Ben Stokes: సాప్ట్‌ సిగ్నల్‌ను తొలగించండి.. ఐసీసీకి బెన్‌ స్టోక్స్‌ సూచన

ఆన్‌ ఫీల్డ్ అంపైర్లు ఇచ్చే స్టాప్‌ సిగ్నల్‌ను తొలగించాలని ఇంగ్లాండ్‌ టెస్టు కెప్టెన్‌ బెన్‌స్టోక్స్‌ (Ben Stokes) ఐసీసీ (ICC)కి సూచించాడు.

Published : 06 Jan 2023 23:46 IST

ఇంటర్నెట్ డెస్క్: స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో ఆసీస్‌ పట్టుబిగిస్తోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్ల నష్టానికి 475 పరుగులు చేసింది. ఉస్మాన్‌ ఖవాజా (195) డబుల్ సెంచరీకి చేరువలో ఉండగా.. మాట్ రెన్షా (5) క్రీజులో ఉన్నారు. కాగా, ఈ మ్యాచ్‌లో ఓ క్యాచ్‌ వివాదాస్పదం అయింది. తొలి రోజు ఆటలో ఆసీస్‌ బ్యాటర్‌ మార్కస్‌ లబుషేన్‌ (Marnus Labuschagne) 70 పరుగుల వద్ద ఉన్నప్పుడు మార్కో జాన్సన్‌ బౌలింగ్‌లో బంతి.. బ్యాట్‌కు తగిలి స్లిప్‌లో ఉన్న సైమన్ హార్మర్ చేతిలో పడింది. బంతి నేలను తాకిందా అనే విషయంలో అంపైర్‌ పాల్‌ రీఫిల్‌కు స్పష్టతలేక సాప్ట్‌ సిగ్నల్‌ ద్వారా ఔట్‌గా ప్రకటించి క్యాచ్‌పై స్పష్టత కోసం థర్డ్ అంపైర్‌కు రిఫర్‌ చేశాడు. రీప్లేలో వివిధ కోణాల్లో పరిశీలించిన తర్వాత బంతి చేతివేళ్ల మధ్యలో నుంచి నేలను తాకినట్లు తేలింది. దీంతో లబుషేన్‌ని నాటౌట్‌గా ప్రకటించారు. దీంతో ఈ క్యాచ్‌ వివాదస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్‌ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఐసీసీకి (ICC) కీలకమైన సూచన చేశాడు. 

‘సాఫ్ట్ సిగ్నల్‌ విధానాన్ని ఐసీసీ తొలగించాలి. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్న థర్డ్‌ అంపైర్‌ నిర్ణయం తీసుకునేలా చూడండి.  వివాదాలన్నీ ఆన్‌ ఫీల్డ్‌ అంపైర్లు ఇచ్చే సాప్ట్‌ సిగ్నల్‌ చుట్టే తిరుగుతున్నాయి. ఇది నిర్ణయంపై కామెంట్‌ కాదు.. సమాచారం కోసమే’ అని బెన్‌స్టోక్స్‌ ట్వీట్‌ చేశాడు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని