1000లో మెస్సి మాయ

కెరీర్‌లో 1000వ మ్యాచ్‌.. అదీ ప్రతిష్ఠాత్మక ప్రపంచకప్‌లో.. దాదాపుగా అర్జెంటీనా అభిమానులతో నిండిపోయిన స్టేడియంలో.. ‘‘మెస్సి.. మెస్సి’’ అనే కేరింతల మధ్యలో.. అతడు మరోసారి అదరగొట్టాడు. డ్రిబ్లింగ్‌ చేస్తూ.. ప్రత్యర్థి ఆటగాళ్లను తప్పిస్తూ..

Updated : 05 Dec 2022 03:38 IST

క్వార్టర్స్‌లో అర్జెంటీనా
ఆస్ట్రేలియాపై విజయం

కెరీర్‌లో 1000వ మ్యాచ్‌.. అదీ ప్రతిష్ఠాత్మక ప్రపంచకప్‌లో.. దాదాపుగా అర్జెంటీనా అభిమానులతో నిండిపోయిన స్టేడియంలో.. ‘‘మెస్సి.. మెస్సి’’ అనే కేరింతల మధ్యలో.. అతడు మరోసారి అదరగొట్టాడు. డ్రిబ్లింగ్‌ చేస్తూ.. ప్రత్యర్థి ఆటగాళ్లను తప్పిస్తూ.. గోల్‌ నమోదు చేసి.. సహచర ఆటగాళ్లకు పాస్‌ అందిస్తూ.. ఇలా మైదానంలో ఎక్కడ చూసినా అతడే. మెస్సి మాయకు తోడు అల్వారెజ్‌ గోల్‌.. గోల్‌కీపర్‌ పోరాటం కలిసి అర్జెంటీనా క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. ఆస్ట్రేలియాను ఓడించి కప్పు దిశగా మరో అడుగు వేసింది.

‘‘ప్రపంచకప్‌ అంటే ఇలాగే ఉంటుంది. అన్ని మ్యాచ్‌లూ కఠినమే. అన్నిటి కంటే ముఖ్యమైంది విజయం సాధించడం. మా కోసం అర్జెంటీనా మొత్తం ఇక్కడికి రావాలనుకుంటోంది. కానీ అది సాధ్యం కాదు. ఈ బంధం, ఐకమత్యం ఎంతో అందమైంది’’ 

మెస్సి

ఫిఫా ప్రపంచకప్‌ తొలి మ్యాచ్‌లో సౌదీ అరేబియా చేతిలో ఓటమి తర్వాత బలంగా పుంజుకున్న అర్జెంటీనా.. క్వార్టర్స్‌ చేరింది. వరుసగా మూడో విజయంతో అదరగొట్టింది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన ప్రిక్వార్టర్స్‌లో మెస్సి జట్టు 2-1 తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. మెస్సి (35వ నిమి షంలో), జులియన్‌ అల్వారెజ్‌ (57వ) చెరో గోల్‌ కొట్టారు. ప్రపంచకప్‌ చరిత్రలో రెండో సారి మాత్రమే నాకౌట్లో ఆడిన కంగారూ జట్టు.. చివర్లో అర్జెంటీనాను కంగారు పెట్టినా ఓటమి తప్పించుకోలేకపోయింది. మెస్సి సేన ఆరంభం నుంచి ఆధిపత్యం చలాయించింది. 53 శాతం బంతిపై నియంత్రణ సాధించింది. ముఖ్యంగా కెరీర్‌లో వెయ్యో మ్యాచ్‌ ఆడుతున్న మెస్సి తనకు అలవాటైన రీతిలో ప్రత్యర్థి డిఫెండర్లతో ఆటాడుకున్నాడు. బంతి దొరికితే చాలు డ్రిబ్లింగ్‌ చేసుకుంటూ.. గోల్‌పోస్టు వైపు దూసుకెళ్లాడు. మెస్సీపైనే ప్రత్యేకంగా దృష్టి పెట్టిన ఆసీస్‌ అతణ్ని ఆపేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. కానీ చివరకు బలమైన డిఫెన్స్‌ను ఛేదిస్తూ మెస్సి జట్టు ఖాతా తెరిచాడు. కుడి వైపు నుంచి పాస్‌ను అలిస్టర్‌కు అందించిన మెస్సి.. ప్రత్యర్థి పెనాల్టీ ప్రదేశంలోకి దూసుకెళ్లాడు. అలిస్టర్‌ నుంచి నికోలస్‌ దగ్గరకు వచ్చిన బంతిని వేగంగా అందుకున్న మెస్సి.. ముగ్గురు డిఫెండర్లు, గోల్‌కీపర్‌ను బోల్తా కొట్టిస్తూ ఎడమ కాలితో లోపలికి తన్నాడు. ఈ ప్రపంచకప్‌లో అతనికిది మూడో గోల్‌. అనంతరం అల్వారెజ్‌ తెలివిగా అర్జెంటీనాకు రెండో గోల్‌ అందించాడు. ఆసీస్‌ గోల్‌కీపర్‌ ర్యాన్‌ తప్పిదాన్ని అతను అవకాశంగా మలుచుకున్నాడు. అర్జెంటీనా ఆటగాడు రోడ్రిగ్‌ బంతి కోసం ప్రయత్నించగా ర్యాన్‌ తడబడి జారాడు. వెంటనే వేగంగా స్పందించిన అల్వారెజ్‌ ఆ బంతిని దక్కించుకుని అలవోకగా గోల్‌ రాబట్టాడు. ఆఖరి 20 నిమిషాల్లో ఆస్ట్రేలియా గట్టిగా పోరాడింది. 77వ నిమిషంలో పెనాల్టీ ప్రదేశం బయట నుంచి క్రెయిగ్‌ గుడ్‌విన్‌ తన్నిన బంతి.. అర్జెంటీనా మిడ్‌ఫీల్డర్‌ ఫెర్నాండెజ్‌కు తాకి దిశను మార్చుకుని గోల్‌కీపర్‌కు అందకుండా లోపలికి వెళ్లిపోయింది. అదనపు సమయంలో గోల్‌కీపర్‌ మార్టినెజ్‌ అర్జెంటీనా ఆశలు నిలిపాడు. చాలా దగ్గర నుంచి గరాంగ్‌ కిక్‌ను అతను సమర్థంగా అడ్డుకున్నాడు. దీంతో మ్యాచ్‌ అర్జెంటీనా సొంతమైంది. క్వార్టర్స్‌లో ఆ జట్టు అర్జెంటీనా తలపడుతుంది.

1000

ప్రొఫెషనల్‌ ఆటగాడిగా మెస్సి ఆడిన మ్యాచ్‌లు. అందులో అర్జెంటీనా తరపున 169 (94 గోల్స్‌), బార్సిలోనా తరపున 778 (672 గోల్స్‌), పారిస్‌ సెయింట్‌ జర్మైన్‌ తరపున 53 (23 గోల్స్‌) మ్యాచ్‌లాడాడు. మొత్తం 789 గోల్స్‌ సాధించాడు. మరో 338 గోల్స్‌ చేయడంలో సాయపడ్డాడు.

1
అయిదో ప్రపంచకప్‌ ఆడుతున్న మెస్సీకి నాకౌట్లో ఇదే తొలి గోల్‌.

3
ఈ ప్రపంచకప్‌లో మెస్సి గోల్స్‌. ఎంబాపె (ఫ్రాన్స్‌) 5 గోల్స్‌తో అగ్రస్థానంలో ఉన్నాడు. వాలెన్సియా (ఈక్వెడార్‌), గాక్‌పో (నెదర్లాండ్స్‌), మొరాటా (స్పెయిన్‌), రష్‌ఫోర్డ్‌ (ఇంగ్లాండ్‌)తో కలిసి మెస్సి రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.

9
ప్రపంచకప్‌ చరిత్రలో మెస్సి చేసిన గోల్స్‌. అర్జెంటీనా తరపున మెగా టోర్నీలో అత్యధిక గోల్స్‌ చేసిన ఆటగాళ్ల జాబితాలో గాబ్రియల్‌ (10) తర్వాత అతను రెండో స్థానానికి చేరుకున్నాడు. ప్రపంచకప్‌లో గోల్‌ చేసిన అతి పెద్ద వయస్సు అర్జెంటీనా ఆటగాడిగా మెస్సి (35 ఏళ్ల 162 రోజులు) నిలిచాడు. గతంలో ఈ రికార్డు రాబర్టో అయాలా (2006లో 33 ఏళ్ల 77 రోజులు) పేరు మీద ఉంది.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు