ఒలింపిక్‌ బెర్తుపై లిఫ్టర్ల కన్ను

పారిస్‌ ఒలింపిక్స్‌ (2024) బెర్తు దక్కించుకోవడమే లక్ష్యంగా భారత లిఫ్టర్లు సోమవారం ఆరంభమయ్యే ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో బరిలో దిగుతున్నారు.

Published : 05 Dec 2022 02:43 IST

నేటి నుంచే ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్‌

బగోటా: పారిస్‌ ఒలింపిక్స్‌ (2024) బెర్తు దక్కించుకోవడమే లక్ష్యంగా భారత లిఫ్టర్లు సోమవారం ఆరంభమయ్యే ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో బరిలో దిగుతున్నారు. టోక్యో ఒలింపిక్స్‌ రజత పతక విజేత మీరాబాయి చాను (49 కేజీ)పైనే అందరి దృష్టి నిలిచింది. స్నాచ్‌లో 90 కేజీలు ఎత్తడం మీరా లక్ష్యమే అయినా గతంలో వెన్నునొప్పి వెంటాడిన దృష్ట్యా ఆమె ఈ సాహసం చేయకపోవచ్చు. ప్రస్తుతం స్నాచ్‌లో మీరా అత్యుత్తమ ప్రదర్శన 88 కేజీలు. 49 కేజీల విభాగంలో ప్రస్తుతం మీరా నంబర్‌వన్‌. ఆమెకు టోక్యో ఒలింపిక్‌ ఛాంపియన్‌ హు జిహుయ్‌, జియా హుయ్‌హువా (చైనా) నుంచి గట్టిపోటీ ఎదురు కానుంది. చానుతో పాటు బింద్యారాణి దేవి (59 కేజీ), అచింత షూలీ (73 కేజీ), గుర్‌దీప్‌ సింగ్‌ (109 కేజీల పైన), రిషికాంత సింగ్‌ (61 కేజీ) కూడా బరిలో ఉన్నారు. కామన్వెల్త్‌ ఛాంపియన్‌ అచింత, కాంస్య పతక విజేత గుర్‌దీప్‌పై మంచి అంచనాలే ఉన్నాయి. పారిస్‌ ఒలింపిక్స్‌కు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ తొలి అర్హత పోటీగా ఉంది. అయితే దీనిలో పాల్గొనడం ఐచ్ఛికం. కానీ 2023 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌, 2024 ప్రపంచకప్‌లలో మాత్రం తప్పనిసరిగా బరిలో దిగాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని