భారత్‌కు పరీక్ష

తొలి వన్డేలో ఓటమి పెద్ద షాకే. ఇంకోటి ఓడితే బంగ్లా గడ్డపై వరుసగా రెండో వన్డే సిరీస్‌ చేజారుతుంది.

Updated : 07 Dec 2022 07:49 IST

బంగ్లాదేశ్‌తో రెండో వన్డే నేడు

తొలి వన్డేలో ఓటమి పెద్ద షాకే. ఇంకోటి ఓడితే బంగ్లా గడ్డపై వరుసగా రెండో వన్డే సిరీస్‌ చేజారుతుంది. ఈ నేపథ్యంలో టీమ్‌ఇండియా కీలక సమరానికి సిద్ధమైంది. తప్పక నెగ్గాల్సిన రెండో వన్డేలో బుధవారం ఆతిథ్య బంగ్లాదేశ్‌ను ఢీకొంటుంది. ఒత్తిడి భారత్‌పైనే. ఆటను రోహిత్‌సేన బాగా మెరుగుపర్చుకోవాల్సివుంది. తొలి వన్డేలో గెలిచిన బంగ్లాదేశ్‌ సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే.

పుంజుకుంటారా..?: తొలి వన్డేలో బ్యాటింగ్‌లో తడబడ్డా బంతితో రాణించి గట్టెక్కేలా కనిపించిన టీమ్‌ఇండియా.. గెలుపు ముంగిట బోల్తా కొట్టిన సంగతి తెలిసిందే. ఒక్క వికెట్‌ తీయలేక రోహిత్‌సేన పరాజయం చవిచూసింది. మెహదీ హసన్‌, ముస్తాఫిజుర్‌ చివరి వికెట్‌కు ఏకంగా 51 పరుగులు జోడించి బంగ్లాను గెలిపించారు. ఆ ఒక్క వికెట్‌ తీయలేకపోవడంలో బౌలర్ల వైఫల్యం నిజమే కానీ.. స్టార్లతో నిండిన బ్యాటింగ్‌ లైనప్‌ మరింత బాధ్యత తీసుకోవాల్సివుంది. భారత్‌ చివరిసారి 2015లో బంగ్లాలో ద్వైపాక్షిక సిరీస్‌ ఆడింది. అప్పుడు ధోని నేతృత్వంలోని జట్టు 1-2తో సిరీస్‌ను చేజార్చుకుంది. ఆ ఒక్క విజయాన్ని కూడా నామమాత్ర మ్యాచ్‌లో సాధించింది. స్పిన్నర్లు షకిబ్‌, మెహదీ హసన్‌ మరోసారి 11-40 ఓవర్ల మధ్య భారత బ్యాటర్లకు కళ్లెం వేస్తే చరిత్రను పునరావృతం చేయొచ్చని బంగ్లాదేశ్‌ భావిస్తోంది. తొలి మ్యాచ్‌లో రాహుల్‌ మినహా భారత బ్యాటర్లంతా ఆ ఓవర్ల మధ్యే ఇబ్బందిపడ్డారు. ఈ మ్యాచ్‌లోనైనా రోహిత్‌, కోహ్లి, ధావన్‌ చెలరేగాలని భారత్‌ ఆశిస్తోంది. మొత్తంగా టీమ్‌ఇండియా మరింత దూకుడుగా బ్యాటింగ్‌ చేయడం అవసరం. డాట్‌ బాల్స్‌ ఆడడం తగ్గించాలి. తొలి వన్డేలో 25 ఓవర్ల కంటే ఎక్కువ విలువైన డాట్‌ బాల్స్‌ ఆడారు. మరోవైపు బంగ్లాదేశ్‌ రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. ముస్తాఫిజుర్‌, ఎబాదత్‌, హసన్‌ మహమూద్‌, షకిబ్‌, మెహదీ హసన్‌లతో బంగ్లా బౌలింగ్‌ బలంగా కనిపిస్తున్నా.. బ్యాటింగ్‌లో ఆ జట్టుకూ సమస్యలున్నాయి. తొలి వన్డేలో ఓ దశలో 104 బంతుల పాటు బంగ్లాకు ఒక్క బౌండరీ కూడా రాలేదు.


పిచ్‌...

రెండో వన్డేలో కూడా స్పిన్‌ కీలక పాత్ర పోషించే అవకాశముంది. పేసర్లకు అస్థిర బౌన్స్‌ లభిస్తుంది. టాస్‌ గెలిచిన జట్టు బౌలింగ్‌ ఎంచుకునే  అవకాశముంది.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని