
‘అతడు తెందూల్కర్‌ను అధిగమిస్తాడు’
లండన్: ఇంగ్లాండ్ కెప్టెన్ జోరూట్ టెస్టు క్రికెట్‌లో ఆల్‌టైమ్ దిగ్గజ బ్యాట్స్‌మన్ సచిన్ తెందూల్కర్ రికార్డులను అధిగమించే వీలుందని, అతడికి ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయని మాజీ క్రికెటర్ జియోఫ్రే బాయ్‌కాట్ కొనియాడారు. ఇటీవల శ్రీలంకతో ఆడిన రెండు టెస్టుల్లో రూట్ 106.50 సగటుతో 426 పరుగులు చేశాడు. 30 ఏళ్ల జోరూట్ ఇప్పటికే 99 టెస్టులు ఆడాడు. అలాగే ఈ ఫార్మాట్‌లో ఇంగ్లాండ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన నాలుగో ఆటగాడిగా నిలిచాడు. ఈ నేపథ్యంలోనే బాయ్‌కాట్ ‘ది టెలిగ్రాఫ్’కు రాసిన కథనంలో ఇలా పేర్కొన్నాడు.
‘ఇంగ్లాండ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన నాలుగో ఆటగాడిగా రికార్డు నెలకొల్పిన రూట్.. 200 టెస్టులు ఆడగలడు. క్రికెట్ దిగ్గజం సచిన్ కన్నా ఎక్కువ పరుగులు చేయగలడు. ఇప్పుడతడి వయసు 30 ఏళ్లే. ఇప్పటికే 99 టెస్టుల్లో 8,249 పరుగులు చేశాడు. అతడికి తీవ్ర గాయాలు కానంత వరకూ తెందూల్కర్ సాధించిన 15,921 పరుగులను అధిగమించకపోవడానికి ఇతర కారణాలు లేవు. అలాగే రూట్‌ను మాజీ దిగ్గజాలతో కాకుండా నేటి తరం ఆటగాళ్లతో పోల్చాలి’ అని బాయ్‌కాట్ అన్నారు.
‘విరాట్ కోహ్లీ, స్టీవ్‌స్మిత్, కేన్ విలియమ్సన్.. రూట్‌తో సమాంతర ఆటగాళ్లు. వీళ్లు కూడా సచిన్ చేసినన్ని పరుగులు చేయగలరు. రూట్‌ను వీరితోనే పోల్చి చూడాలి. పాత తరం దిగ్గజాలతో కాదు. ఎందుకంటే ప్రతీ ఆటగాడు ఆయా పరిస్థితులను బట్టి తయారవుతాడు. ఇక ఈ శ్రీలంక పర్యటనకు ముందు వరకూ రూట్ సరిగా ఆడలేకపోయాడు. అయితే, కరోనాతో లభించిన విరామాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. ఈ సిరీస్‌లో అతడు ఆడుతుంటే తనకి తెలియకుండానే ప్రతీ బంతికీ పరుగులు చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు కనిపించింది. కానీ, ఆస్ట్రేలియా పేస్‌ను అతడు ఎదుర్కోవడంలోనే అసలైన సవాలు ఎదురుకానుంది’ అని ఇంగ్లాండ్ బ్యాటింగ్ దిగ్గజం పేర్కొన్నారు.
ఇవీ చదవండి..
పుజారా అలా చేస్తే.. సగం మీసం గీసుకుంటా
డబ్బుల కోసమే ఐపీఎల్ ఆడుతున్నాడు
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.