మీరాబాయికి రజతం

టోక్యో ఒలింపిక్స్‌ రజత పతక విజేత, భారత స్టార్‌ వెయిట్‌ లిఫ్టర్‌ మీరాబాయి చాను అదరగొట్టింది. మణికట్టు గాయం బాధిస్తున్నా.. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకంతో సత్తాచాటింది.

Published : 08 Dec 2022 02:59 IST

ప్రపంచ వెయిట్‌ లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌

బొగొటా (కొలంబియా): టోక్యో ఒలింపిక్స్‌ రజత పతక విజేత, భారత స్టార్‌ వెయిట్‌ లిఫ్టర్‌ మీరాబాయి చాను అదరగొట్టింది. మణికట్టు గాయం బాధిస్తున్నా.. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకంతో సత్తాచాటింది. టోక్యో ఒలింపిక్స్‌ ఛాంపియన్‌ హౌ జిహువా (చైనా)ను వెనక్కినెట్టి రెండో స్థానంలో నిలిచింది. మహిళల 49 కేజీల విభాగంలో 200 కిలోల బరువులెత్తిన చాను ద్వితీయ స్థానంతో రజతం సాధించింది. స్నాచ్‌లో 87 కిలోలు, క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 113 కేజీల బరువులెత్తింది. చైనా క్రీడాకారిణులు జియాంగ్‌ హ్యూహువా (93+113= 206 కేజీలు) స్వర్ణం, జిహువా (89+109= 198 కేజీలు) కాంస్య పతకాలు గెలుచుకున్నారు. 2017లో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన చానుకు ఈ ఏడాది సెప్టెంబరులో ప్రాక్టీస్‌ సెషన్‌లో మణికట్టుకు గాయమైంది. అక్టో బరులో జరిగిన జాతీయ క్రీడల్లో గాయంతోనే బరిలో దిగింది. ‘‘అయిదేళ్ల తర్వాత మరో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ పతకాన్ని స్వదేశానికి తీసుకురావడం గర్వించదగ్గ క్షణం. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పోటీ ఎప్పుడూ తీవ్రంగా ఉంటుంది. అత్యున్నత స్థాయిలో అత్యుత్తమ ఒలింపియన్లు బరిలో దిగుతారు. మణికట్టు నొప్పిగా ఉన్నా.. దేశం కోసం ఎల్లప్పుడూ దేనికైనా సిద్ధంగా ఉంటా. పారిస్‌ ఒలింపిక్స్‌, ఆసియా క్రీడల్లో భారత్‌కు స్వర్ణ పతకాలు అందించగలనని అనుకుంటున్నా’’ అని చాను తెలిపింది.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని