మూడు సింహాల జోరు

ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌ జోరు కొనసాగుతోంది. గోల్స్‌ వేటలో దూసుకెళ్తోన్న ఆ జట్టు మరోసారి ఏకపక్ష విజయం అందుకుంది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన ప్రిక్వార్టర్స్‌లో ఇంగ్లాండ్‌ 3-0 తేడాతో సెనెగల్‌ను చిత్తుచేసింది.

Updated : 06 Dec 2022 04:01 IST

క్వార్టర్స్‌లో ఇంగ్లాండ్‌
సెనెగల్‌పై 3-0తో విజయం

ఇంగ్లాండ్‌ మరోసారి సత్తా  చాటింది. ఫిఫా ప్రపంచకప్‌లో తామెందుకు టైటిల్‌ ఫేవరెట్టో మళ్లీ నిరూపించింది. సెనెగల్‌ను చిత్తుచేసి ఈ ‘మూడు సింహాల (త్రీ లయన్స్‌)’ జట్టు సగర్వంగా క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. అంచనాలను నిలబెట్టుకుంటూ దూకుడైన ఆటతో అదరగొట్టిన ఇంగ్లాండ్‌ మెగా టోర్నీ చరిత్రలో పదోసారి ప్రిక్వార్టర్స్‌ గడప దాటింది.

అల్ ఖొర్‌:  ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌ జోరు కొనసాగుతోంది. గోల్స్‌ వేటలో దూసుకెళ్తోన్న ఆ జట్టు మరోసారి ఏకపక్ష విజయం అందుకుంది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన ప్రిక్వార్టర్స్‌లో ఇంగ్లాండ్‌ 3-0 తేడాతో సెనెగల్‌ను చిత్తుచేసింది. జోర్డాన్‌ హెండర్సన్‌ (38వ నిమిషంలో), కెప్టెన్‌ హ్యారీ కేన్‌ (45+3వ), బుకాయో సాకా (57వ) తలో గోల్‌ కొట్టారు. గోల్స్‌ చేయకపోయినా సహచరులు బంతిని నెట్‌లోకి పంపడంలో కీలక పాత్ర పోషించిన టీనేజర్‌ జూడ్‌ బెల్లింగ్‌హామ్‌, ఫోడెన్‌ ఆకట్టుకున్నారు. ముఖ్యంగా మిడ్‌ఫీల్డ్‌లో చురుగ్గా కదిలిన బెల్లింగ్‌హామ్‌.. ప్రత్యర్థి జట్టుకు చిక్కకుండా బంతిని పాస్‌ చేసి గోల్స్‌ అవకాశాలు సృష్టించాడు.
మ్యాచ్‌ను ఇంగ్లాండ్‌ నెమ్మదిగా మొదలెట్టింది. ప్రత్యర్థి రక్షణశ్రేణిని ఛేదించడానికి సమయం తీసుకుంది. డిఫెన్స్‌లో సెనెగల్‌ బలంగా నిలబడింది. అంతే కాకుండా పలు మార్లు గోల్స్‌ చేసేలా కనిపించింది. ఇంగ్లిష్‌ ఆటగాళ్లను దాటుకుని గోల్‌పోస్టుకు దగ్గరగా దూసుకెళ్లిన బోలాయె గోల్‌ కొట్టినంత పని చేశాడు. అతని మెరుపు షాట్‌ను గోల్‌కీపర్‌ జోర్డాన్‌ పిక్‌ఫోర్డ్‌ ఒంటి చేత్తో అద్భుతంగా అడ్డుకోకపోయింటే సెనెగల్‌ ఖాతా తెరిచేదే. అక్కడి నుంచి ఇంగ్లాండ్‌ అప్రమత్తమైంది. ఆటలో వేగం పెంచింది. 38వ నిమిషంలో ప్రత్యర్థి ఆటగాళ్ల మధ్య ఖాళీని గుర్తించి బెల్లింగ్‌హామ్‌ అందించిన పాస్‌ను ఎలాంటి పొరపాటు లేకుండా హెండర్సన్‌ నెట్‌లోకి పంపి ఇంగ్లాండ్‌ ఖాతా తెరిచాడు. దీంతో అప్పటి వరకూ సెనెగల్‌ ఆధిపత్యంతో నిశ్శబ్దంగా ఉండిపోయిన ఇంగ్లాండ్‌ అభిమాన దళం ఒక్కసారిగా హోరెత్తింది. అప్పటివరకూ పటిష్ఠంగా కనిపించిన సెనెగల్‌ డిఫెన్స్‌ ఢీలా పడింది. ఆ వెంటనే కేన్‌ ఓ అవకాశాన్ని వృథా చేస్తూ బంతిని గోల్‌పోస్టు పైనుంచి పంపించాడు. కానీ ఈ ప్రపంచకప్‌లో తొలి గోల్‌ చేసేందుకు అతనికి ఎక్కువ సమయం పట్టలేదు. తొలి అర్ధభాగం అదనపు సమయంలో సెనెగల్‌ ఆటగాళ్లను దాటుకుంటూ ఫోడెన్‌కు బెల్లింగ్‌హామ్‌ బంతి పాస్‌ చేశాడు. ఫోడెన్‌ నుంచి పాస్‌ అందుకున్న కేన్‌ గోల్‌కీపర్‌ను బోల్తా కొట్టించి ఇంగ్లాండ్‌ను 2-0 ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. విరామం తర్వాత ఇంగ్లాండ్‌ మరింత జోరు పెంచింది. ఫోడెన్‌ నుంచి బంతి అందుకున్న సాకా అలవోకగా గోల్‌ రాబట్టాడు. టోర్నీలో అతనికిది మూడో గోల్‌. కనీసం ఒక్క గోలైనా చేసేందుకు సెనెగల్‌ తీవ్రంగా కష్టపడింది. 74వ నిమిషంలో లభించిన ఫ్రీకిక్‌ను ఆ జట్టు ఆటగాడు పాపె సార్‌ వృథా చేశాడు. చివరి వరకూ ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వని ఇంగ్లాండ్‌ ఘన విజయంతో మైదానం వీడింది. క్వార్టర్స్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఫ్రాన్స్‌తో ఆ జట్టు తలపడుతుంది.

2
టామ్‌ ఫిన్నె (1958లో 36 ఏళ్ల 64 రోజుల వయసులో) తర్వాత ప్రపంచకప్‌లో గోల్‌ చేసిన అతి పెద్ద వయసు ఇంగ్లాండ్‌ ఆటగాడిగాహెండర్సన్‌ (32 ఏళ్ల 170 రోజులు) నిలిచాడు. ప్రపంచకప్‌లో అతనికిదే తొలి గోల్‌.

12
ఈ ప్రపంచకప్‌లో ఇప్పటికే ఇంగ్లాండ్‌ నమోదు చేసిన గోల్స్‌. అత్యధిక గోల్స్‌ కొట్టిన జట్ల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

21
ఆఫ్రికా జట్లపై ఇంగ్లాండ్‌ వరుసగా అజేయంగా నిలిచిన మ్యాచ్‌లు.

* వ్యక్తిగత కారణాలతో కుటుంబాన్ని కలిసేందుకు ఖతార్‌ నుంచి ఇంగ్లాండ్‌కు బయల్దేరిన స్టార్‌ ఆటగాడు రహీం స్టెర్లింగ్‌ మొత్తం టోర్నీకే దూరమయ్యే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని