సంక్షిప్త వార్తలు(5)

పారా బ్యాడ్మింటన్‌ ఇంటర్నేషనల్‌ టోర్నీలో సుకాంత్‌ కదమ్‌ స్వర్ణం గెలుచుకున్నాడు.

Published : 06 Dec 2022 02:25 IST

సుకాంత్‌ ఖాతాలో పసిడి

దిల్లీ: పారా బ్యాడ్మింటన్‌ ఇంటర్నేషనల్‌ టోర్నీలో సుకాంత్‌ కదమ్‌ స్వర్ణం గెలుచుకున్నాడు. పెరూలో జరిగిన ఈ టోర్నీలో పురుషుల ఎస్‌ఎల్‌-4 సింగిల్స్‌ ఫైనల్లో అతడు 21-14, 21-15తో చిహింగ్‌ (సింగపూర్‌)పై విజయం సాధించాడు. ఎస్‌ఎల్‌-3 సింగిల్స్‌ తుది పోరులో నేహల్‌ గుప్తా 21-16, 21-14తో మాథ్యూ థామస్‌ (ఫ్రాన్స్‌)పై గెలిచి పసిడి దక్కించుకున్నాడు. మహిళల ఎస్‌హెచ్‌-6 ఫైనల్లో నిత్యశ్రీ శివన్‌ 21-6, 21-13తో పొవేడా ఫ్లోర్స్‌ (పెరూ)పై నెగ్గగా.. ఎస్‌ఎల్‌-3 టైటిల్‌ పోరులో మన్‌దీప్‌ కౌర్‌ 21-11, 21-11తో ఒక్సానా (ఉక్రెయిన్‌)ను ఓడించింది. పురుషులు, మహిళల డబుల్స్‌లోనూ స్వర్ణాలు భారత్‌ సొంతమయ్యాయి. పురుషుల తుది పోరులో బెర్నో జాన్సన్‌-నెహాల్‌ గుప్తా 21-16, 21-13తో రెంజో-మొరాల్స్‌ (పెరూ)పై నెగ్గగా.. మహిళల ఫైనల్లో పారుల్‌ పర్మర్‌-వైశాలి జోడీ 21-17, 21-19తో కెల్లీ-మన్‌దీప్‌ జంటపై విజయం సాధించింది.


ఆసియా కప్‌ బిడ్‌ను ఉపసంహరించుకున్న ఏఐఎఫ్‌ఎఫ్‌

దిల్లీ: 2027 ఏఎఫ్‌సీ ఆసియా కప్‌  ఆతిథ్య బిడ్‌ను అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్‌) ఉపసంహరించుకుంది. ప్రస్తుతం పెద్ద టోర్నీల నిర్వహణ తమ వ్యూహాత్మక ప్రాధాన్యతలో లేదంటూ సోమవారం ప్రకటించింది. ఏఐఎఫ్‌ఎఫ్‌ ఉపసంహరణతో ఆసియా కప్‌ ఆతిథ్యం రేసులో సౌదీ అరేబియా ఒక్కటే మిగిలింది. ‘‘ఈ నెలాఖరులో ప్రకటించనున్న భవిష్యత్‌ ప్రణాళిక ప్రకారం పెద్ద టోర్నీల నిర్వహణ తమ వ్యూహాత్మక ప్రాధాన్యతలకు సరిపోదని ఏఐఎఫ్‌ఎఫ్‌ మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది. ఆసియా కప్‌ వంటి పెద్ద టోర్నీల నిర్వహణ గురించి ఆలోచించే ముందు సరైన ఫుట్‌బాల్‌ వ్యవస్థ నిర్మాణంపై ప్రస్తుతం దృష్టిసారించాం’’ అని ఏఐఎఫ్‌ఎఫ్‌ ఓ ప్రకటనలో పేర్కొంది.


టీమ్‌ ఇండియాకు జరిమానా

మిర్పూర్‌: బంగ్లాదేశ్‌తో తొలి వన్డేలో స్లో ఓవర్‌ రేటు కారణంగా భారత క్రికెటర్ల మ్యాచ్‌ ఫీజులో 80 శాతం కోత పడింది. నిర్ణీత సమయం లోపు నాలుగు ఓవర్లు తక్కువగా వేసిన టీమ్‌ఇండియాకు రిఫరీ రంజన్‌ మదుగలె ఈ జరిమానా విధించాడు. ఐసీసీ నిబంధనల ప్రకారం నిర్ణీత సమయంలోపు ఓవర్లు పూర్తి చేయకపోతే ప్రతి ఓవర్‌కు 20 శాతం చొప్పున మ్యాచ్‌ ఫీజులో జరిమానా పడుతుంది. బంగ్లాదేశ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ఒక వికెట్‌ తేడాతో ఓడిన భారత్‌.. బుధవారం రెండో వన్డేలో అమీతుమీ తేల్చుకోనుంది.


హాకీ ప్రపంచకప్‌ ట్రోఫీ యాత్ర షురూ

భువనేశ్వర్‌: వచ్చే ఏడాది భారత్‌ ఆతిథ్యమివ్వనున్న పురుషుల హాకీ ప్రపంచకప్‌ సందడి మొదలైంది. ఈ ప్రపంచకప్‌ ట్రోఫీ యాత్ర సోమవారం ఆరంభమైంది. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ట్రోఫీని హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్‌ టిర్కీకి అందజేసి ఈ యాత్రను ప్రారంభించారు. ‘‘ఈ ట్రోఫీ యాత్ర హాకీ ప్రపంచకప్‌పై దేశవ్యాప్తంగా ఆసక్తిని పెంచుతుందని ఆశిస్తున్నా. 16 జట్లకు ఆతిథ్యమివ్వబోతున్నాం. భువనేశ్వర్‌, రూర్కెలాలో మ్యాచ్‌లు జరుగుతాయి’’ అని సీఎం నవీన్‌ తెలిపారు. జనవరి 13 నుంచి 29 వరకు ఈ ప్రపంచకప్‌ ఒడిషాలో జరుగుతుంది. ఈ ట్రోఫీ యాత్ర 21 రోజుల పాటు 13 రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతాన్ని చుట్టి తిరిగి ఈ నెల 25న ఒడిషాకు చేరుతుంది. ఆ తర్వాత ఆ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈ యాత్ర నిర్వహిస్తారు. చివరగా ఫైనల్‌ జరిగే రోజున, ఆ మ్యాచ్‌ వేదికైన కళింగ స్టేడియానికి ట్రోఫీ చేరుకుంటుంది.


పెద్ద జట్లకు స్పెషలిస్టు ఆటగాళ్లు ఉండాలి: ఫ్లవర్‌

దిల్లీ: టీమ్‌ఇండియా, ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా వంటి పెద్ద జట్లకు భిన్న ఫార్మాట్లకు తగ్గట్లుగా స్పెషలిస్టు ఆటగాళ్లు.. భిన్నమైన కోచ్‌లు ఉంటే అర్థవంతంగా ఉంటుందని జింబాబ్వే దిగ్గజ క్రికెటర్‌ ఆండీ ఫ్లవర్‌ అన్నాడు. టీ20, వన్డే ప్రపంచకప్‌ ఛాంపియన్స్‌ ఇంగ్లాండ్‌ మాత్రమే ఈ విధానాన్ని అనుసరిస్తుంది. ఇంగ్లాండ్‌ టెస్టు, పరిమిత ఓవర్ల జట్లలో స్పెషలిస్టు ఆటగాళ్లు.. ప్రత్యేక కోచ్‌లు ఉన్నారు. ‘‘కొన్ని దేశాలకు ఈ పద్ధతి అవసరం లేదు. ఎక్కువ క్రికెట్‌ ఆడుతున్న కొన్ని జట్లకు స్పెషలిస్టు ఆటగాళ్ల విధానం అర్థవంతంగా ఉంటుంది. జీవన శైలి, ఆరోగ్య కోణాల నుంచి చూస్తే ప్రత్యేక కోచ్‌లను నియమించడం కూడా సరైనదే. ఎక్కువ కాలం బయట ఉండటం కుటుంబాలు, బాంధవ్యాలకు మంచిది కాదు’’ అని ఫ్లవర్‌ పేర్కొన్నాడు.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు