అందుకు ఇంగ్లాండ్‌ సిగ్గుపడాలి: బాయ్‌కాట్‌

ఇంగ్లాండ్‌ తమ ఆటగాడు జానీ బెయిర్‌స్టో పట్ల వ్యవహరించిన తీరుపై జట్టు యాజమాన్యం సిగ్గుపడాలని మాజీ సారథి జియోఫ్రే బాయ్‌కాట్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు...

Updated : 12 Feb 2021 14:42 IST

లండన్‌: ఇంగ్లాండ్‌ తమ ఆటగాడు జానీ బెయిర్‌స్టో పట్ల వ్యవహరించిన తీరుపై జట్టు యాజమాన్యం సిగ్గుపడాలని మాజీ సారథి బాయ్‌కాట్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత పర్యటనకు ముందు శ్రీలంకతో రెండు టెస్టులు ఆడిన బెయిర్‌స్టోను పనిభారం పేరిట టీమ్‌ఇండియాతో తొలి రెండు టెస్టులకు దూరం చేశారు. ఈ నేపథ్యంలోనే బాయ్‌కాట్‌ ఇంగ్లాండ్‌ తీరుపై మండిపడ్డారు. లంక పర్యటనలో బాగా ఆడిన బెయిర్‌స్టోను కోహ్లీసేనతో తొలి రెండు టెస్టులకు దూరం పెట్టడం సరికాదన్నారు.

మరోవైపు రెండో టెస్టుకు జోస్‌ బట్లర్‌కు విశ్రాంతినిచ్చి బెన్‌ ఫోక్స్‌కు వికెట్‌ కీపింగ్‌ బాధ్యతలు అప్పగించడంపైనా బాయ్‌కాట్‌ విమర్శలు గుప్పించారు. ‘బట్లర్‌ విశ్రాంతి కోసం భారత్‌ నుంచి ఇంగ్లాండ్‌కు వస్తున్నాడని తెలిసింది. అయితే, అతడి స్థానాన్ని బెయిర్‌స్టోతో పూరించకపోవడం బాధగా ఉంది. బెయిర్‌స్టో.. బ్యాట్స్‌మన్‌, కీపర్‌గా ఆడటం ఇంగ్లాండ్ ఛీఫ్‌ సెలెక్టర్‌ ఎడ్‌ స్మిత్‌కు ఇష్టం లేదు. అందుకే అతడు బెన్‌ఫోక్స్‌కు అవకాశం ఇచ్చాడు’ అని బాయ్‌కాట్‌ ఓ అంతర్జాతీయ పత్రికతో అన్నారు.

‘బెయిర్‌స్టోకు ఎప్పుడూ తన తండ్రిలాగే కీపర్‌-బ్యాట్స్‌మన్‌గా రాణించాలని ఇష్టం. కేవలం బ్యాట్స్‌మన్‌గా ఆడటం అతడికి నచ్చదు. కానీ, స్మిత్‌ ఆ నిర్ణయం తీసుకున్నారు. అది సరైంది కాదు. అతడి విషయంలో జట్టు ప్రవర్తించిన తీరుతో యాజమాన్యం సిగ్గుపడాలి. లంక పర్యటన తర్వాత బెయిర్‌స్టోను బలవంతంగా ఇంగ్లాండ్‌కు పంపించారు. అతడికి ఇష్టం లేకున్నా అలా చేశారు. అతడికి టీమ్‌ఇండియాతో ఆడాలని ఉంది. వాళ్లకు అవసరమైనప్పుడు వచ్చి ఆడాలి. గంగిరెద్దులా తల ఊపాలి’ అని బాయ్‌కాట్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక రెండో టెస్టులో విజయం సాధించాలంటే ఇంగ్లాండ్‌ అత్యుత్తమ ఆటగాళ్లని ఎంపిక చేయాలని, అయితే ఏదో ఒక పరిస్థితిలో అది బలహీనంగా మారుతుందని మాజీ సారథి అభిప్రాయపడ్డారు.

ఇవీ చదవండి..
నాకింకా 38 ఏళ్లే.. ఇప్పుడు కాకపోతే వచ్చే ఏడాది
ఐపీఎల్‌ తుది జాబితాలో 292 మంది ఆటగాళ్లు 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని