Team India: ధావన్‌ వస్తాడా...? ఇషాన్‌కే అవకాశాలు ఇస్తారా..? అశ్విన్‌ స్పందన ఇదీ..

భారత్‌ వేదికగానే వన్డే ప్రపంచకప్‌ 2023 (ODI WC 2023) జరగనుంది. దీంతో కప్‌ను నెగ్గాలనే కృతనిశ్చయంతో టీమ్‌ఇండియా (Team India) ప్రయత్నాలను ముమ్మరం చేసింది.

Updated : 31 Jan 2023 13:36 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వన్డే ప్రపంచకప్‌ 2023 మెగా టోర్నీ సన్నాహకాలను టీమ్‌ఇండియా ఇప్పటికే ప్రారంభించిన విషయం తెలిసిందే. వరుసగా శ్రీలంక, న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లను భారత్ కైవసం చేసుకొంది. వన్డే ప్రపంచకప్‌ కోసం 20 మంది ఆటగాళ్లను సిద్ధం చేస్తున్నట్లు సెలెక్షన్ కమిటీ చెప్పింది. కానీ ఆ జాబితా మాత్రం బయటకు రాలేదు. పైన రెండు సిరీసుల్లోనూ టీమ్‌ఇండియా సీనియర్ ఆటగాడు శిఖర్ ధావన్‌ మాత్రం ఆడలేదు. రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత్‌ జట్టులో ఇషాన్‌ కిషన్, శుభ్‌మన్‌ గిల్‌కు అవకాశం దొరికింది. వీరిద్దరూ ఇప్పటికే వన్డేల్లో డబుల్‌ సెంచరీ సాధించారు. దీంతో శిఖర్‌కు అవకాశం దొరుకుతుందో.. లేదో..? అనే అనుమానాలు అభిమానుల్లో కలిగాయి. తాజాగా దీనిపై రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్‌లో స్పందించాడు. వన్డే క్రికెట్‌లో ధావన్‌ను అగ్రస్థాయి ఆటగాడిగా అభివర్ణించాడు.

‘‘గతంలో టాప్‌ -3 బ్యాటర్లు విఫలమైనప్పుడు ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాం. శిఖర్ ధావన్‌, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వీరంతా అగ్రశ్రేణి ఆటగాళ్లు. అయితే మనం ఎక్కువగా రోహిత్, విరాట్ గురించే మాట్లాడుతుంటాం. కానీ, శిఖర్ ధావన్‌ కూడా టాప్‌ బ్యాటర్. అతడు తన బాధ్యతలను నిశ్శబ్దంగా పూర్తి చేస్తాడు. అతడు ఇటీవల ఆడటం లేదు. మరి ధావన్‌ లేని లోటు టీమ్‌ఇండియాకు శూన్యంగా మారనుందా..? శిఖర్ ధావన్‌ను మళ్లీ జట్టులోకి తీసుకొస్తారా..? లేదా డబుల్‌ సెంచరీ చేసిన ఇషాన్‌ కిషన్‌కే ఇంకా అవకాశాలు ఇస్తూ ఉంటారా? అనేది వేచి చూడాలి. అయితే భారీ స్కోరు చేశాడనే కారణంగా ఓ ఆటగాడికి మద్దతు ఇచ్చే బదులు.. జట్టుకు ఏం అవసరమో చూడాలి. ఒత్తిడిలో ఎవరు బాగా ఆడతారనేది గమనించాలి’’ అని అశ్విన్‌ తెలిపాడు. శిఖర్ ధావన్‌ 167 వన్డేల్లో 6,793 పరుగులు చేశాడు. ఇందులో 17 సెంచరీలు, 39 అర్ధశతకాలు ఉన్నాయి. ఇషాన్‌ కిషన్ కేవలం 13 మ్యాచుల్లోనే 507 పరుగులు సాధించాడు. ఇందులో డబుల్‌ సెంచరీతోపాటు మూడు అర్ధశతకాలు ఉన్నాయి. ఇద్దరూ లెఫ్ట్‌ఆర్మ్ బ్యాటర్లు కావడం విశేషం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని