బ్రెజిల్‌ జిగేల్‌

అయిదుసార్లు ఛాంపియన్‌. ఈసారీ ఫేవరెట్టే. అంచనాలెన్నో. అందుకు తగ్గట్లే బ్రెజిల్‌ అదరగొడుతోంది. ఆరోసారి ట్రోఫీపై కన్నేసిన ఆ జట్టు ఆ దిశగా మరో అడుగు వేసింది.

Published : 07 Dec 2022 01:57 IST

అలవోకగా క్వార్టర్స్‌లోకి
కొరియాపై 4-1తో ఘనవిజయం
మెరిసిన నెయ్‌మార్‌

అయిదుసార్లు ఛాంపియన్‌. ఈసారీ ఫేవరెట్టే. అంచనాలెన్నో. అందుకు తగ్గట్లే బ్రెజిల్‌ అదరగొడుతోంది. ఆరోసారి ట్రోఫీపై కన్నేసిన ఆ జట్టు ఆ దిశగా మరో అడుగు వేసింది. తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన బ్రెజిల్‌ 4-1తో దక్షిణ కొరియాను మట్టికరిపిస్తూ క్వార్టర్‌ఫైనల్‌కు దూసుకెళ్లింది. గాయం నుంచి కోలుకుని వచ్చిన నెయ్‌మార్‌ గోల్‌తో మెరిశాడు.

పూర్తి ఫిట్‌నెస్‌ సంతరించుకున్న స్టార్‌ నెయ్‌మార్‌ తళుక్కున మెరిసిన వేళ.. బ్రెజిల్‌ ప్రపంచకప్‌ క్వార్టర్‌ఫైనల్లో అడుగుపెట్టింది. ప్రిక్వార్టర్స్‌లో దక్షిణ కొరియాను చిత్తుగా ఓడించింది. బ్రెజిల్‌ తరఫున వినిసియస్‌ (7వ), నెయ్‌మార్‌ (13వ, పెనాల్టీ), రిచర్లిసన్‌ (29వ), పాక్వెటా (36వ) గోల్స్‌ కొట్టారు. కొరియా తరఫున నమోదైన ఏకైక గోల్‌ను ఆఖర్లో పైక్‌ సంగ్‌ హో (76వ) సాధించాడు. గాయంతో గత రెండు మ్యాచ్‌లకు దూరమైన నెయ్‌మార్‌ తిరిగి పూర్వంలా ఆడడం, గోల్‌ కొట్టడం క్వార్టర్స్‌కు ముందు బ్రెజిల్‌ ఆత్మవిశ్వాసాన్ని మరింతగా పెంచే విషయాలే. బ్రెజిల్‌ క్వార్టర్స్‌లో శుక్రవారం క్రొయేషియాను ఢీకొంటుంది.

బ్రెజిల్‌ జోరు..: ఫేవరెట్‌గా బరిలోకి దిగిన బ్రెజిల్‌.. అంచనాలకు తగ్గట్లే దక్షిణ కొరియాపై ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఆ జట్టు ఎటాకింగ్‌ చతుష్ఠయం నెయ్‌మార్‌, రాఫినా, విన్సియస్‌, రిచర్లిసన్‌ కొరియాను ఉక్కిరిబిక్కిరి చేశారు. ఏకంగా నాలుగు గోల్స్‌తో తొలి అర్ధభాగంలోనే బ్రెజిల్‌ తన విజయాన్ని ఖరారు చేసుకుంది. మరోవైపు కొరియా అలసిపోయినట్లు కనిపించింది. మ్యాచ్‌ మొదలైన తర్వాత ఆ జట్టు ప్రతిఘటన ఆరు నిమిషాల్లోనే ముగిసింది. ఏడో నిమిషంలోనే గోల్‌ కొట్టిన వినిసియస్‌ బ్రెజిల్‌ను ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. రాఫినా నుంచి క్రాస్‌ అందుకున్న విన్సియస్‌.. తన పక్కన డిఫెండర్లెవరూ లేకపోవడంతో అలవోకగా గోల్‌ కొట్టేశాడు. బాక్స్‌ ఎడమవైపు నుంచి నెట్‌ కుడివైపు మూలకు బంతిని తన్నాడు. కొద్దిసేపటికే బ్రెజిల్‌ ఆధిక్యం 2-0కు పెరిగింది. కొరియా డిఫెండర్‌.. తమ బాక్స్‌లో బంతిని దూరంగా కొట్టబోయి రిచర్లిసన్‌ పాదాన్ని తన్నడంతో రిఫరీ బ్రెజిల్‌కు పెనాల్టీ ఇచ్చాడు. నెయ్‌మార్‌.. అలవోకగా కొరియా గోల్‌కీపర్‌ కిమ్‌ సంగ్‌ గ్యును బోల్తా కొట్టించాడు. 0-2తో వెనుకబడ్డ కొరియా పుంజుకోవడానికి ప్రయత్నించింది. ఆ క్రమంలో వ్యూహాత్మక తప్పిదాలు చేసి బ్రెజిల్‌కు మరిన్ని అవకాశాలు కల్పించింది. ఆ జట్టు రక్షణశ్రేణి వైఫల్యాలను సొమ్ము చేసుకుంటూ ప్రథమార్ధంలోనే సాంబా జట్టు మరో రెండు గోల్స్‌ కొట్టేసింది. రిచర్లిసన్‌ తన జట్టును 3-0తో ఆధిక్యంలో నిలిపాడు. నిస్సహాయంగా మారిన కొరియాపై ఎటాకింగ్‌ను కొనసాగించిన బ్రెజిల్‌ ఖాతాలో నాలుగో గోల్‌ చేరడానికి కూడా ఎంతో సమయం పట్టలేదు. నెయ్‌మార్‌ నుంచి బంతిని అందుకున్న వినిసియస్‌.. పాక్వెటాకు క్రాస్‌ ఇచ్చాడు. బాక్స్‌ మధ్య నుంచి పాక్వెటా..బంతిని నెట్లోకి తన్నేశాడు. రెండో అర్ధభాగంలో బ్రెజిల్‌ గోల్‌ కొట్టలేకపోయినా.. కొరియా కూడా పెద్దగా పుంజుకున్నది లేదు. ఆ జట్టుకు.. పైక్‌ సంగ్‌ హో గోల్‌  ఊరట మాత్రమే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు