Hockey World Cup 2023: హాకీ ప్రపంచకప్‌ విజేత జర్మనీ

హాకీ పురుషుల ప్రపంచకప్‌లో విజయం కోసం చివరి నిమిషం వరకు జర్మనీ, బెల్జియం జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ఫేవరెట్‌గా బరిలోకి దిగిన బెల్జియం ఆట ప్రారంభం నుంచి ప్రత్యర్థి జట్టుపై ఆధిపత్యం ప్రదర్శించింది. 

Updated : 29 Jan 2023 22:27 IST

భువనేశ్వర్‌: హాకీ పురుషుల ప్రపంచకప్ 2023 (Hockey World Cup 2023) టైటిల్‌ను జర్మనీ (Germany) గెలుచుకుంది. ఆదివారం భువనేశ్వర్‌(Bhubaneswar)లోని కళింగ స్టేడియం (Kalinga Stadium)లో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ బెల్జియం (Belgium)పై జర్మనీ షూటౌట్‌లో 5-4 తేడాతో ఘన విజయం సాధించింది. ప్రపంచకప్‌ కోసం చివరి నిమిషం వరకు ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ఫేవరెట్‌గా బరిలోకి దిగిన బెల్జియం ఆట ప్రారంభం నుంచి ప్రత్యర్థి జట్టుపై ఆధిపత్యం ప్రదర్శించినప్పటికీ, అసాధారణ ఆట తీరుతో జర్మనీ ప్రపంచకప్‌ విజేతగా నిలిచింది. 

తొలి క్వార్టర్‌లో బెల్జియం ఆటగాళ్లు వాన్‌ అయిబెల్‌, టాంగీ కోసిన్స్‌ చెరో గోల్‌ చేసి జర్మనీపై ఒత్తిడి పెంచారు. రెండో క్వార్టర్‌లో జర్మనీ ఆటగాడు నిక్లస్‌ వెల్లెన్‌ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచాడు. మూడో క్వార్టర్‌లో జర్మనీ మరో గోల్‌ సాధించడంతో ఇరు జట్లు చెరో రెండు పాయింట్లు సాధించాయి. నాలుగో క్వార్టర్‌ ప్రారంభమైన మూడో నిమిషంలో జర్మనీ ఆటగాడు మాట్స్‌ గ్రాంబుష్‌ గోల్‌ చేసి డిఫెండర్‌ బెల్జియంపై ఒత్తిడి పెంచారు. చివరి నిమిషంలో బెల్జియంకు లభించిన పెనాల్టి కార్నర్‌ను గోల్‌గా మలచడంతో ఇరు జట్ల స్కోర్లు 3-3తో సమయ్యాయి. దీంతో పెనాల్టీ షూటౌట్‌ అనివార్యమైంది. ఇందులో బెల్జియం నాలుగు గోల్స్‌ చేయగా, జర్మనీ ఐదు గోల్స్‌ సాధించింది. ఈ విజయంతో జర్మనీ ప్రపంచకప్‌ను ఎగరేసుకుపోయింది. ఇది జర్మనీకి పురుషుల హాకీలో మూడో ప్రపంచకప్‌ కావడం విశేషం. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని