జడ్డూ..పాండ్య.. కుల్చా.. చీకటి వెలుగుల కథ!

క్రికెట్‌ చాలా విచిత్రమైన ఆట! ఇది ఎప్పుడూ చెప్పే మాటే. కానీ ప్రతి సందర్భానికీ నప్పే మాట! ఎంతమంది అందుబాటులో ఉన్నా జట్టులోకి తీసుకొనేది 11 మందినే. అందుకే ఒకరి అవకాశం మరొకరికి...

Updated : 01 Jun 2021 10:17 IST

ఒకరి ఆనందం మరొకరికి తీరని ఆవేదన

క్రికెట్‌ చాలా విచిత్రమైన ఆట! ఇది ఎప్పుడూ చెప్పే మాటే. కానీ, ప్రతి సందర్భానికీ నప్పే మాట! ఎంతమంది అందుబాటులో ఉన్నా జట్టులోకి తీసుకొనేది 11 మందినే. అందుకే ఒకరి అవకాశం మరొకరికి అశనిపాతమవుతుంది. పరిస్థితులను దారుణంగా మార్చేస్తుంది. ఐదేళ్లుగా ఐదుగురితో క్రికెట్‌ ఇలాగే ఆడుకుంటోంది. ఒక్కోసారి ఆనందాన్ని మరోసారి ఆవేదనను పంచుతోంది. ఆ ఐదుగురు ఎవరు? వారి చీకటి వెలుగుల కథ ఏంటి? తెలుసుకోవాలని ఉందా?


పాండ్యతో.. టర్నింగ్‌

హార్దిక్‌ పాండ్య.. టీమ్‌ఇండియా ఎన్నాళ్లుగానో వెతుకుతున్న పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌. అటు బ్యాటింగ్‌ ఇటు బౌలింగ్‌తో దుమ్మురేపుతున్న అతడిని చూసి దేశమంతా గర్వించింది. అదే సమయంలో కుల్‌దీప్‌ యాదవ్‌, యుజ్వేంద్ర చాహల్‌ మణికట్టు మాంత్రికులుగా స్థిరపడిపోయారు. దూకుడుగా బంతులేస్తూ వికెట్లు తీస్తున్న వారిని చూసి జట్టు యాజమాన్యం మురిసిపోయింది. సమతూకం దొరికిందని ఆనందపడింది. అదే సమయంలో ఎడమచేతి వాటం స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా పరిస్థితి దయనీయంగా మారింది. మరోవైపు యువ ఆటగాడు అక్షర్‌పటేల్‌ తనకెప్పుడు చోటు దొరుకుతుందా అని ఎదురు చూస్తున్నాడు. కాలచక్రం గిర్రున తిరిగింది. పరిస్థితులు తారుమారయ్యాయి. జడ్డూ, అక్షర్‌ ఇప్పుడు దుమ్మురేపుతున్నారు. కుల్‌దీప్‌, చాహల్‌ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. స్వర్ణదశ పోయి గడ్డుకాలం అనుభవిస్తున్నారు.


టీ20ల్లో దక్కని చోటు

2016, జనవరి 26న ఆస్ట్రేలియాపై టీ20ల్లో అరంగేట్రం చేశాడు హార్దిక్‌. వరుసగా 16 టీ20లు ఆడాడు. పనిభారం దృష్ట్యా ఆ తర్వాత అతడికి విశ్రాంతినిచ్చారు. అదే సమయంలో జడ్డూకు కొన్ని మ్యాచుల్లో చోటు దక్కలేదు కానీ, 17 టీ20లు ఆడటం గమనార్హం. ఆ తర్వాత అతడి కెరీర్లో చీకటి రోజులు మొదలయ్యాయి. 2017లో వెస్టిండీస్‌తో తొలి టీ20 ఆడిన జడ్డూ ఇక పొట్టి క్రికెట్లో కనిపించలేదు. దాదాపు 33 టీ20ల్లో అతడిని దూరం పెట్టారు. అంటే 2017, జులై నుంచి 2019, ఆగస్టు వరకు కనిపించనే లేదు. ఈ సమయంలో పాండ్య ఏకంగా 24 టీ20లు ఆడటం గమనార్హం. మళ్లీ పాండ్య గాయపడే వరకు జడ్డూకు చోటు దొరకలేదు. 2019లో 6, 2020లో 4 మ్యాచులు ఆడాడు.


వన్డేల్లోనూ అంతే..

వన్డేల్లోనూ ఇదే సన్నివేశం పునరావృతమైంది. 2016లో ఆసీస్‌పై వరుసగా ఐదు వన్డేలు ఆడిన జడ్డూకు జింబాబ్వే, న్యూజిలాండ్‌ సిరీసుల్లో చోటు దక్కలేదు. 2017లో ఇంగ్లాండ్‌తో 3, ఛాంపియన్స్‌ ట్రోఫీలో 4 మ్యాచుల్లో అవకాశం దక్కింది. విండీస్‌లో ఐదు వన్డేలకు ఆఖరి రెండింట్లో చోటిచ్చారు. 50 ఓవర్ల ఫార్మాట్లో అతడిని చూడటం అదే ఆఖరు. 2017 జులై నుంచి 2018 సెప్టెంబర్‌ వరకు 27 వన్డేల్లో అతడికి అవకాశం రాలేదు. పాండ్య గాయపడటం వల్లే 2018 ఆసియాకప్‌లో చోటు దొరికింది. ఆ తర్వాత కివీస్‌ సిరీసుకు పక్కన పెట్టేశారు. ఆసీస్‌పై 5 వన్డేల్లో నాలుగింట్లో అవకాశం ఇచ్చారు. పాండ్యకు తుది జట్టులో చోటివ్వడంతో ఐసీసీ వన్డే ప్రపంచకప్‌-2019లో జడ్డూకు కేవలం రెండింట్లోనే అదృష్టం వరించింది. గాయం వల్ల ఆ తర్వాత పాండ్య 12 వన్డేలు ఆడకపోవడంతో జడ్డూ పునరాగమనం చేశాడు. ఆసీస్‌పై 3 వన్డేలాడిన జడ్డూకు టెస్టు సిరీసులో గాయం అవ్వడంతో ఇంటికొచ్చేశాడు. ఇంగ్లాండ్‌ సిరీసుకు దూరమయ్యాడు. అందులో పునరాగమనం చేసిన పాండ్య బ్యాటుతో ఆకట్టుకున్నా.. ఆల్‌రౌండర్‌గా సేవలు అందించలేదు.


నిద్రలేని రాత్రులు.. ఆపై విజయం

జట్టులో అవకాశాలు లేకపోవడం.. బయట నుంచి విమర్శలు రావడంతో జడ్డూ నిద్రలేని రాత్రులు గడిపాడు. మైదానంలో చిరుతలా పరుగెత్తే అతడికి పడకపై ఉదయం 3-4 వరకు కంటిమీద కునుకు ఉండేది కాదు. తుది జట్టులో చోటు ఎలా దక్కుతుంది? అందుకోసం ఏం చేయాలన్న తపనతోనే ఉండేవాడు. హార్దిక్‌ పాండ్య గాయపడటంతో జట్టులోకి వచ్చిన జడ్డూ ఆ తర్వాత రెచ్చిపోయాడు. బంతితో వికెట్లు తీయడం.. పరుగులు నియంత్రించడమే కాకుండా బ్యాటుతో మెరుపులు మెరిపించాడు. వేగంగా అర్ధశతకాలు బాదుతూ.. సిక్సర్లు కొడుతూ.. ‘బిట్స్‌ అండ్‌ పీసెస్‌’ విమర్శకులకు దీటుగా జవాబిచ్చాడు. బ్యాటుతో కత్తిసాము చేస్తూ ఆకట్టుకున్నాడు.

2019లో వన్డేల్లో 9 ఇన్నింగ్సుల్లోనే 34.33 సగటుతో 206 పరుగులు చేశాడు. ప్రపంచకప్‌ సెమీస్‌లో కివీస్‌ నిర్దేశించిన 240 పరుగుల లక్ష్య ఛేదనలో అతడి తెగువను, ఆటను ఎంత ప్రశంసించినా తక్కువే. రాహుల్‌, కోహ్లీ, రోహిత్‌ ఒక్క పరుగుకే ఔటై కష్టాల్లో పడ్డ వేళ.. మహీ (50; 72 బంతుల్లో 1×4, 1×6)తో కలిసి జడ్డూ (77; 59 బంతుల్లో 4×4, 4×6) చేసిన పరుగులు, నెలకొల్పిన భాగస్వామ్యం ఎంతో విలువైనవి. దాదాపు అతడు మ్యాచును గెలిపించినంత పనిచేశాడు. 2020లో 7 ఇన్నింగ్సుల్లోనే 55.75 సగటుతో 223 పరుగులు చేసి జడ్డూ తన చోటుకు ఢోకా లేకుండా చేసుకున్నాడు. ఈడెన్‌ పార్క్‌లో కివీస్‌పై 55, ఆసీస్‌పై మనుక ఓవల్‌లో 66*తో అదరగొట్టాడు. ఇక 2019లో 12, 2020లో 7 వికెట్లు పడగొట్టడం గమనార్హం.


‘కుల్చా’ స్వర్ణయుగం

ఏడాది వ్యవధిలో టీమ్‌ఇండియాలో అడుగుపెట్టారు యుజ్వేంద్ర చాహల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌. కుడి.. ఎడమ కూర్పు.. ఒకరిది చైనామన్‌ శైలి కావడం.. ఊరించే బంతులతో వికెట్లు తీస్తూ మణికట్టు ద్వయంగా జట్టులో స్థిరపడిపోయారు. ‘కుల్చా ఎఫెక్ట్‌’ ధాటికి ప్రత్యర్థులు నిజంగానే వణికిపోయారు. వారి బౌలింగ్‌లో ఆడేందుకు ఇబ్బంది పడ్డారు. దాంతో ఈ జోడీకిక తిరుగులేదనే అంతా భావించారు. పాండ్య పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ కావడం, వీరిద్దరూ స్పిన్నర్లు కావడంతో జట్టుకు ఇక ఫింగర్‌ స్పిన్నర్లతో అవసరం లేకుండా పోయింది. 2017-2019 వరకు వీరిది స్వర్ణయుగమే అనాలి. ఎంఎస్‌ ధోనీ వికెట్ల వెనకాల సలహాలు ఇవ్వడం.. ఫీల్డర్లను మోహరించడం.. వ్యూహాలు రచించడంతో వీరి జోడీ హిట్టయ్యింది. అటువైపు జడ్డూకు నిద్రలేని రాత్రులు కొనసాగాయి.


పాండ్య గాయం.. ధోనీ పోకతో..

మూడు ఫార్మాట్లలో 91 మ్యాచులాడిన కుల్‌దీప్‌ 170 వికెట్లు తీశాడు. 2017లో 24 మ్యాచుల్లో 43; 2018లో 31 మ్యాచుల్లో 76; 2019లో 26 మ్యాచుల్లో 41 వికెట్లు తీశాడు. మరోవైపు పరిమిత ఓవర్ల క్రికెట్లో 102 మ్యాచులాడిన చాహల్ 154 వికెట్లు తీశాడు. 2017లో 25 మ్యాచుల్లో 44; 2018లో 30 మ్యాచుల్లో 47; 2019లో25 మ్యాచుల్లో 37 వికెట్లు తీశాడు. కానీ ధోనీ వెళ్లిపోగానే వీరికి ఇబ్బందులు ఎదురయ్యాయి. హఠాత్తుగా ఫామ్‌ కోల్పోయారు. 2020, 21లో వీరి ప్రదర్శన పేలవం. పాండ్య స్థానంలో వచ్చిన జడ్డూ స్పిన్నర్‌ కావడం.. వీరిని తీసుకుంటే సమతూకం కుదరకపోవడంతో క్రమంగా చోటు దక్కని పరిస్థితికి చేరుకున్నారు. ఎడమచేతి వాటమే కావడం.. ఫింగర్‌ స్పిన్నర్‌ ఆల్‌రౌండరే కావడంతో అక్షర్‌ పటేల్‌కూ ఇన్నాళ్లూ చోటుదొరకలేదు. జడ్డూ దూరమైన ఇంగ్లాండ్‌ సిరీసులో అతడు తన రెండు చేతులతో అవకాశం ఒడిసిపట్టడం మనందరికీ తెలిసిందే.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని