సంక్షిప్త వార్తలు (5)

బంగ్లాదేశ్‌-ఎతో రెండో అనధికార టెస్ట్‌పై భారత్‌-ఎ పట్టుబిగించింది. ఓవర్‌నైట్‌ స్కోరు 324/5తో మూడో రోజు, గురువారం తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన భారత్‌.. టెయిలెండర్లు రాణించడంతో 562/9 వద్ద డిక్లేర్‌ చేసింది.

Updated : 09 Dec 2022 04:55 IST

పట్టుబిగించిన భారత్‌-ఎ

సిలెట్‌: బంగ్లాదేశ్‌-ఎతో రెండో అనధికార టెస్ట్‌పై భారత్‌-ఎ పట్టుబిగించింది. ఓవర్‌నైట్‌ స్కోరు 324/5తో మూడో రోజు, గురువారం తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన భారత్‌.. టెయిలెండర్లు రాణించడంతో 562/9 వద్ద డిక్లేర్‌ చేసింది. సెంచరీ హీరో అభిమన్యు  ఈశ్వరన్‌ (157) తన ఓవర్‌నైట్‌ స్కోరుకు 13 పరుగులు మాత్రమే జోడించి ఔటయ్యాడు. కానీ మరో ఓవర్‌నైట్‌ బ్యాటర్‌ జయంత్‌ యాదవ్‌ (80) సత్తా చాటాడు.సౌరభ్‌ కుమార్‌ (50)తో ఏడో వికెట్‌కు 86, ఉమేశ్‌ యాదవ్‌ (18)తో ఎనిమిదో వికెట్‌కు 36, నవ్‌దీప్‌ సైని (50 నాటౌట్‌)తో తొమ్మిదో వికెట్‌కు 119 పరుగులు జోడించి జయంత్‌ ఔటయ్యాడు. భారత్‌కు 310 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్‌ బరిలోకి దిగిన బంగ్లా... ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 49 పరుగులు సాధించింది. ఇంకా 261 పరుగులు వెనుకబడి ఉన్న బంగ్లాకు ఓటమిని తప్పించుకోవడం చాలా కష్టమైన పనే. బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 252 పరుగులు చేసింది.


బంగ్లా టెస్టు జట్టులో హసన్‌

చట్‌గావ్‌: భారత్‌తో మొదటి టెస్టుకు బంగ్లాదేశ్‌ జట్టులో టాప్‌ ఆర్డర్‌ బ్యాటర్‌ జకీర్‌ హసన్‌కు చోటు దక్కింది. పూర్తి ఫిట్‌నెస్‌ సాధించని తమిమ్‌ స్థానంలో హసన్‌కు అవకాశం లభించింది. ఇండియా-ఎతో జరిగిన తొలి అనధికార టెస్టులో హసన్‌.. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు గెలుచుకున్నాడు. ఈనెల 14న తొలి టెస్టు ప్రారంభమవుతుంది.
తొలి టెస్టుకు బంగ్లా జట్టు: మహ్మదుల్‌ హసన్‌ జాయ్‌, నజ్ముల్‌ హసన్‌, మొమినుల్‌ హక్‌, యాసిర్‌ అలీ, ముష్ఫికర్‌ రహీం, షకీబల్‌ హసన్‌ (కెప్టెన్‌), లిటన్‌ దాస్‌, నురుల్‌ హసన్‌, మొహదీ హసన్‌ మిరాజ్‌, తైజుల్‌ ఇస్లాం, తస్కిన్‌ అహ్మద్‌, ఖలీద్‌ అహ్మద్‌, ఇబాదత్‌ హొస్సేన్‌, షొరిఫుల్‌ ఇస్లాం, జకీర్‌ హసన్‌, రహమాన్‌ రాజా, అనాముల్‌ హక్‌


పాక్‌ - ఇంగ్లాండ్‌ రెండో టెస్టు నేటి నుంచే

ఉ. 10.30 నుంచి

ముల్తాన్‌: సంచలన ఆటతీరుతో తొలి టెస్టులో విజయం సాధించిన ఉత్సాహంలో ఇంగ్లాండ్‌ శుక్రవారం ఆరంభమయ్యే రెండో టెస్టులో పాకిస్థాన్‌ను ఢీకొనబోతోంది. ఈ మ్యాచ్‌ కోసం ఇంగ్లాండ్‌.. జట్టులో ఒకే ఒక మార్పు చేసింది. గాయపడ్డ ఆల్‌రౌండర్‌ లివింగ్‌స్టోన్‌ స్థానంలో ఫాస్ట్‌బౌలర్‌ మార్క్‌వుడ్‌ను తీసుకుంది. ధాటిగా బ్యాటింగ్‌ చేస్తున్న ఇంగ్లాండ్‌ బ్యాటర్లను పాక్‌ ఎలా నిలువరిస్తుందన్నది ఆసక్తికరం. తొలి టెస్టులో ఇంగ్లాండ్‌ పరిమిత ఓవర్ల క్రికెట్లోలా ఆడి పరుగుల వరద పారించిన సంగతి తెలిసిందే.


ప్లేఆఫ్స్‌లో దబంగ్‌ దిల్లీ

హైదరాబాద్‌: దబంగ్‌ దిల్లీ జట్టు ప్రొ కబడ్డీ లీగ్‌ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. దిల్లీ గురువారం బెంగాల్‌ వారియర్స్‌తో మ్యాచ్‌ను 46-46తో డ్రాగా ముగించింది. విరామానికి 19-25తో వెనుకబడ్డ దిల్లీ.. ఆ తర్వాత పుంజుకుంది.  ఆ జట్టు తరఫున నవీన్‌ కుమార్‌ (16 పాయింట్లు), బెంగాల్‌ తరఫున మణిందర్‌ సింగ్‌ (18 పాయింట్లు) సత్తా చాటారు. మరోవైపు ఈ సీజన్‌లో తన ఆఖరి మ్యాచ్‌లోనూ తెలుగు టైటాన్స్‌ ఓడిపోయింది. ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో టైటాన్స్‌ 33-50తో హరియాణా స్టీలర్స్‌ చేతిలో పరాజయంపాలైంది.


సీఏ.. వార్నర్‌ను బలిపశువును చేసింది: క్లార్క్‌

మెల్‌బోర్న్‌: బాల్‌ ట్యాంపరింగ్‌ కుంభకోణంలో క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ మైకెల్‌ క్లార్క్‌ ఆరోపించాడు. ఈ వ్యవహారంలో వార్నర్‌కు మద్దతు పలికిన క్లార్క్‌.. సీఏ సమీక్ష తీరు అస్థిరంగా ఉందని, వార్నర్‌ను బలిపశువుగా మార్చిందని ధ్వజమెత్తాడు. ‘‘వార్నర్‌ నిరాశ, నిస్పృహలకు గురయ్యాడని చెప్పగలం. వెస్టిండీస్‌తో రెండో టెస్టుకు స్టీవ్‌ స్మిత్‌ సారథ్యం వహిస్తుండటం అతడిని ఇంకాస్త బాధకు గురిచేస్తుంది. వార్నర్‌ నిరుత్సాహాన్ని అర్థం చేసుకోగలను. దురదృష్టవశాత్తు కెప్టెన్సీ అవకాశాన్ని వార్నర్‌ కోల్పోయాడు. కెప్టెన్సీ సమీక్షలో సీఏ అస్థిరత్వం కనిపిస్తోంది. నాయకత్వ పాత్ర ఒకరికి సరైనదని.. మరొకరికి సరిపోదని అనడం నమ్మడానికి కష్టంగా ఉంది. దక్షిణాఫ్రికాలో జరిగిన బాల్‌ ట్యాంపరింగ్‌లో భాగమైన ప్రతి ఒక్కరు సారథ్యానికి పనికిరారని సీఏ నిర్ణయిస్తే న్యాయంగా ఉంటుంది’’ అని క్లార్క్‌ తెలిపాడు.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని