సంక్షిప్త వార్తలు (4)

అంధుల టీ20 ప్రపంచకప్‌లో ఆతిథ్య భారత్‌ ఘనంగా బోణీ కొట్టింది. మంగళవారం ఆ జట్టు 274 పరుగుల తేడాతో నేపాల్‌ను చిత్తు చేసింది.

Published : 07 Dec 2022 01:51 IST

భారత అంధుల జట్టు ఘనవిజయం

దిల్లీ: అంధుల టీ20 ప్రపంచకప్‌లో ఆతిథ్య భారత్‌ ఘనంగా బోణీ కొట్టింది. మంగళవారం ఆ జట్టు 274 పరుగుల తేడాతో నేపాల్‌ను చిత్తు చేసింది. ఈ అంధుల ప్రపంచకప్‌ (డిసెంబరు 5-17)లో భారత్‌, నేపాల్‌తో పాటు ఆస్ట్రేలియా, శ్రీలంక, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌ పోటీపడుతున్నాయి. టోర్నీలో పోటీపడడానికి పాక్‌ జట్టుకు వీసాలు మంజూరు చేసేందుకు భారత హోం మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది. తమ జట్టుకు వీసాలు ఇవ్వడానికి భారత్‌ తిరస్కరించిందని అంతకుముందు పాకిస్థాన్‌ అంధుల క్రికెట్‌ కౌన్సిల్‌ చెప్పింది.


మనీషాకు బీడబ్ల్యూఎఫ్‌ అవార్డు

దిల్లీ: భారత యువ షట్లర్‌ మనీషా రామదాస్‌ బీడబ్ల్యూఎఫ్‌ అవార్డు దక్కించుకుంది. ఈ సీజన్‌లో అద్భుత ప్రదర్శనకు గాను బీడబ్ల్యూఎఫ్‌ మహిళా పారా బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌- 2022 అవార్డును గెలుచుకుంది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఎస్‌యూ5 విభాగంలో 17 ఏళ్ల మనీషా స్వర్ణంతో మెరిసింది. ఈ ఏడాది మనీషా 11 స్వర్ణాలు, 5 కాంస్య పతకాలతో సత్తాచాటింది.


క్యూబా మహిళా బాక్సర్లకు మోక్షం

హవానా: బాక్సింగ్‌ పేరెత్తగానే గుర్తొచ్చే దేశం క్యూబా. ఒలింపిక్స్‌ సహా ప్రపంచ స్థాయి ఈవెంట్లలో ఆ దేశ పురుష బాక్సర్ల ఆధిపత్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ దేశంలో ప్రతిభావంతులైన మహిళా బాక్సర్లకూ లోటు లేదు. కానీ మహిళల బాక్సింగ్‌ మీద దశాబ్దాల నుంచి ఆంక్షలు ఉన్నాయి. ఎట్టకేలకు వాటికి చరమగీతం పాడేసింది అక్కడి ప్రభుత్వం. తమ దేశ మహిళలు సైతం బాక్సింగ్‌ ఈవెంట్లలో పాల్గొనేందుకు క్యూబా ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. దీంతో ఆ దేశ మహిళా బాక్సర్ల ఆనందానికి అవధుల్లేవు.


రౌఫ్‌ స్థానంలో అబ్బాస్‌, హసన్‌

 

రాచి: గాయపడిన హారిస్‌ రౌఫ్‌ స్థానంలో పేసర్లు మహ్మద్‌ అబ్బాస్‌, హసన్‌ అలీలకు పాకిస్థాన్‌ టెస్టు జట్టులో చోటు దక్కనుంది. ఇంగ్లాండ్‌తో తర్వాతి రెండు టెస్టుల కోసం అబ్బాస్‌, హసన్‌లను జట్టుకు ఎంపిక చేసే అవకాశముంది. రావల్పిండిలో ఇంగ్లాండ్‌తో తొలి మ్యాచ్‌తో టెస్టుల్లో అరంగేట్రం చేసిన రౌఫ్‌.. ఫ్లాట్‌ వికెట్‌పై 13 ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. అనంతరం ఫీల్డింగ్‌ చేస్తూ గాయపడిన రౌఫ్‌ సిరీస్‌కు దూరమయ్యాడు. దీంతో అబ్బాస్‌, హసన్‌లను జట్టుకు ఎంపిక చేయొచ్చని తెలుస్తోంది. తొలి టెస్టులో ఇంగ్లాడ్‌ 74 పరుగుల ఆధిక్యంతో పాక్‌పై గెలుపొందింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని