ఇంగ్లాండ్‌దే తొలి టెస్టు

ఇంగ్లాండ్‌ సాధించింది! పరుగులు వరదలా పారిన జీవం లేని రావల్పిండి పిచ్‌పై ఫలితాన్ని రాబట్టి ఔరా అనిపించింది.

Updated : 06 Dec 2022 03:59 IST

పాకిస్థాన్‌పై చిరస్మరణీయ విజయం

రావల్పిండి: ఇంగ్లాండ్‌ సాధించింది! పరుగులు వరదలా పారిన జీవం లేని రావల్పిండి పిచ్‌పై ఫలితాన్ని రాబట్టి ఔరా అనిపించింది. పాకిస్థాన్‌తో తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ధాటిగా ఆడి త్వరగా డిక్లేర్‌ చేసి సాహసం చేసిన ఇంగ్లిష్‌ జట్టు.. సోమవారం బంతితో ప్రత్యర్థిని చుట్టేసి 74 పరుగుల తేడాతో చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. అండర్సన్‌ (4/36), రాబిన్సన్‌ (4/50) గెలుపులో కీలకమయ్యారు. దీంతో మూడు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లాండ్‌ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. 343 పరుగుల ఛేదనలో ఓవర్‌నైట్‌ స్కోరు 80/2తో ఆఖరి రోజు ఇన్నింగ్స్‌ కొనసాగించిన పాక్‌ 268కే ఆలౌటైంది. మొదటి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన ఇమాముల్‌ హక్‌ (48) త్వరగా ఔటైనా.. ఓవర్‌నైట్‌ బ్యాటర్‌ షకీల్‌ (76) పోరాడాడు. అతడికి తోడు అజహర్‌ అలీ (40), రిజ్వాన్‌ (46) నిలవడంతో ఒక దశలో పాక్‌ 176/3తో మెరుగ్గానే కనిపించింది. అయితే తక్కువ వ్యవధిలో రిజ్వాన్‌, షకీల్‌, అజహర్‌ ఔట్‌ కావడంతో పాక్‌ పోరాటానికి తెరపడింది. సల్మాన్‌ (30) నిలిచినా పరుగుల అంతరాన్ని మాత్రమే తగ్గించగలిగాడు. పాకిస్థాన్‌ తన చివరి 7 వికెట్లను 92 పరుగులకే చేజార్చుకుంది. అండర్సన్‌, రాబిన్సన్‌ ఆ జట్టు పతనాన్ని శాసించారు. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ 657 పరుగులు చేయగా.. పాక్‌ 579 పరుగులకు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌ను ఇంగ్లాండ్‌ 264/7 వద్ద డిక్లేర్‌ చేసింది.

లివింగ్‌స్టోన్‌ ఔట్‌: ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ లిమ్‌ లివింగ్‌స్టోన్‌ పాకిస్థాన్‌తో టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. తొలి మ్యాచ్‌లో కుడి మోకాలికి గాయం కావడంతో మిగిలిన రెండు టెస్టులకు అందుబాటులో లేకుండాపోయాడు. ఈ టెస్టుతో అరంగేట్రం చేసిన 29 ఏళ్ల లివింగ్‌స్టోన్‌ ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్‌లో బౌండరీ లైన్‌ దగ్గర ఫీల్డింగ్‌ చేస్తూ గాయపడ్డాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు