దక్షిణ అమెరికా X ఐరోపా

గ్రూప్‌ దశలో సంచలనాలను చూశాం. ప్రిక్వార్టర్స్‌లో హోరాహోరీ సమరాలను చూశాం. ఇప్పుడిక ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో మరో స్థాయి పోరాటాలకు రంగం సిద్ధమైంది. కప్పు వేటలో ఇక మిగిలింది ఎనిమిది జట్లే.

Updated : 09 Dec 2022 04:44 IST

గ్రూప్‌ దశలో సంచలనాలను చూశాం. ప్రిక్వార్టర్స్‌లో హోరాహోరీ సమరాలను చూశాం. ఇప్పుడిక ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో మరో స్థాయి పోరాటాలకు రంగం సిద్ధమైంది. కప్పు వేటలో ఇక మిగిలింది ఎనిమిది జట్లే. వాటి మధ్య క్వార్టర్స్‌ పోరు నేటి నుంచే. క్వార్టర్స్‌లో దక్షిణ అమెరికా దిగ్గజాలైన బ్రెజిల్‌, అర్జెంటీనా.. ఐరోపా జట్లు క్రొయేషియా, నెదర్లాండ్స్‌లతో అమీతుమీ తేల్చుకోబోతున్నాయి. ఏ జట్టూ దేనికీ తీసిపోయేది కాదు కాబట్టి హోరాహోరీ పోరాటాలు ఖాయం. అర్జెంటీనా దిగ్గజం మెస్సి, బ్రెజిల్‌ స్టార్‌ నెయ్‌మార్‌ తమ ఆటతో ఎలాంటి మాయ చేస్తారో, తమ జట్లను ఎలా ముందుకు తీసుకెళ్తారో చూడాలి.

ఫిఫా ప్రపంచకప్‌లో క్వార్టర్స్‌ సమరాలకు వేళైంది. శుక్రవారం తొలి మ్యాచ్‌లో అయిదుసార్లు ఛాంపియన్‌ బ్రెజిల్‌.. 2018 రన్నరప్‌ క్రొయేషియాను ఢీకొనబోతోంది. తర్వాతి మ్యాచ్‌లో రెండుసార్లు విజేత అర్జెంటీనా.. మూడుసార్లు రన్నరప్‌ నెదర్లాండ్స్‌తో తలపడబోతోంది. ప్రపంచకప్‌ రికార్డు ప్రకారం చూస్తే బ్రెజిల్‌ ముందు క్రొయేషియా నిలవజాలదు. కానీ గత ప్రపంచకప్‌లో క్రొయేషియా అద్భుత ప్రదర్శన, ఈ టోర్నీలో ఆట చూశాక సాంబా జట్టు అంత తేలిగ్గా తీసుకునే అవకాశం లేదు. ప్రిక్వార్టర్స్‌లో జపాన్‌ అదిరే ఆటతో సవాలు విసిరినా.. షూటౌట్‌లో ఆ జట్టుకు చెక్‌ పెట్టి ముందంజ వేసింది క్రొయేషియా. ఇక హాట్‌ ఫేవరెట్‌ ముద్రతో టోర్నీలో అడుగు పెట్టిన బ్రెజిల్‌ అంచనాలకు తగ్గట్లే ఆడుతోంది. ద్వితీయ శ్రేణి జట్టుతో ఆడిన చివరి గ్రూప్‌ మ్యాచ్‌లో కామెరూన్‌ చేతిలో ఓటమిని మినహాయిస్తే ఆ జట్టు అదరగొట్టింది. ప్రిక్వార్టర్స్‌లో దక్షిణ కొరియాపై చెలరేగి ఆడి 4-1తో విజయం సాధించింది. టోర్నీ తొలి మ్యాచ్‌లో గాయపడ్డాక కోలుకుని గత మ్యాచ్‌లో పునరాగమనం చేసిన స్టార్‌ ఆటగాడు నెయ్‌మార్‌ గోల్‌ కొట్టడమే కాక మొత్తంగా చక్కటి ప్రదర్శన చేశాడు. వినిసియస్‌, రిచర్లిసన్‌ కూడా ఫామ్‌లో ఉన్నారు. మరోవైపు క్రొయేషియా సమష్టితత్వాన్నే నమ్ముకుని బరిలోకి దిగుతోంది. మోద్రిచ్‌, పెరిసిచ్‌, క్రమారిక్‌ లాంటి స్టార్లు ఆ జట్టుకు కీలకం. మరో క్వార్టర్స్‌ మ్యాచ్‌లో తలపడనున్న అర్జెంటీనా, నెదర్లాండ్స్‌ సమవుజ్జీలే కావడంతో హోరాహోరీ తప్పకపోవచ్చు. మెస్సికి ఇదే చివరి ప్రపంచకప్‌ కావచ్చు కాబట్టి ఈసారైనా అతడి కప్పు కల నెరవేర్చాలని జట్టు కోరుకుంటోంది. తొలి మ్యాచ్‌లో సౌదీ అరేబియా చేతిలో షాక్‌ తిన్నాక.. గొప్పగా పుంజుకుని వరుసగా విజయాలు సాధిస్తూ క్వార్టర్స్‌లో అడుగు పెట్టింది అర్జెంటీనా. మెస్సితో పాటు అల్వారెజ్‌, మార్టినెస్‌ కూడా ఫామ్‌లో ఉండడం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. ప్రిక్వార్టర్స్‌లో అదిరిపోయే గోల్‌తో ఉర్రూతలూగించిన మెస్సి.. ఈ మ్యాచ్‌లోనూ అదే ప్రదర్శనను పునరావృతం చేస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. నెదర్లాండ్స్‌కు ప్రస్తుత టోర్నీలో ఇప్పటిదాకా ఓటమే లేదు. అయితే గ్రూప్‌ దశలో ఆ జట్టు ప్రదర్శన మరీ గొప్పగా ఏమీ లేదు. ప్రిక్వార్టర్స్‌లో అమెరికా నుంచి గట్టి పోటీ ఎదురైనా.. ఘనవిజయం సాధించడం డచ్‌ జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచేదే. నెదర్లాండ్స్‌ డంఫ్రీస్‌, డీపే, గాక్పో లాంటి స్టార్లపై ఆశలు పెట్టుకుంది.


* క్వార్టర్స్‌లో ఐరోపా నుంచి అయిదు జట్లు (ఫ్రాన్స్‌, ఇంగ్లాండ్‌, నెదర్లాండ్స్‌, పోర్చుగల్‌, క్రొయేషియా).. రెండు దక్షిణ అమెరికా జట్లు (బ్రెజిల్‌, అర్జెంటీనా).. ఒక ఆఫ్రికా దేశం (మొరాకో)
తలపడుతున్నాయి.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు