షూటౌట్లో పేలవ ప్రదర్శన.. స్పెయిన్‌ ఔట్‌

సంచలనాలకు కేంద్రంగా మారిన ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో.. నాకౌట్‌ దశ వచ్చినా ఆశ్చర్యకర ఫలితాలు ఆగట్లేదు.

Updated : 07 Dec 2022 06:30 IST

ప్రపంచకప్‌లో మరో సంచలనం
క్వార్టర్‌ఫైనల్లో మొరాకో

సంచలనాలకు కేంద్రంగా మారిన ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో.. నాకౌట్‌ దశ వచ్చినా ఆశ్చర్యకర ఫలితాలు ఆగట్లేదు. స్పెయిన్‌ ముందు పసికూన లాంటి మొరాకో.. మాజీ ఛాంపియన్‌ను మట్టికరిపించి తొలిసారి క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. కేవలం ఆరోసారి మాత్రమే ప్రపంచకప్‌ ఆడుతూ, ఎప్పుడో 36 ఏళ్ల కిందట ఒకసారి నాకౌట్‌ ఆడిన చరిత్ర ఉన్న మొరాకో.. మంగళవారం అంచనాలకు అందని ఆటతో స్పెయిన్‌కు కళ్లెం వేసింది. 120 నిమిషాల పాటు స్పెయిన్‌ను గోల్‌ చేయనివ్వకుండా అడ్డుకోవడమే కాక.. పెనాల్టీ షూటౌట్లో 3-0తో ఆ జట్టును ఓడించి ఫుట్‌బాల్‌ ప్రపంచాన్ని నివ్వెరపరిచింది.

మ్యాచ్‌లో నాలుగింట మూడో వంతు శాతం బంతి స్పెయిన్‌ చేతిలోనే ఉంది. మొరాకోతో పోలిస్తే మూడు రెట్లకు పైగా పాస్‌లు అందించుకున్నారు ఆ జట్టు ఆటగాళ్లు. కానీ ఏం లాభం? రక్షణాత్మక ఆట ఆడడంతో స్పెయిన్‌కు దిగ్భ్రాంతికర ఓటమి తప్పలేదు. పోరాడితే పోయేదేముందన్నట్లు తెగించి ఆడిన మొరాకో.. ఆ జట్టుకు గుండెకోతను మిగిలుస్తూ క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లింది. మంగళవారం నిర్ణీత 90 నిమిషాల్లో, ఇంజురీ టైంలో, అదనపు సమయంలో ఇరు జట్లూ గోల్‌ చేయలేకపోయిన ఈ మ్యాచ్‌లో పెనాల్టీ షూటౌట్‌ అనివార్యం కాగా.. అందులో అనూహ్యంగా 3-0తో విజయం సాధించింది మొరాకో. ఆ జట్టు ఆటగాళ్లు ఎంతో ఆత్మవిశ్వాసంతో షూటౌట్‌ను ఎదుర్కొంటే.. స్పెయిన్‌ ఆటగాళ్లు భయం భయంగా షాట్లు ఆడి జట్టు కొంప ముంచారు. మొరాకో గోల్‌కీపర్‌ యాసిన్‌ బౌనౌ జీవిత కాల ప్రదర్శనతో ఆ దేశ హీరోగా నిలిచాడు. స్పెయిన్‌ మూడు విఫల ప్రయత్నాల్లో అతనే రెండు అడ్డుకున్నాడు. మొరాకో 1986లో ఒక్కసారే ప్రిక్వార్టర్స్‌ ఆడింది. మళ్లీ నాకౌట్‌ ఆడుతున్నందుకే సంబరంతో ఆ జట్టు.. స్పెయిన్‌ లాంటి మేటి జట్టును ఓడించి తొలిసారి క్వార్టర్స్‌ చేరడంతో వారిది మామూలు ఆనందం కాదు.

స్పెయిన్‌ కొంప మునిగిందిలా..: గ్రూప్‌ దశలో మొరాకో చక్కటి ప్రదర్శన చేసినప్పటికీ.. స్పెయిన్‌ ముందు ఆ జట్టు నిలుస్తుందా అన్న సందేహాలను విశ్లేషకులు వ్యక్తం చేశారు. కానీ మొరాకోతో అంత తేలిక కాదని స్పెయిన్‌కు త్వరగానే అర్థమైంది. బంతి ఎక్కువగా స్పెయిన్‌ నియంత్రణలోనే ఉన్నా.. మొరాకో ఆటగాళ్లు ప్రమాదకరంగా కనిపించారు. ప్రథమార్ధంలో హకిమి, ఆగర్డ్‌ బంతిని నెట్‌లోకి పంపేందుకు రెండు గట్టి ప్రయత్నాలే చేశారు. త్రుటిలో గోల్స్‌ తప్పాయి. స్పెయిన్‌ తరఫున బౌఫల్‌ దాదాపు ఆధిక్యంలో నిలిపేలా కనిపించాడు. కానీ బంతి కొద్ది తేడాలో పక్కకు వెళ్లింది. రెండో అర్ధంలో స్పెయిన్‌ కొంచెం దూకుడు పెంచినా లాభం లేకపోయింది. మొరాకో కూడా అంతే దీటుగా స్పందించింది. ఇంజురీ టైం, అదనపు సమయంలోనూ గోల్స్‌ నమోదు కాకపోవడంతో షూటౌట్‌ అనివార్యం అయింది. అయితే షూటౌట్లలో స్పెయిన్‌కు సరైన రికార్డు లేకపోవడంతో అభిమానుల్లో ఆందోళన తప్పలేదు. ఆ జట్టు ఆటగాళ్లలోనూ అది ప్రతిఫలించింది. సబిరి సునాయాసంగా గోల్‌ కొట్టి మొరాకోను 1-0 ఆధిక్యంలో నిలపగా.. పాబ్లో సరాబియా షాట్‌ గోల్‌ బార్‌ను తాకడంతో స్పెయిన్‌కు ఆరంభంలోనే నిరాశ తప్పలేదు. హకీమ్‌ జియెచ్‌ నెట్‌ మధ్యలోకి షాట్‌ ఆడిన షాట్‌తో మొరాకో 2-0 ఆధిక్యంలోకి వెళ్లగా.. కార్లోస్‌ సోలెర్‌ షాట్‌ను యాసిన్‌ సరిగ్గా అంచనా వేసి ఆపేయడంతో స్పెయిన్‌కు మళ్లీ షాక్‌ తగిలింది. బెనౌన్‌ షాట్‌ను సైమన్‌ ఆపడంతో స్పెయిన్‌ ఆశలు నిలిచాయి. కానీ ఆ జట్టు కెప్టెన్‌ సెర్జియో కొట్టిన షాట్‌ను కుడివైపు దూకుతూ యాసిన్‌ ఆపేయడంతో మొరాకో విజయానికి చేరువ అయింది. తమ జట్టు నాలుగో ప్రయత్నాన్ని విజయవంతం చేస్తూ హకిమి గోల్‌ కొట్టడంతో మొరాకో సంబరాలకు అంతే లేకుండా పోయింది. స్పెయిన్‌ శిబిరం కాసేపటికే కన్నీళ్లతో నిండిపోయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని