హైదరాబాద్‌, విశాఖలో వన్డేలు

భారత క్రికెట్‌ అభిమానులకు పండగే. ఇంకొన్ని నెలలు విరామమే లేదు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌ ఆడుతున్న టీమ్‌ఇండియా.. ఆ తర్వాత టెస్టు సిరీస్‌లో తలపడనుంది.

Published : 09 Dec 2022 02:45 IST

శ్రీలంక, కివీస్‌, ఆసీస్‌లతో సిరీస్‌ల షెడ్యూల్‌ విడుదల

భారత క్రికెట్‌ అభిమానులకు పండగే. ఇంకొన్ని నెలలు విరామమే లేదు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌ ఆడుతున్న టీమ్‌ఇండియా.. ఆ తర్వాత టెస్టు సిరీస్‌లో తలపడనుంది. జనవరి నుంచి మార్చి వరకు శ్రీలంక, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా జట్ల పర్యటనలతో దేశంలో సందడి నెలకొననుంది. మొత్తం 4 టెస్టులు, 9 వన్డేలు, 6 టీ20 మ్యాచ్‌లు అలరించనున్నాయి. ఈ సిరీస్‌ల షెడ్యూల్‌ను గురువారం బీసీసీఐ ప్రకటించింది. కివీస్‌తో వన్డే సిరీస్‌లో భాగంగా ఓ మ్యాచ్‌కు హైదరాబాద్‌.. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో భాగంగా ఓ మ్యాచ్‌కు విశాఖపట్నం ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ద్వైపాక్షిక సిరీస్‌లు ముగిశాక ఐపీఎల్‌ సందడి మొదలవుతుంది.


సిరీస్‌లు ఇలా..

* జనవరిలో శ్రీలంకతో మూడేసి మ్యాచ్‌ల టీ20, వన్డే సిరీస్‌లతో టీమ్‌ఇండియా 2022-23 అంతర్జాతీయ స్వదేశీ సీజన్‌ ప్రారంభంకానుంది. జనవరి 3న ముంబయి, 5న పుణె, 7న రాజ్‌కోట్‌లో టీ20లు.. 10న గువాహటి, 12న కోల్‌కతా, 15న త్రివేండ్రంలో వన్డేలు జరుగుతాయి.

* కివీస్‌తో వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్‌కు హైదరాబాద్‌ ఆతిథ్యం ఇవ్వనుంది. జనవరి 18న హైదరాబాద్‌, 21న రాయ్‌పుర్‌, 24న ఇండోర్‌లో వన్డేలు నిర్వహిస్తారు. కివీస్‌తో రెండో వన్డే రాయ్‌పుర్‌ వేదికలో తొలి అంతర్జాతీయ మ్యాచ్‌ కానుంది. 27న రాంచి, 29న లఖ్‌నవూ, ఫిబ్రవరి 1న అహ్మదాబాద్‌లో వరుసగా మూడు టీ20 మ్యాచ్‌లు జరుగుతాయి.

* ఆస్ట్రేలియాతో బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ 4 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ ఫిబ్రవరి 9న ప్రారంభమవుతుంది. నాగ్‌పుర్‌ (ఫిబ్రవరి 9-13), దిల్లీ (ఫిబ్రవరి 17-21), ధర్మశాల (మార్చి 1-5), అహ్మదాబాద్‌ (మార్చి 9-13) టెస్టు మ్యాచ్‌లకు వేదికలుగా నిలువనున్నాయి. టెస్టుల అనంతరం మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో టీమ్‌ఇండియా, ఆసీస్‌ తలపడతాయి. మార్చి 17న ముంబయి, 19న విశాఖపట్నం, 22న చెన్నైలో వన్డే మ్యాచ్‌లు జరుగుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని