Shubman: టెస్టుల్లో గిల్‌ అలవోకగా 8 వేల నుంచి 10 వేల పరుగులు చేయగలడు: సన్నీ

బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ - ఆస్ట్రేలియా జట్ల (IND vs AUS) మధ్య నాలుగో టెస్టు జరుగుతోంది. భారత యువ బ్యాటర్ శుభ్‌మన్‌ గిల్ (Shubman Gill) సెంచరీ సాధించాడు.  

Updated : 11 Mar 2023 16:16 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీమ్‌ఇండియా యువ బ్యాటర్ శుభ్‌మన్‌ గిల్ (Shubmna Gill) ఆసీస్‌పై సెంచరీ సాధించాడు. ప్రస్తుతం 15వ టెస్టు ఆడుతున్న గిల్‌కిది రెండో శతకం. బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో (Border - Gavaskar Trophy) మూడో టెస్టుకు కేఎల్‌ రాహుల్‌కు బదులు గిల్‌ తుది జట్టులోకి వచ్చాడు. కానీ, మూడో టెస్టులో గొప్పగా రాణించకపోయినా.. కఠిన పిచ్‌పై ఫర్వాలేదనిపించాడు. అయితే, నాలుగో టెస్టులో (IND vs AUS) మాత్రం తొలి ఇన్నింగ్స్‌లోనే శతకం (128) బాదేశాడు. ఓవైపు రోహిత్ శర్మ, పుజారా పెవిలియన్‌కు చేరినా.. గిల్‌ మాత్రం ఒత్తిడికి లోనుకాకుండా ఆత్మవిశ్వాసంతో ఆడి సెంచరీ కొట్టాడు. ఈ క్రమంలో గిల్ ప్రదర్శనను టీమ్‌ఇండియా క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ పొగడ్తలతో ముంచెత్తాడు. ఇలాగే ఆడితే భవిష్యత్తులో టెస్టు ఫార్మాట్‌లో అలవోకగా 8 వేల నుంచి 10 వేల పరుగులను సాధించగలడని పేర్కొన్నాడు. మిచెల్ స్టార్క్‌ వంటి పేసర్‌ బౌలింగ్‌ను గిల్‌ చాలా తేలికగా ఆడుతున్నాడని, చూసేందుకు అద్భుతంగా ఉందని తెలిపాడు. ప్రస్తుతం గిల్‌ 15 టెస్టుల్లో 28 ఇన్నింగ్స్‌ల్లో 57.64 స్ట్రైక్‌రేట్‌తో 890 పరుగులు చేశాడు.

‘‘శుభ్‌మన్ గిల్ ఇంకా కుర్రాడే. అతడికి చాలా మంచి భవిష్యత్తు ఉంది. ముందుకొచ్చి మరీ డిఫెన్స్ ఆడే తీరు బాగుంది. మిచెల్ స్టార్క్‌ బౌలింగ్‌లోనూ ఇబ్బంది పడటం లేదు. ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్‌ చేస్తున్న విధానం ముచ్చటేస్తోంది. కేవలం బ్యాక్‌ఫుట్‌ మీదనే కాకుండా ముందుకొచ్చి ఆడిన విధానం కూడా నచ్చింది. టెస్టు క్రికెట్‌కు ఇది చాలా అవసరం. అందుకే ఇలాగే కొనసాగితే మాత్రం శుభ్‌మన్‌ గిల్‌ అలవోకగా 8 వేల నుంచి 10వేల పరుగులు కూడా  సాధించేందుకు వీలుంది. బౌలర్ల లైన్ అండ్ లెంగ్త్‌ను అద్భుతంగా అంచనా వేస్తూ ముందుకు సాగడం గొప్ప విషయం’’ అని సునీల్ గావస్కర్‌ చెప్పాడు.  ప్రస్తుతం నాలుగో టెస్టులో శతకం సాధించిన గిల్‌ భారత స్కోరు బోర్డును ముందుండి నడిపించాడు. అంతకుముందు ఆసీస్ తన తొలి ఇన్నింగ్స్‌లో 480 పరుగులు చేసిన విషయం తెలిసిందే.

ఆసీస్‌తో నాలుగో టెస్టు: భారత్ తొలి ఇన్నింగ్స్‌ స్కోరు 254/3 (85)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు