IND-BAN: ఆ ఒక్కటి పడగొట్టలేక

బ్యాటర్ల చెత్త బ్యాటింగ్‌తో తక్కువ స్కోరుకే పరిమితమైనా, బౌలర్ల చక్కని బౌలింగ్‌తో పైచేయి సాధించేలా కనిపించిన టీమ్‌ఇండియా.. గెలుపు ముంగిట బోల్తా కొట్టింది.

Updated : 05 Dec 2022 09:24 IST

తొలి వన్డేలో భారత్‌ పరాజయం
బంగ్లాను గెలిపించిన మెహదీ, ముస్తాఫిజుర్‌

క్షీణిస్తున్న ప్రమాణాలతో నిరాశపరుస్తున్న టీమ్‌ఇండియా ఖాతాలో మరో పేలవ ప్రదర్శన. తాజాగా బంగ్లాదేశ్‌ చేతిలోనూ రోహిత్‌సేన పరాజయం పాలైంది. చెత్త బ్యాటింగ్‌,పేలవ ఫీల్డింగ్‌.. ఆఖర్లో పట్టుతప్పిన బౌలింగ్‌ టీమ్‌ఇండియా దిగ్భ్రాంతికర ఓటమికి కారణాలు. తొలి వన్డేలో ఈ ఓటమినైతే జీర్ణించుకోవడం చాలా కష్టం. ఎందుకంటే గెలుపు లాంఛనమే అనుకున్న స్థితిలో నిలిచినా.. టీమ్‌ఇండియా చేజేతులా మ్యాచ్‌ను చేజార్చుకుంది. 187 పరుగుల ఛేదనలో బంగ్లాను 136/9కి పరిమితం చేసిన భారత్‌.. మరొక్క వికెట్‌ను పడగొట్టలేక బంగ్లాదేశ్‌కు ఎప్పటికీ గుర్తుండిపోయే విజయాన్నందించింది. మెహదీ హసన్‌, ముస్తాఫిజుర్‌ బంగ్లా హీరోలు. బ్యాటింగ్‌లో జట్టును ఆదుకున్న కేఎల్‌ రాహుల్‌.. చివర్లో క్యాచ్‌ వదిలేయడం భారత్‌ కొంపముంచింది. 

మిర్పూర్‌

బ్యాటర్ల చెత్త బ్యాటింగ్‌తో తక్కువ స్కోరుకే పరిమితమైనా, బౌలర్ల చక్కని బౌలింగ్‌తో పైచేయి సాధించేలా కనిపించిన టీమ్‌ఇండియా.. గెలుపు ముంగిట బోల్తా కొట్టింది. ఆదివారం తొలి వన్డేలో ఒక్క వికెట్‌ తేడాతో బంగ్లాదేశ్‌ చేతిలో ఓడిపోయింది. మొదట భారత్‌ కష్టంగా 9 వికెట్లకు 186 పరుగులు సాధించింది. కేఎల్‌ రాహుల్‌ (73; 70 బంతుల్లో 5×4, 4×6) టాప్‌ స్కోరర్‌. షకిబ్‌ (5/36), ఎబాదత్‌ హుస్సేన్‌ (4/47) భారత్‌ను కట్టడి చేశారు. మెహదీ హసన్‌ మిరాజ్‌ (38 నాటౌట్‌; 39 బంతుల్లో 4×4, 2×6), ముస్తాఫిజుర్‌ (10 నాటౌట్‌; 11 బంతుల్లో 2×4) అద్భుతంగా పోరాడడంతో లక్ష్యాన్ని బంగ్లా 46 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ జంట అభేద్యమైన ఆఖరి వికెట్‌కు 51 పరుగులు జోడించింది. లిటన్‌ దాస్‌ (41; 63 బంతుల్లో 3×4, 1×6) రాణించాడు. భారత బౌలర్లలో సిరాజ్‌ (3/32), వాషింగ్టన్‌ సుందర్‌ (2/17) రాణించారు. మెహదీ హసన్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది.

గెలుపు లాంఛనమే అనుకుంటే..: బ్యాటర్లు పేలవ బ్యాటింగ్‌తో నిరాశపరిచినా భారత బౌలర్లు మాత్రం బంగ్లా బ్యాటర్లను పరీక్షించారు. స్పిన్నర్లు, పేసర్లు ఇద్దరికీ సహకరిస్తూ.. బ్యాటింగ్‌కు కష్టంగా ఉన్న పిచ్‌పై బంగ్లా బ్యాట్స్‌మెన్‌కు పరుగులు చేయడం చాలా కష్టమైంది. సిరాజ్‌, దీపక్‌ చాహర్‌ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశారు. ముఖ్యంగా చాహర్‌ బ్యాటర్లకు ఏమాత్రం స్వేచ్ఛనివ్వలేదు. తన తొలి అయిదు ఓవర్లలో కేవలం 8 పరుగులిచ్చి ఓ వికెట్‌ పడగొట్టాడు. పదో ఓవర్లో అనాముల్‌ (14)ను సిరాజ్‌ రెండో వికెట్‌గా వెనక్కి పంపేటప్పటికి బంగ్లా స్కోరు 26 మాత్రమే. అయితే షకిబ్‌ (29; 38 బంతుల్లో 3×4)తో కలిసి లిటన్‌ బంగ్లాను ఆదుకున్నాడు. స్కోరు వేగాన్ని కూడా పెంచి పరిస్థితిని చక్కదిదాడు. నిలదొక్కుకున్న లిటన్‌, షకిబ్‌లను సుందర్‌ ఔట్‌ చేసినా... ముష్ఫికర్‌ (18), మహ్మదుల్లా (14) నిలవడంతో బంగ్లా 34 ఓవర్లలో 127/4తో లక్ష్యం దిశగా సాగింది. చివరి 16 ఓవర్లలో విజయం కోసం ఆ జట్టు చేయాల్సింది 60 పరుగులే. కానీ భారత బౌలర్లు విజృంభించడంతో ఆట మలుపు తిరిగింది. మహ్మదుల్లాను ఔట్‌ చేయడం ద్వారా అయిదో వికెట్‌ భాగస్వామ్యాన్ని శార్దూల్‌ విడదీస్తే.. ఆ తర్వాత సిరాజ్‌, కుల్‌దీప్‌ సేన్‌ విజృంభించారు. దీంతో బంగ్లా 128/4 నుంచి 135/9కి పడిపోయింది. ఇక భారత్‌ విజయం లాంఛనమే అనుకున్నారంతా! కానీ భారత బౌలర్లు ఆ ఒక్క వికెట్‌ను పడగొట్టలేకపోయారు. గొప్ప పోరాట పటిమను ప్రదర్శించిన మెహదీ హసన్‌.. ఆఖరి బ్యాటర్‌ ముస్తాఫిజుర్‌తో కలిసి బంగ్లాను విజయతీరాలకు చేర్చాడు. భాగస్వామ్యానికి మొదట కాస్త వేగాన్నిచ్చింది ముస్తాఫిజురే.  సిరాజ్‌ బౌలింగ్‌లో 40వ ఓవర్లో అతడు బౌండరీ కొట్టాడు. 105 బంతుల్లో బంగ్లాకు వచ్చిన మొదటి బౌండరీ అది. అయితే ఆ తర్వాత మెహదీ.. తన భాగస్వామిని కాపాడుకుంటూ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. కుల్‌దీప్‌ సేన్‌ ఓవర్లో రెండు సిక్స్‌లు కొట్టిన అతడు.. దీపక్‌ చాహర్‌ ఓవర్లో మూడు ఫోర్లు బాదాడు. బంగ్లాకు 6 ఓవర్లలో 14 పరుగులు అవసరమైన స్థితిలో ముస్తాఫిజుర్‌ ఏమాత్రం బెదరకుండా.. మిరాజ్‌ అండతో జట్టును గెలిపించాడు. 43వ ఓవర్లో మిరాజ్‌ ఇచ్చిన క్యాచ్‌ను వికెట్‌కీపర్‌ రాహుల్‌ చేజార్చి ఉండకపోతే మ్యాచ్‌లో భారతే గెలిచేది.

రాహుల్‌ తప్ప..: అంతకుముందు బ్యాటింగ్‌లో టీమ్‌ఇండియా చెమటోడ్చింది. రాహుల్‌ తప్ప ఒక్క బ్యాటర్‌ కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌ ఆడలేదు. ఆరో ఓవర్లో ధావన్‌ (7)ను ఔట్‌ చేయడం ద్వారా మెహదీ హసన్‌ భారత పతనాన్ని ఆరంభించాడు. అప్పటికి స్కోరు 23 మాత్రమే. షకిబ్‌ 11వ ఓవర్లో రోహిత్‌ (27), కోహ్లి (9)లు ఇద్దరినీ వెనక్కి పంపాడు. 49కే మూడు వికెట్లు కోల్పోయిన జట్టును రాహుల్‌ ఆదుకున్నాడు. శ్రేయస్‌ (24)తో నాలుగో వికెట్‌కు 43 పరుగులు జోడించిన అతను.. సుందర్‌ (19)తో 60 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. 33వ ఓవర్లో సుందర్‌ ఔటయ్యేటప్పటికి 152/5తో భారత్‌ కాస్త మెరుగ్గానే ఉంది. కానీ దిగువ వరుస బ్యాట్స్‌మెన్‌ క్యూ కట్టడంతో చాలా తక్కువ స్కోరుకే పరిమితమైంది. మొత్తం మీద భారత్‌ 34 పరుగుల వ్యవధిలో చివరి ఆరు వికెట్లు చేజార్చుకుంది. మిగతా బ్యాటర్లు కష్టపడ్డ అదే పిచ్‌పై రాహుల్‌ సాధికారికంగా బ్యాటింగ్‌ చేశాడు. అతను చివరికి తొమ్మిదో వికెట్‌ రూపంలో నిష్క్రమించాడు.

భారత్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ (బి) షకిబ్‌ 27; ధావన్‌ (బి) మెహదీ హసన్‌ 7; కోహ్లి (సి) లిటన్‌ (బి) షకిబ్‌ 9; శ్రేయస్‌ (సి) ముష్ఫికర్‌ (బి) ఎబాదత్‌ 24; రాహుల్‌ (సి) అనాముల్‌ (బి) ఎబాదత్‌ 73; సుందర్‌ (సి) ఎబాదత్‌ (బి) షకిబ్‌ 19; షాబాజ్‌ (సి) షకిబ్‌ (బి) ఎబాదత్‌ 0; శార్దూల్‌ (బి) షకిబ్‌ 2; దీపక్‌ చాహర్‌ ఎల్బీ (బి) షకిబ్‌ 0; సిరాజ్‌ (సి) మహ్మదుల్లా (బి) ఎబాదత్‌ 9; కుల్‌దీప్‌ సేన్‌ నాటౌట్‌ 2; ఎక్స్‌ట్రాలు 14

మొత్తం: (41.2 ఓవర్లలో ఆలౌట్‌) 186; వికెట్ల పతనం: 1-23, 2-48, 3-49, 4-92, 5-152, 6-153, 7-156, 8-156, 9-178; బౌలింగ్‌: ముస్తాఫిజుర్‌ 7-1-19-0; హసన్‌ మహమూద్‌ 7-1-40-0; మెహదీ హసన్‌ మిరాజ్‌ 9-1-43-1; షకిబ్‌ అల్‌ హసన్‌ 10-2-36-5; ఎబాదత్‌ హుస్సేన్‌ 8.2-0-47-4

బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌: నజ్ముల్‌ హుస్సేన్‌ (సి) రోహిత్‌ (బి) చాహర్‌ 0; లిటన్‌ దాస్‌ (సి) రాహుల్‌ (బి) సుందర్‌ 41; అనాముల్‌ (సి) సుందర్‌ (బి) సిరాజ్‌ 14; షకిబ్‌ (సి) కోహ్లి (బి) సుందర్‌ 29; ముష్ఫికర్‌ రహీమ్‌ (బి) సిరాజ్‌ 18; మహ్మదుల్లా ఎల్బీ (బి) శార్దూల్‌ 14; అఫిఫ్‌ (సి) సిరాజ్‌ (బి) కుల్‌దీప్‌ సేన్‌ 6; మెహదీ హసన్‌ నాటౌట్‌ 38; ఎబాదత్‌ హిట్‌ వికెట్‌ (బి) కుల్‌దీప్‌ సేన్‌ 0; హసన్‌ మహమూద్‌ ఎల్బీ (బి) సిరాజ్‌ 0; ముస్తాఫిజుర్‌ నాటౌట్‌ 10; ఎక్స్‌ట్రాలు 17 మొత్తం: (46 ఓవర్లలో 9 వికెట్లకు) 187; వికెట్ల పతనం: 1-0, 2-26, 3-74, 4-95, 5-128, 6-128, 7-134, 8-135, 9-136; బౌలింగ్‌: దీపక్‌ చాహర్‌ 8-1-32-1; సిరాజ్‌ 10-1-32-3; కుల్‌దీప్‌ సేన్‌ 5-0-37-2; షాబాజ్‌ అహ్మద్‌ 9-0-39-0; వాషింగ్టన్‌ సుందర్‌ 5-0-17-2; శార్దూల్‌ ఠాకూర్‌ 9-1-21-1


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు