Ganguly : రహానె, పుజారా.. వెళ్లి రంజీ మ్యాచులు ఆడండి! : సౌరవ్‌ గంగూలీ

ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్న టీమ్‌ఇండియా సీనియర్‌ ఆటగాళ్లు అజింక్య రహానె, ఛెతేశ్వర్ పుజారాలిద్దరూ రంజీ క్రికెట్‌ ఆడాలని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ సూచించాడు. ఆ టోర్నీ ద్వారా...

Published : 04 Feb 2022 02:14 IST

ఇంటర్నెట్ డెస్క్‌ : ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్న టీమ్‌ఇండియా సీనియర్‌ ఆటగాళ్లు అజింక్య రహానె, ఛెతేశ్వర్ పుజారాలిద్దరూ రంజీ క్రికెట్‌ ఆడాలని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ సూచించాడు. ఆ టోర్నీ ద్వారా వాళ్లిద్దరూ మునుపటి ఫామ్‌ను అందుకోగలుగుతారని అతడు పేర్కొన్నాడు. గత కొంత కాలంగా రహానె, పుజారాలు నిలకడగా రాణించలేకపోతున్న విషయం తెలిసిందే.

‘అజింక్య రహానె, ఛెతేశ్వర్‌ పుజారా ఇద్దరూ చాలా నాణ్యమైన ఆటగాళ్లు. అందులో ఎలాంటి సందేహం లేదు. గతంలో టీమ్‌ఇండియాకు ఎన్నో విజయాలు అందించారు. ప్రస్తుతం ఫామ్‌ కోల్పోయి కాస్త ఇబ్బంది పడుతున్నారు. రంజీ మ్యాచులు ఆడితే మళ్లీ మునుపటి ఫామ్‌ అందుకోవడం వాళ్లకు పెద్ద కష్టమేం కాదు. ఇన్నేళ్లు అంతర్జాతీయ క్రికెట్‌ ఆడిన తర్వాత కూడా మళ్లీ రంజీ మ్యాచులు ఆడటమేంటని అనుకోవద్దు. రంజీ కూడా పెద్ద టోర్నమెంటే. గతంలో చాలా మంది దిగ్గజ క్రికెటర్లు ఫామ్‌ కోల్పోయినప్పుడు రంజీ క్రికెట్‌ ఆడి.. మళ్లీ భారత జట్టులోకి పునరాగమనం చేశారు. 2005లో నేను కూడా రంజీ క్రికెట్‌ ఆడిన తర్వాతే మళ్లీ మునుపటి ఫామ్‌ను అందుకోగలిగా. అందుకే, వీళ్లిద్దరూ రంజీ క్రికెట్‌ను తక్కువ అంచనా వేయరనుకుంటున్నాను’ అని గంగూలీ చెప్పాడు

* కరోనా కాలంలో టోర్నీలు నిర్వహించడం సవాలే..  

‘కరోనా కారణంగా టోర్నీల నిర్వహణకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆటగాళ్ల ఆరోగ్యం దృష్ట్యా 2020-21 రంజీ ట్రోఫీని నిర్వహించలేకపోయాం. భారత్‌కిది చాలా ముఖ్యమైన టోర్నమెంట్‌. ఆఖరి నిమిషం వరకు ఆ ట్రోఫీని నిర్వహించేందుకు ప్రయత్నించి విఫలమయ్యాం. ప్రస్తుత కరోనా పరిస్థితుల దృష్ట్యా.. ఏ టోర్నీని నిర్వహించాలన్నా పెద్ద సవాల్‌గా మారింది. అయినా, ఎలాంటి ఆటంకం లేకుండా అంతర్జాతీయ సిరీస్‌లను నిర్వహించగలుగుతున్నాం. దీన్ని అదృష్టంగా భావించాలి’ అని గంగూలీ పేర్కొన్నాడు.

కరోనా కారణంగా గతేడాది ఐపీఎల్‌ను రెండు విడతల్లో నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కరోనా మూడో వేవ్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో రంజీ ట్రోఫీని కూడా రెండు విడతల్లో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఇటీవల టీమ్‌ఇండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌, శ్రేయస్‌ అయ్యర్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌లు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని