పోరాడినా.. పోయింది

69 పరుగులకే 6 వికెట్లు పడగొట్టినందుకు పొగడాలా..? ఆ తర్వాత 271 పరుగులు చేయనిచ్చినందుకు తెగడాలా..? ఘోర పరాభవం తప్పదనుకున్న మ్యాచ్‌లో గొప్పగా పోరాడి, త్రుటిలో ఓడినందుకు కొనియాడాలా?

Updated : 08 Dec 2022 07:45 IST

గాయంతోనూ రోహిత్‌ మెరుపులు
త్రుటిలో ఓడిన భారత్‌
సిరీస్‌ బంగ్లా సొంతం

69 పరుగులకే 6 వికెట్లు పడగొట్టినందుకు పొగడాలా..? ఆ తర్వాత 271 పరుగులు చేయనిచ్చినందుకు తెగడాలా..? ఘోర పరాభవం తప్పదనుకున్న మ్యాచ్‌లో గొప్పగా పోరాడి, త్రుటిలో ఓడినందుకు కొనియాడాలా? లేక చేతిలోకొచ్చిన మ్యాచ్‌ను పోగొట్టుకున్నందుకు తిట్టాలా? రెండు మ్యాచ్‌ల్లోనూ ప్రతికూల పరిస్థితులు ఎదురైనా నిలబడి మ్యాచ్‌లను సొంతం చేసుకున్న బంగ్లాదేశ్‌ను అభినందించాలా? లేక అంచనాలకు తగని ప్రదర్శనతో బంగ్లాకు సిరీస్‌ కోల్పోయిన టీమ్‌ఇండియాను విమర్శించాలా? టీ20 ప్రపంచకప్‌ చేదు జ్ఞాపకాలను చెరిపేస్తూ.. వన్డే ప్రపంచకప్‌ దిశగా రోహిత్‌ సేన సరైన అడుగులు వేస్తుందనుకుంటే.. వరుసగా రెండో వన్డే సిరీస్‌ పరాజయంతో అభిమానులకు తీవ్ర నిరాశకు గురి చేసింది. అందులోనూ ఈసారి బంగ్లా చేతిలో ఓటమి జీర్ణించుకోలేనిదే.

బంగ్లాదేశ్‌ పర్యటనలో టీమ్‌ఇండియాకు మరో పరాజయం. వరుసగా రెండో వన్డేలోనూ ఓటమి పాలైన రోహిత్‌ సేన.. మరో మ్యాచ్‌ మిగిలుండగానే సిరీస్‌ను 0-2తో కోల్పోయింది. తొలి వన్డేలో మాదిరే ఈ మ్యాచ్‌లోనూ గెలిచేందుకు మంచి అవకాశాలు వచ్చినా భారత్‌ వృథా చేసుకుంది. బుధవారం ఆఖరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో భారత్‌ 5 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 272 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌.. 266/9కు పరిమితమైంది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (51 నాటౌట్‌; 28 బంతుల్లో 3×4, 5×6) వేలి గాయంతో ఇబ్బంది పడుతూనే 9వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగి గొప్పగా పోరాడాడు. అతడి కంటే ముందు ఆశల్లేని స్థితిలో శ్రేయస్‌ అయ్యర్‌ (82; 102 బంతుల్లో 6×4, 3×6), అక్షర్‌ పటేల్‌ (56; 56 బంతుల్లో 2×4, 3×6) పోరాట పటిమ చూపించారు. ఎబాదత్‌ హొస్సేన్‌ (3/45), మెహదీ హసన్‌ మిరాజ్‌ (2/46), షకిబ్‌ అల్‌హసన్‌ (2/39) భారత్‌ను దెబ్బ తీశారు. మొదట సుందర్‌ (3/37), సిరాజ్‌ (2/73), ఉమ్రాన్‌ మాలిక్‌ (2/56)ల ధాటికి ఒక దశలో 69/6తో తీవ్ర ఇబ్బందుల్లో పడ్డ బంగ్లా.. తొలి వన్డే ఊపును కొనసాగిస్తూ మిరాజ్‌ (100 నాటౌట్‌; 83 బంతుల్లో 8×4, 4×6) కెరీర్లోనే ఉత్తమం అనదగ్గ ఇన్నింగ్స్‌ ఆడడం, మహ్మదుల్లా (77; 96 బంతుల్లో 7×4) అతడికి చక్కటి సహకారం అందించడంతో అనూహ్యంగా 271/7తో ఇన్నింగ్స్‌ను ముగించింది. మిరాజ్‌, మహ్మదుల్లా ఏడో వికెట్‌కు 148 పరుగులు జోడించారు. తొలి వన్డేలో చివరి వికెట్‌ పడగొట్టలేక మ్యాచ్‌ను ప్రత్యర్థికి అప్పగించిన బౌలర్లు.. ఈ మ్యాచ్‌లోనూ అదే ఒరవడి కొనసాగించారు. 20 ఓవర్ల వరకు అద్భుతంగా బౌలింగ్‌ చేసి.. ఆ తర్వాత పట్టు వదిలేశారు. వరుసగా రెండో వన్డేలోనూ మిరాజే ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు.

చేరువై.. దూరమై: గాయంతో రోహిత్‌ ఓపెనింగ్‌లో దిగలేదు. అతడి స్థానంలో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన కోహ్లి (5) రెండో ఓవర్లోనే వెనుదిరిగాడు. ధావన్‌ (8) పేలవ ఫామ్‌ను కొనసాగించాడు. మూడో స్థానంలో వచ్చిన సుందర్‌ (11), గత మ్యాచ్‌లో జట్టును ఆదుకున్న రాహుల్‌ (14) నిలవలేకపోయారు. 19వ ఓవర్లో రాహుల్‌ ఔటయ్యే సమయానికి స్కోరు 65 పరుగులే. ఈ స్థితిలో భారత్‌ గెలవడం సంగతటుంచితే గౌరవప్రదంగా ఓడుతుందన్న ఆశలు కూడా లేవు. కానీ శ్రేయస్‌ అయ్యర్‌ ఆశలు కోల్పోలేదు. అక్షర్‌ అండతో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఈ జోడీ అయిదో వికెట్‌కు 107 పరుగులు జోడించడంతో భారత్‌ పోటీలోకి వచ్చింది. 91 బంతుల్లో 100 పరుగులతో సమీకరణం అందుబాటులోనే కనిపించింది. కానీ ఈ దశలో భారీ షాట్లు ఆడబోయి శ్రేయస్‌, అక్షర్‌ ఒకరి తర్వాత ఒకరు వెనుదిరగడం.. శార్దూల్‌ (7), దీపక్‌ చాహర్‌ (11) కూడా ఎక్కువసేపు నిలవకపోవడంతో భారత్‌కు దారులు మూసుకుపోయినట్లే కనిపించింది. కానీ 9వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రోహిత్‌ అద్భుత పోరాటంతో జట్టును తిరిగి పోటీలోకి తెచ్చాడు. బొటన వేలిని జాగ్రత్తగా కాపాడుకుంటేనే రోహిత్‌ సాహసోపేత షాట్లు ఆడాడు. ఎబాదత్‌ వేసిన 46వ ఓవర్లో రోహిత్‌ రెండు సిక్సర్లు, ఒక ఫోర్‌ కొట్టడంతో సమీకరణం 24 బంతుల్లో 41గా మారింది. కానీ తర్వాతి రెండు ఓవర్లలో కేవలం ఒక్క పరుగే వచ్చింది. మహ్మదుల్లా ఓవర్లో 4 బంతులాడి ఒక్క పరుగే తీసిన సిరాజ్‌.. ముస్తాఫిజుర్‌ వేసిన 47వ ఓవర్లో ఒక్క పరుగూ తీయలేకపోయాడు. 2 ఓవర్లలో 40 పరుగులు చేయాల్సి రాగా.. రోహిత్‌ మహ్మదుల్లా ఓవర్లో రెండు సిక్సర్లు బాది ఆశలు రేకెత్తించాడు. చివరి ఓవర్లో 20 పరుగులు అవసరం కాగా.. ముస్తాఫిజుర్‌ చాలా కట్టుదిట్టంగా బంతులేసినప్పటికీ 2, 3, 5 బంతులకు రోహిత్‌ వరుసగా 4, 4, 6 బాదాడు. చివరి బంతికి సిక్సర్‌ అవసరం కాగా.. రోహిత్‌ షాట్‌ ఆడలేకపోవడంతో భారత్‌కు నిరాశ తప్పలేదు.

* బంగ్లాదేశ్‌లో భారత్‌కిది వరుసగా రెండో సిరీస్‌ ఓటమి. చివరగా 2015లో ఆ దేశంలో ఆడిన వన్డే సిరీస్‌లో భారత్‌ 1-2తో ఓటమి పాలైంది. భారత్‌పై ఆ జట్టుకు అదే తొలి వన్డే సిరీస్‌ విజయం. ఇప్పుడు వరుసగా రెండో సిరీస్‌లోనూ బంగ్లా నెగ్గింది. అప్పుడు కూడా తొలి రెండు వన్డేల్లో భారత్‌ను ఆ జట్టు ఓడించింది.


శబాష్‌ రోహిత్‌

ఈ మ్యాచ్‌లో భారత్‌ ఓడిపోయి ఉండొచ్చు కానీ.. కెప్టెన్‌ రోహిత్‌ పోరాటం మాత్రం ఎప్పటికీ నిలిచిపోయేదే. మొదట రోహిత్‌ ఫీల్డింగ్‌ చేస్తుండగా.. అనాముల్‌ హక్‌ క్యాచ్‌ అందుకోబోయి గాయపడ్డాడు. ఎడమ చేతి బొటన వేలుకు గట్టి దెబ్బ తాకి రక్తం కారుతుండగా.. అతను మైదానాన్ని వీడాడు. ఆ తర్వాత వైస్‌ కెప్టెన్‌ రాహులే సారథ్య బాధ్యతలు నిర్వర్తించాడు. బంగ్లా ఇన్నింగ్స్‌లో మళ్లీ రోహిత్‌ మైదానంలోకే రాలేదు. అనంతరం ధావన్‌తో కలిసి కోహ్లి ఓపెనింగ్‌లో దిగడంతో రోహిత్‌ ఇక బ్యాటింగ్‌కు రాడని అందరూ ఒక నిర్ణయానికి వచ్చేశారు. అయితే భారత్‌ 7 వికెట్లు కోల్పోయాక రోహిత్‌ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ క్రీజులో అడుగు పెట్టాడు. గాయపడ్డ వేలికి బ్యాండేజీలు వేసుకుని అతను బ్యాటింగ్‌కు వచ్చాడు. ఆ వేలితో ఏం ఆడతాడులే అనుకుంటే.. భారత్‌ను అద్భుత పోరాటంతో తిరిగి పోటీలోకి తెచ్చాడు. భారత్‌ను గట్టెక్కించడానికి గట్టి ప్రయత్నమే చేసినా లాభం లేకపోయింది.


2 ఓవర్లలో 1

4 ఓవర్లలో 43.. రోహిత్‌ ఉన్న ఊపు   చూస్తే సమీకరణం మరీ కష్టమేమీ కాదు. సిరాజ్‌ కాస్త సహకరించి ఉంటే కెప్టెన్‌ గెలిపించేవాడే. కానీ మహ్మదుల్లా వేసిన 47వ ఓవర్లో నాలుగు బంతులాడి సిరాజ్‌ ఒక్క పరుగే తీశాడు. మిగతా రెండు బంతులకు రోహిత్‌ కూడా పరుగు తీయలేకపోయాడు. ముస్తాఫిజుర్‌ వేసిన 48 ఓవర్లో అయితే సిరాజ్‌ ఒక్క పరుగూ తీయకుండా మెయిడెన్‌ ఆడేశాడు. అతను కనీసం బంతికి బ్యాట్‌ తాకించలేకపోయాడు. అతను కనీసం బై తీసి రోహిత్‌కు  స్ట్రైక్‌ ఇచ్చి ఉన్నా ఫలితం మరోలా ఉండేదే. సిరాజ్‌ 12 బంతులాడి 2 పరుగులే చేశాడు.


చివరి వన్డే, టెస్టు సిరీస్‌కు రోహిత్‌ దూరం

బంగ్లాదేశ్‌తో రెండో వన్డేలో గాయపడ్డ రోహిత్‌ శర్మ.. చివరి వన్డేతో పాటు ఆ తర్వాత జరిగే రెండు టెస్టుల సిరీస్‌కు దూరం అయ్యాడు. అతడి వేలు స్థానభ్రంశం చెందినట్లు స్కానింగ్‌లో తేలింది. తొడకండరాల గాయాల కారణంగా దీపక్‌, కుల్‌దీప్‌ సేన్‌ చివరి వన్డేకు దూరమయ్యారు.


బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌: అనాముల్‌ ఎల్బీ (బి) సిరాజ్‌ 11; లిటన్‌ (బి) సిరాజ్‌ 7; నజ్ముల్‌ శాంటో (బి) ఉమ్రాన్‌ 21; షకిబ్‌ (సి) ధావన్‌ (బి) సుందర్‌ 8; ముష్ఫికర్‌ (సి) ధావన్‌ (బి) సుందర్‌ 12; మహ్మదుల్లా (సి) రాహుల్‌ (బి) ఉమ్రాన్‌ 77; అఫిఫ్‌ (బి) సుందర్‌ 0; మిరాజ్‌ నాటౌట్‌ 100; నసుమ్‌ నాటౌట్‌ 18; ఎక్స్‌ట్రాలు 17 మొత్తం: (50 ఓవర్లలో 7 వికెట్లకు) 271; వికెట్ల పతనం: 1-11, 2-39, 3-52, 4-66, 5-69, 6-69, 7-217; బౌలింగ్‌: దీపక్‌ 3-0-12-0; సిరాజ్‌ 10-0-73-2; శార్దూల్‌ 10-1-47-0; ఉమ్రాన్‌ 10-2-58-2; సుందర్‌ 10-0-37-3; అక్షర్‌ 7-0-40-0

భారత్‌ ఇన్నింగ్స్‌: కోహ్లి (బి) ఎబాదత్‌ 5; ధావన్‌ (సి) మిరాజ్‌ (బి) ముస్తాఫిజుర్‌ 8; శ్రేయస్‌ (సి) అఫిఫ్‌ (బి) మిరాజ్‌ 82; సుందర్‌ (సి) లిటన్‌ (బి) షకిబ్‌ 11; రాహుల్‌ ఎల్బీ (బి) మిరాజ్‌ 14; అక్షర్‌ (సి) షకిబ్‌ (బి) ఎబాదత్‌ 56; శార్దూల్‌ (స్టంప్డ్‌) ముష్ఫికర్‌ (బి) షకిబ్‌ 7; దీపక్‌ (సి) నజ్ముల్‌ (బి) ఎబాదత్‌ 11; రోహిత్‌ నాటౌట్‌ 51; సిరాజ్‌ (బి) మహ్మదుల్లా 2; ఉమ్రాన్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 19 మొత్తం: (50 ఓవర్లలో  9 వికెట్లకు) 266; వికెట్ల పతనం: 1-7, 2-13, 3-39, 4-65,  5-172, 6-189, 7-207, 8-213, 9-252; బౌలింగ్‌: మెహదీ హసన్‌ 6.1-0-46-2; ఎబాదత్‌ 10-0-45-3; ముస్తాఫిజుర్‌ 10-1-43-1; నసుమ్‌ 10-0-54-0; షకిబ్‌ 10-1-39-2; మహ్మదుల్లా 3.5-0-33-1

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని