అదరగొట్టిన ఎంబాపె

ఫిఫా ప్రపంచకప్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఫ్రాన్స్‌ అదరగొట్టింది. ఎంబాపె మెరుపులతో ఆదివారం ప్రిక్వార్టర్స్‌లో పోలెండ్‌ను 3-1 గోల్స్‌తో ఓడించి తుది ఎనిమిది జాబితాలో చోటు దక్కించుకుంది.

Published : 05 Dec 2022 02:44 IST

పోలెండ్‌పై నెగ్గి క్వార్టర్స్‌లో ఫ్రాన్స్‌

దోహా: ఫిఫా ప్రపంచకప్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఫ్రాన్స్‌ అదరగొట్టింది. ఎంబాపె మెరుపులతో ఆదివారం ప్రిక్వార్టర్స్‌లో పోలెండ్‌ను 3-1 గోల్స్‌తో ఓడించి తుది ఎనిమిది జాబితాలో చోటు దక్కించుకుంది. మ్యాచ్‌లో బంతిని ఎక్కువ నియంత్రించిన ఫ్రాన్స్‌ (54 శాతం) వరుస దాడులతో ప్రత్యర్థి డిఫెన్స్‌ను పరీక్షించింది. కానీ నెమ్మదిగా పుంజుకున్న పోలెండ్‌ కూడా కొన్ని గోల్‌ ప్రయత్నాలు చేసింది. 38వ నిమిషంలో అయితే దాదాపు గోల్‌ చేసినంత పని చేసింది. కానీ ఫ్రాన్స్‌ డిఫెండర్లు గట్టిగా నిలిచి పోలెండ్‌ ప్రయత్నాన్ని నిలువరించారు. మరో నిమిషంలో విరామం అనగా ఫ్రాన్స్‌ ఖాతా తెరిచింది. పోలెండ్‌ గోల్‌ బాక్స్‌ సమీపంలో బంతిని దొరకబుచ్చుకున్న ఒలివర్‌ గిరూడ్‌ (44వ ని) డిఫెండర్లను బోల్తా కొట్టిస్తూ గోల్‌ చేసేశాడు. ఈ క్రమంలో ఫ్రాన్స్‌ తరఫున అత్యధిక గోల్స్‌ (52) కొట్టిన ఆటగాడిగా థియరీ హెన్రీని అధిగమించాడు. ద్వితీయార్థంలోనూ ఫ్రాన్స్‌ దూకుడు కొనసాగించింది. డిఫెన్స్‌ను పటిష్టం చేసుకుని దాడులు చేసింది. ఓ క్రాస్‌ను అందుకుంటూ 74వ నిమిషంలో పోలెండ్‌ గోల్‌ ప్రాంతానికి దూసుకొచ్చిన ఎంబాపె ప్రత్యర్థి రక్షణ శ్రేణిని ఛేదిస్తూ బంతిని నెట్‌లోకి పంపేశాడు. రెండో గోల్‌ పడడంతో ఫ్రాన్స్‌ మరింత ఉత్సాహంగా కదలగా.. పోలెండ్‌ ఢీలా పడింది. ఇంజురీ సమయంలో ఎంబాపె (91వ) మరో దెబ్బ కొట్టాడు. కార్నర్‌ క్రాస్‌ అందుకున్న అతడు నెట్‌కు ఓ మూలగా బంతిని షూట్‌ చేశాడు. గోల్‌కీపర్‌కు ఏమాత్రం అవకాశం లేకుండా దూసుకెళ్లిన ఆ బంతి నెట్‌ను ముద్దాడింది. అప్పటికే పరాజయం ఖాయమైన పోలెండ్‌కు ఆఖరి నిమిషంలో లెవాన్‌డోస్కీ (99వ, పెనాల్టీ) ఓ గోల్‌ అందించాడు.

* ప్రపంచకప్‌లో క్వార్టర్స్‌ చేరడం ఫ్రాన్స్‌కు ఇది వరుసగా మూడోసారి. 2014, 2018 టోర్నీల్లోనూ తుది ఎనిమిదిలో చోటు దక్కించుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని