద్‌, ముస్తాఫిజుర్‌, ఎబాదత్‌ హొస్సేన్‌.


పిచ్‌ ఎలా ఉంది?

మిర్పూర్‌లోని షేర్‌-ఎ-బంగ్లా స్టేడియంలో పరుగులకు లోటుండదు. మంచి బ్యాటింగ్‌ లైనప్‌ ఉన్న భారత్‌ మొదట బ్యాటింగ్‌ చేస్తే సులువుగా 300 పైచిలుకు స్కోరు నమోదు చేయొచ్చు. పిచ్‌ నుంచి స్పిన్నర్లకు మంచి సహకారం అందుతుంది. తొలి వన్డేకు వర్షం ముప్పేమీ లేదు.

గుర్తుందా ఆ సిరీస్‌?

బంగ్లాదేశ్‌లో చివరగా 2015లో వన్డే సిరీస్‌ ఆడింది టీమ్‌ఇండియా. అప్పుడు మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ధోనీ సారథ్యంలోని భారత్‌ 1-2తో అనూహ్య పరాభవం చవిచూసింది. ముస్తాఫిజుర్‌ అరంగేట్ర మ్యాచ్‌లోనే 5 వికెట్లతో భారత్‌ నడ్డి విరిచి బంగ్లాను గెలిపించాడు. రెండో మ్యాచ్‌లోనూ 6 వికెట్లతో విజృంభించి జట్టుకు సిరీస్‌ అందించాడు. నామమాత్రమైన మూడో వన్డేలో భారత్‌ గెలిచింది. భారత్‌పై అరుదైన విజయం సిరీస్‌ విజయంతో బంగ్లా అభిమానులు రెచ్చిపోయారు. ముస్తాఫిజుర్‌.. భారత ఆటగాళ్లకు గుండ్లు కొట్టినట్లుగా పోస్టర్లు వేయడం వివాదం రేపింది.


షమి స్థానంలో ఉమ్రాన్‌

భారత సీనియర్‌ ఫాస్ట్‌బౌలర్‌ మహ్మద్‌ షమి మరోసారి గాయపడ్డాడు. భుజం గాయం కారణంగా అతను బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. షమి స్థానంలో జమ్ము-కశ్మీర్‌ పేసర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ జట్టులోకి ఎంపికయ్యాడు. టీ20 ప్రపంచకప్‌ ఆడాక న్యూజిలాండ్‌ పర్యటనకు దూరంగా ఉన్న షమి.. బంగ్లాతో సిరీస్‌ కోసం ప్రాక్టీస్‌ చేస్తుండగా గాయమైనట్లు బీసీసీఐ వెల్లడించింది. అతను బంగ్లాతో టెస్టు సిరీస్‌లో ఆడేది కూడా అనుమానమే.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని