ఈ ఒక్కటైనా..

టీ20 ప్రపంచకప్‌ వైఫల్యం తర్వాత ప్రధాన ఆటగాళ్లు తిరిగి లయ అందుకోవడానికి బంగ్లాదేశ్‌ పర్యటన వేదిక అవుతుందనుకుంటే.. టీమ్‌ఇండియా వరుసగా రెండు వన్డేల్లో పరాజయం పాలై సిరీస్‌ను కోల్పోవడం అభిమానులకు పెద్ద షాకే.

Updated : 10 Dec 2022 06:55 IST

పరువు కోసం భారత్‌ పోరాటం
బంగ్లాతో చివరి వన్డే నేడు

టీ20 ప్రపంచకప్‌ వైఫల్యం తర్వాత ప్రధాన ఆటగాళ్లు తిరిగి లయ అందుకోవడానికి బంగ్లాదేశ్‌ పర్యటన వేదిక అవుతుందనుకుంటే.. టీమ్‌ఇండియా వరుసగా రెండు వన్డేల్లో పరాజయం పాలై సిరీస్‌ను కోల్పోవడం అభిమానులకు పెద్ద షాకే. ఇప్పుడిక నామమాత్రమైన చివరి వన్డేలో బంగ్లాను ఢీకొనబోతోంది భారత్‌. కనీసం ఈ మ్యాచ్‌లో అయినా నెగ్గి పరువు దక్కించుకోవాలని టీమ్‌ఇండియా చూస్తుంటే.. సిరీస్‌ నెగ్గిన ఊపులో క్లీన్‌స్వీప్‌ చేసేయాలని బంగ్లా కోరుకుంటోంది.

రోహిత్‌ స్థానంలో ఇషాన్‌: రెండో వన్డేలో వేలి గాయంతోనూ వీరోచితంగా పోరాడిన కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. ఈ మ్యాచ్‌తో పాటు టెస్టు సిరీస్‌కు కూడా దూరమైన సంగతి తెలిసిందే. అతడి స్థానంలో ప్రత్యామ్నాయ ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ తుది జట్టులోకి రానున్నాడు. వైస్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ సారథ్య బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. రెండు మ్యాచ్‌ల్లోనూ టాప్‌ఆర్డర్‌ వైఫల్యమే జట్టు ఓటమి ప్రధాన కారణం. మరి ఈ మ్యాచ్‌లో అయినా ధావన్‌, కోహ్లి రాణిస్తారా.. వైఫల్యాన్ని కొనసాగిస్తారా అన్నది చూడాలి. అవకాశాన్ని ఇషాన్‌ ఎంతమేర ఉపయోగించుకుంటాడన్నది ఆసక్తికరం. శ్రేయస్‌ అయ్యర్‌ ఒక్కడు మంచి లయతో కనిపిస్తున్నాడు. మిడిలార్డర్లోనే ఆడనున్న రాహుల్‌.. ఈ మ్యాచ్‌లో పెద్ద స్కోరు చేయాల్సిందే. బౌలర్లు  గత రెండు వన్డేల్లోనూ ఒక దశ వరకు గొప్పగా బౌలింగ్‌ చేసి.. తర్వాత చేతులెత్తేయడం జట్టు కొంప ముంచింది. చివరి వన్డేలో అయినా బౌలర్లు ఆద్యంతం నిలకడగా బౌలింగ్‌ చేయాలి. దీపక్‌ చాహర్‌, కుల్‌దీప్‌ సేన్‌ కూడా గాయపడి చివరి వన్డేకు దూరం కావడంతో అదనంగా ఒక స్పిన్నర్‌ను భారత్‌ బరిలోకి దించే అవకాశముంది. షాబాజ్‌ లేదా కుల్‌దీప్‌ ఆ స్థానంలో ఆడతారు. పేస్‌ బాధ్యతలను సిరాజ్‌, శార్దూల్‌, ఉమ్రాన్‌ పంచుకోనుండగా.. స్పిన్‌ భారాన్ని సుందర్‌, అక్షర్‌ మోయనున్నారు. సిరీస్‌లో అదరగొట్టిన మెహదీ హసన్‌ మిరాజ్‌కు తోడు షకిబ్‌, మహ్మదుల్లా లాంటి ఆల్‌రౌండర్లు జట్టుకు మరో విజయాన్ని అందిస్తారన్న ధీమాతో బంగ్లా ఉంది. పేసర్లు ఎబాదత్‌, ముస్తాఫిజుర్‌ కూడా రాణిస్తుండడం సానుకూలాంశం. క్లీన్‌స్వీప్‌తో సిరీస్‌ను మరింత చిరస్మరణీయం చేసుకోవాలనుకుంటున్న బంగ్లాకు భారత్‌ ఎలా అడ్డుకట్ట వేస్తుందో చూడాలి.

తుది జట్లు (అంచనా)...

భారత్‌: ధావన్‌, ఇషాన్‌, కోహ్లి, శ్రేయస్‌, రాహుల్‌ (కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), సుందర్‌, అక్షర్‌ పటేల్‌, శార్దూల్‌, షాబాజ్‌/కుల్‌దీప్‌, సిరాజ్‌, ఉమ్రాన్‌ మాలిక్‌.

బంగ్లాదేశ్‌: లిటన్‌ (కెప్టెన్‌), అనాముల్‌, నజ్ముల్‌, షకిబ్‌, ముష్ఫికర్‌ (వికెట్‌ కీపర్‌), మహ్మదుల్లా, అఫిఫ్‌, మెహదీ మిరాజ్‌, నసుమ్‌ అహ్మద్‌, ముస్తాఫిజుర్‌, ఎబాదత్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు